హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): ఐదు నెలలుగా ప్రభుత్వం జీతాలు చెల్లించకపోవడంతో 104 సేవల ఔట్సోర్సింగ్ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1072 మంది ఉద్యోగులు 104లో ఒప్పంద ఉద్యోగులుగా సేవలందిస్తున్నారు. వీరికి ఈఎస్ఐ, పీఎఫ్, జీఎస్టీ ట్యాక్సులు పోనూ రూ.15,600 నుంచి రూ.22,750 వరకు వేతనం వస్తున్నది. ఐదు నెలలుగా వీరికి జీతాలు రాకపోవడంతో కుటుంబపోషణ బారంగా మారిందని తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఆరోగ్యశాఖ మంత్రి, కమిషనర్, డీఎంఈ దృష్టికి తీసుకెళ్లిన స్పందించడం లేదని వాపోతున్నారు. బడ్జెట్ లేదని కమిషనర్‌కు చెప్తున్నారని తెలిపారు.
వేతనాలు సకాలంలో చెల్లించాలి ; ఫైనాన్స్ డైరెక్టర్‌ను కలిసిన ఎన్పీడీసీఎల్ టీఈఈ జేఏసీ
హనుమకొండ, సెప్టెంబర్ 10: విద్యుత్తు ఉద్యోగుల వేతనాలు ఆలస్యం కావడంతో తెలంగాణ విద్యుత్తు ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు బుధవారం ఎన్పీడీసీఎల్ ఫైనాన్స్ డైరెక్టర్ తిరుపతిరెడ్డిని కలిశారు. వేతనాలు సమయానికి అందజేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఉద్యోగులు బ్యాంకుల నుంచి వ్యక్తిగత, కుటుంబ అవసరాలకు రుణాలు తీసుకున్నారని, వేతనాలు ఆలస్యం కావడంతో ఈఎంఐలు చెల్లించకపోవడంతో క్రెడిట్ సోర్లు దెబ్బతినడంతోపాటు రోజువారీ ఖర్చులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. దసరా పండగ అక్టోబర్ 2న ఉన్నందున వేతనాలు ముందుగానే విడుదల చేయాలని కోరారు.