హైదరాబాద్, ఫిబ్రవరి16 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థలు కల్పిస్తున్న ఉద్యోగావకాశాలను యువత అందిపుచ్చుకోవాలని, ఆ మేరకు నైపుణ్యాలను పెంచుకోవాలని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ సూచించారు. స్కిల్ కనెక్ట్ కంపెనీ ఆధ్వర్యంలో ఎస్సీ యువతకు హైదరాబాద్‌లోని హరితప్లాజాలో ఉద్యోగమేళాను, సదస్సును బుధవారం నిర్వహించారు. సుమారు 10 కంపెనీల్లో వివిధ ఉద్యోగాల కోసం మేళాను నిర్వహించగా, 300 మంది యువతీయువకులు హాజరయ్యారు. వారిలో 100 మందిని ఎంపిక చేశారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమానికి చైర్మన్ శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. ఎంపికైన యువకులకు నియామక పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఎండీ కరుణాకర్, జీఎం ఆనంద్‌కుమార్, ఈడీ రమేశ్, స్కిల్ కనెక్ట్ ఎండీ సూర్యకిరణ్, బిజినెస్ హెడ్ డేవిడ్, హెచ్ఆర్ డైరెక్టర్ స్ఫూర్తి తదితరులు పాల్గొన్నారు.