హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): చారాణా కోడికి బారాణా మసాలా! అసలు కన్నా కొసరు ఎక్కువ! ఈ సామెతలను నిజంచేస్తూ శ్రీశైలం ఎడమగట్టు కాలువ (SLBC) మరమ్మతుకు రేవంత్ సర్కారు (Congress Govt) సిద్ధమైంది. ప్రారంభంలో ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.2,292 కోట్లు కాగా, నిరుడు రేవంత్ సర్కారు (Revanth Reddy) ఆ అంచనాలను రూ.4,658 కోట్లకు పెంచింది. పోనీ అప్పటికైనా అది పూర్తవుతుందను కుంటే.. సొరంగం కుప్పకూలి పనులు నిలిచిపోవడంతో పాటు ప్రాజెక్టు భవితవ్యమే ప్రశ్నార్థకంలో పడింది. ఇప్పుడు ఎస్ఎల్బీసీ రిపేరు పనులకు సిద్ధమైన ప్రభుత్వం ఏకంగా రూ.10,500 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు సిద్ధంచేసింది. అది కేవలం మరమ్మతులకే! అంటే ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ప్రారంభ అంచనాలకన్నా ఇది నాలుగున్నర రెట్లు ఎక్కువ. నిరుడు పెంచిన అంచనా వ్యయం కన్నా ఇది రెండు రెట్లు ఎక్కువ. రూ.500 కోట్లు ఖర్చుచేస్తే రిపేరు పూర్తయ్యే మేడిగడ్డ ప్రాజెక్టును పక్కనబెట్టి.. ఎటూ కొసెల్లని ఎస్ఎల్బీసీకి మరమ్మతుల పేర పదివేల కోట్లు కుమ్మరించడమే కాంగ్రెస్ మార్కు పాలన! కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కుప్పకూలిన ఎస్ఎల్బీసీ (శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్) పనులను తిరిగి మొదలు పెట్టేందుకు నీటిపారుదల శాఖ సిద్ధమవుతున్నది.
అయితే అంచనా వ్యయాన్ని భారీగా పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ప్రాజెక్టు ప్రారంభంలో అంచనా వ్యయం రూ.2,292 కోట్లు కాగా, నిరుడు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం దీనిని సవరించి రూ.4,658 కోట్లకు చేర్చింది. తాజాగా ఈ మొత్తాన్ని రెట్టింపు కన్నా అధికంగా చేసినట్టు జలసౌధ వర్గాలు తెలిపాయి. అంచనా వ్యయాన్ని రూ.10,500 కోట్లకు పెంచి ప్రతిపాదనలు రూపొందించినట్టు సమాచారం. రాబోయే క్యాబినెట్ సమావేశంలో దీనిపై చర్చించి ఆమోదం పొందాలని భావిస్తున్నట్టు చర్చ జరుగుతున్నది. ఈ అంచనాలను చూస్తుంటే అసలు కన్న కొసరుకే ఖర్చెక్కువ అన్నట్టుగా తయారైందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇంకా తవ్వాల్సింది 9.5 కిలోమీటర్లే
శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నల్లగొండ జిల్లాకు కృష్ణా జలాలను తరలించేందుకు ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును 2005లో రూపొందించారు. రూ.2,292 కోట్లతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన అనుమతులను మంజూరు చేసింది. ప్రాజెక్టు పనులను రూ.1,925 కోట్లతో ఐదేండ్లలో అంటే.. 2010 ఆగస్టు నాటికి పూర్తిచేస్తామని జయప్రకాశ్ అసోసియేట్స్ లిమిటెడ్ అగ్రిమెంట్ చేసుకున్నది. కానీ పూర్తికాలేదు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఆరుసార్లు కాంట్రాక్టు ఏజెన్సీకి గడువును పొడిగించింది. తాజా గడువు ప్రకారం 2026 జూన్ నాటికి పనులు పూర్తి చేయాల్సి ఉన్నది. ప్రాజెక్టులో భాగంగా శ్రీశైలం రిజర్వాయర్ నుంచి డిండి రిజర్వాయర్ వరకు మొత్తం 43.50 కిలోమీటర్లు సొరంగాన్ని తవ్వాల్సి ఉన్నది. ఏకకాలంలో రెండువైపుల నుంచి తవ్వకాలు ప్రారంభించారు.
