HMPV Virus – Hyderabad | చైనాలో కరోనా తరహా వైరస్ హెచ్ఎంపీవీ దేశంలోకి ఎంటరైంది. చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ బయట పడగానే ప్రపంచ దేశాలు అలర్టయ్యాయి. కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలను ఆదేశించినా తెలంగాణ ప్రభుత్వం మాత్రం కిమ్మనకుండా ఉండిపోయిందన్న విమర్శలు ఉన్నాయి. రాష్ట్రంలో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదు కాలేదని తెలంగాణ ప్రజారోగ్య విభాగం ప్రకటించింది. దానికి భిన్నంగా ఓ ప్రైవేట్ ల్యాబరేటరీలో జరిగిన పరీక్షల్లో గత నెలలో నిర్వహించిన వైద్య పరీక్షల్లో 11 మందికి హెచ్ఎంపీవీ పాజిటివ్ అని వచ్చిందని మంగళవారం తేలింది.
గత నెలలో పలువురు వైరల్ ఇన్ఫెక్షన్లతో బాధపడుతుండటంతో హైదరాబాద్‌లోని మణి మైక్రోబయాలజికల్ ల్యాబోరేటరీ 258 మందికి శ్వాస కోశ వైద్య పరీక్షలు నిర్వహించింది. వాటిలో 205 మందికి ఎగువ శ్వాసకోశ సమస్యలు ఉన్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది. వీటిలో 11 శాంపిల్స్‌లో హెచ్ఎంపీవీ పాజిటివ్ అని తేలిందని మణి మైక్రో బయాలజీ ల్యాబోరేటరీ పేర్కొంది.
‘హెచ్ఎంపీవీ వైరస్ కొత్తదేం కాదు.. ప్రజలు ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. సుదీర్ఘ కాలంగా హెచ్ఎంపీవీ వైరస్ భారత్‌లో ఉంది అని భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) ప్రకటించింది. మణి మైక్రో బయాలజికల్ ల్యాబోరేటరీలో నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఐదు శాతం శాంపిల్స్‌లో హెచ్ఎంపీవీ వైరస్ ఉన్నట్లు నిర్ధారించారు’ అని హైదరాబాద్ పిల్లల వైద్యులు డాక్టర్ శివరంజినీ సంతోష్ చెప్పారు.
హెచ్ఎంపీవీతోపాటు మణి మైక్రో బయాలజికల్ ల్యాబోరేటరీ టెస్టింగ్ డేటా ప్రకారం 94 శాంపిల్స్ బ్యాక్టీరియల్ న్యూమోనియా, 62 రినో వైరస్, 33 అడెనో వైరస్ కేసులు ఉన్నాయని తేలింది. తొమ్మిది కేసుల్లో ఇన్‌ఫ్లూయెంజా, ఒక వ్యక్తికి హెచ్1ఎన్1 వైరస్ సోకినట్లు నిర్ధారించారు.