రామగిరి/ నకిరేకల్, మార్చి 22: నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ తీవ్ర కలకలం రేపుతున్నది. శుక్రవారం రాత్రి 10 గంటలకు మొదలైన విచారణ శనివారం రాత్రి వరకు కొనసాగుతూనే ఉంది. ఈ అంశాన్ని జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్ సీరియస్‌గా తీసుకోవడంతో డీఎస్పీ శివరాంరెడ్డి ఆధ్వర్యంలో రహస్యంగా విచారణ చేపడుతున్నారు. పేపర్ లీకేజీతో సంబంధమున్న 11 మందిని అరెస్టు చేసి నల్లగొండ సీసీఎస్‌కు తరలించినా, ఇప్పటి వరకు వివరాలు బయటకు వెల్లడించలేదు. పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెండ్ పీ గోపాల్, డీవో రామ్మోహన్‌రెడ్డిని సస్పెండ్ చేసి షో కాజు నోటీసులు ఇచ్చారు. సమస్యాత్మకంగా మారిన నకిరేకల్‌లో పరీక్ష కేంద్రాల వద్ద ప టిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయలేదన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి.
గోప్యత పాటిస్తున్న అధికారులు
నకిరేకల్ మండల కేంద్రంలోని ఎస్ఎల్బీసీ గురుకుల పాఠశాలలో పదో తరగతి పరీక్షల తొలిరోజు పేపర్ లీకేజీ వ్యవహారం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. దాంతో పరీక్ష కేంద్రం నూతన సీఎస్‌గా వీరారెడ్డి, డీవోగా జమీల్ బేగమ్‌లను నియమించారు. అదే పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయురాలు సుధారాణిని కూడా సస్పెండ్ చేశారు. నకిరేకల్ ఎంఈవో మేక నాగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపడుతున్నారు. ఒక విద్యార్థి డిబార్ అయినట్టు ఆయన తెలిపారు. కాగా, ప్రశ్నాపత్రం లీకేజీపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు చెంతుతున్నా.. అటు విద్యాశాఖ గాని, ఇటు పోలీస్ అధికారులు గాని ఇప్పటివరకు స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం. డీఈవో భిక్షపతిని వివరణ కోరగా.. పేపర్ లీకేజీ వ్యవహారంపై పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారని, బాధ్యులపై విద్యాశాఖ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
సీసీలుగా ఇతర జిల్లాలవారు ; ఉన్నతాధికారుల జోక్యం.. ఇద్దరు సీసీలు రిలీవ్
నిబంధనలకు విరుద్ధంగా ఇతర జిల్లాల్లో ఉపాధ్యాయులుగా విధులు నిర్వర్తిస్తున్నవారిని సీసీలుగా నియమించిన ఘటన రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రాల్లో చోటుచేసుకుంది. నిబంధనల ప్రకారం అదే మండలంలో పనిచేస్తున్నవారిని సీసీలుగా నియమించాల్సి ఉంటుంది. జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రం సీ ఎస్ శ్రీధర్ .. జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఇన్విజిలేటర్‌గా నియమించిన ఆంజనేయులును సీసీగా నియమించుకున్నారు. జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల సీఎస్ ప్రభాకర్‌రెడ్డి నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న మణిపాల్రెడ్డిని సీసీగా నియమించుకున్నారు. సీసీల ద్వారా ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చే ప్రమాదం ఉందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు శుక్రవా రం డీఈవో సుశీంధర్రావుకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఈ విషయం బయటకు పొక్కడంతో సీసీలను శుక్రవారం సా యం త్రం రిలీవ్ చేశారు. శనివారం డీఈవో పరీక్ష కేంద్రాలను సందర్శించారు. విచారణ చేస్తున్నామని, చర్యలుంటాయని తెలిపారు.