అచ్చంపేట మండలం దోమలపెంట వద్ద శ్రీశైలం రిజర్వాయర్ గట్టు నుంచి ఇన్లెట్, మహబూబ్‌నగర్ జిల్లా మన్యవారిపల్లె నుంచి అవుట్లెట్ సొరంగం పనులు చేపట్టారు. ఇన్లెట్ వైపు నుంచి 13.93 కిలోమీటర్ల సొరంగం తవ్వారు. నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలోని ఇన్లెట్ టన్నెల్లో 13.93 కిలోమీటర్ వద్ద షీర్ జోన్ (పర్రెలు వారి వదులైన రాతిపొరలు)లో పైకప్పు గత సంవత్సరం ఫిబ్రవరి 22న కూలిపోయింది. ప్రమాదంలో 8 మంది కార్మికులు గల్లంతుకాగా, ఇప్పటివరకు ఇద్దరి మృతదేహాలను మాత్రమే గుర్తించిన సంగతి తెలిసిందే. అవుట్లెట్ వైపు నుంచి దాదాపు 22 కిలోమీటర్ల సొరంగం తవ్వారు. టన్నెల్ బోరింగ్ మిషన్‌కు మరమ్మతుల కారణంగా అక్కడ పనులు ఆగిపోయాయి. మొత్తంగా ఇప్పటివరకు ఇన్లెట్, అవుట్లెట్ నుంచి కలిపి 34.372 కిలోమీటర్ల సొరంగం పనులు పూర్తికాగా, ఇంకా 9.560 కిలోమీటర్ల మేర తవ్వాల్సి ఉన్నది.
రూ.10,500 కోట్లతో తాజా అంచనాలు
ఇన్లెట్ సొరంగం కూలిపోయిన ఘటనలో టీబీఎం పూర్తిగా ధ్వంసమై, పనులు నిలిచిపోయాయి. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం 12 మందితో ఒక టెక్నికల్ కమిటీని, పర్యావరణ మంత్రిత్వశాఖ విధించిన షరతుల మేరకు అధ్యయనం చేసి పనుల సాధ్యాసాధ్యాలను పరిశీలించి, సిఫారసు చేసేందుకు సాంకేతిక నిపుణులతో మరో సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ సబ్ కమిటీ ఎస్ఎల్బీసీ ప్రస్తుత పరిస్థితులపై, తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించింది. సొరంగానికి సంబంధించి ఏ పనులు చేయాలన్నా ప్రస్తుతం జియోఫిజికల్ టెస్ట్‌లను నిర్వహించాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో జాతీయ భౌగోళిక పరిశోధనా సంస్థతోపాటు భారత భూగర్భ సర్వే సంస్థ సహకారంతో ఏరియల్ లైడార్ సర్వేను నిర్వహించేందుకు ప్రభుత్వం ఇప్పటికే రూ.2.30 కోట్లతో అనుమతులు మంజూరు చేసింది. పనులు కొనసాగుతున్నాయి. సొరంగంలో ప్రమాద స్థలం అత్యంత దుర్లభమైన ప్రాంతమని, సున్నితమైందని టీబీఎం పద్ధతిలో పనులను నిర్వహించడం అసాధ్యమని కమిటీ తేల్చిచెప్పింది. డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ టెక్నాలజీ ఒక్కటే శరణ్యమని, అందుకు సంబంధించి ప్రతిపాదనలను సిద్ధం చేసుకోవాలని సూచించింది. దీనికి అనుగుణంగా తాజాగా ఇరిగేషన్‌శాఖ అంచనాలను రూపొందించింది.
క్యాబినెట్లో నిర్ణయం
ఎస్ఎల్బీసీ సొరంగ నిర్మాణం పనులను ఈపీసీ విధానంలో నిర్మాణ ఏజెన్సీ జయప్రకాశ్ అసోసియేట్స్‌కు గతంలో అప్పగించారు. పనులకు సంబంధించి ఎలాంటి ఖర్చయినా నిర్మాణ ఏజెన్సీనే భరించాల్సి ఉన్నది. ప్రస్తుతం ప్రమాదం ఫలితంగా అదనంగా ఇన్వేస్టిగేషన్ సర్వే నిర్వహించాల్సి రావడం, టీబీఎం స్థానంలో డీబీఎం విధానంలో ముందుకు పోవాలని యోచిస్తున్నారు. ఆ మేరకు నిర్ణయం తీసుకోవాలంటే ప్రభుత్వ ఆమోదం తప్పనిసరి. ఇక జేపీ అసోసియేట్స్ కంపెనీకే ఈ పనులను అప్పగించాలా? లేదంటే కొత్తగా టెండర్లను పిలిచి నూతన ఏజెన్సీలను అప్పగించాలా? అనే విషయంపై ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయి. డీబీఎం పద్ధతిలోనూ తామే పనులను పూర్తి చేస్తామని జేపీ అసోసియేట్స్ ముందుకు వచ్చినట్టు సమాచారం. అయితే ప్రభుత్వం అంతగా సుముఖంగా లేదని తెలుస్తున్నది. అదీగాక ప్రాజెక్టు సవరించిన అంచనాలకు క్యాబినెట్ ఆమోదించాల్సి ఉన్నది. క్యాబినెట్లో చర్చించి తుది నిర్ణయం తీసుకునే దిశగా ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తున్నది.
అదనంగా 600 మీటర్లు
నిరుడు టన్నెల్ కూలిన చోట దాదాపు 50 మీటర్ల మేర పేరుకుపోయిన శిథిలాలు, మట్టి, రాళ్లను కూడా తొలగించలేని దుస్థితి ఉన్నదని అధికారులు తేల్చారు. ప్రమాదంలో టీబీఎం పూర్తిగా ధ్వంసమైంది. మున్ముందు మరిన్ని షీర్ జోన్లు ఉన్నాయని గుర్తించారు. ప్రస్తుతం పనులను కొనసాగించాలంటే ప్రమాద స్థలాన్ని తప్పిస్తూ పక్కనుంచి మరో టన్నెల్ నిర్మించి అవుట్లెట్ టన్నెల్‌కు కలపాలని నిర్ణయించారు. ఇలా నిర్మించడం ద్వారా అదనంగా టన్నెల్ నిర్మాణం మరో 600 మీటర్లు పెరుగుతుందని అధికారవర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం సొరంగం అభయారణ్యంలో ఉండటంతో కేంద్రం అనుమతులు తప్పనిసరి. ఆ నిబంధనలకు లోబడి పనులను నిర్వహించాల్సి ఉంటుంది. డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ మెథడ్‌లో పనులు కొనసాగించినా పర్యావరణ శాఖ విధించిన పరిమితులకు లోబడే చేయాల్సి ఉంటుంది. భారీ శబ్దాలు, భూప్రకంపనాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కంట్రోల్ బ్లాస్టింగ్‌లో షార్ట్ బ్లాస్టింగ్ పద్ధతిలో పనులను నిర్వహించేందుకు నిర్ణయించినట్లు తెలుస్తున్నది. ప్రభుత్వం నియమించిన సలహాదారు సైతం అదేవిధానాన్ని సిఫారసు చేశారని అధికారవర్గాలు వెల్లడించాయి.
అసలు కంటే కొసరెక్కువ