నల్లగొండ: సుదీర్ఘ విరామం తర్వాత పునఃప్రారంభమైన ఎస్ఎల్బీసీ టన్నెల్ (SLBC Tunnel) పనుల్లో అపశ్రుతి చోటుచేసుకున్నది. శనివారం ఉదయం ఎడవైపు సొరంగం 14వ కిలోమీటర్ వద్ద ప్రమాదం జరిగింది. నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో పనులు జరుగుతుండగా టన్నెల్ పైకప్పు 3 మీటర్ల మేర పడిపోయింది. దీంతో ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని రక్షించిన తోటి కార్మికులు హుటాహుటిన జెన్కో హాస్పిటల్‌కు తరలించారు. పోలీసుల సాహాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
సొరంగంలోని రింగ్‌లు కిందపడటంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తున్నది. దీంతో అందులో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మార్నింగ్ షిఫ్ట్‌లో 40 మంది కార్మికులు కార్మికులు పనిలోకి వెళ్లారు. ప్రమాదం అనంతరం సొరంగం నుంచి ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. ఘటనా స్థలం వద్ద నీటిపారుదల శాఖ అధికారులు, పోలీసులు సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. ఐదేండ్ల విరామం తర్వాత ఈ నెల 18న సొరంగం తవ్వకం పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి.
ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. విషయం తెలుసుకున్న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఘటనా స్థలికి బయల్దేరారు. వారివెంట నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్‌దాస్, అధికారులు ఉన్నారు.
నల్లగొండ జిల్లాకు సాగు, తాగు నీరు అందించేందుకు శ్రీశైలం ఎడమగట్టు కాలువ (SLBC) సొరంగం ప్రాజెక్టును రూపొందించారు. 2005లో అప్పటి ప్రభుత్వం ప్రాజెక్టు పనులను ప్రారంభించింది. 60 నెలల్లో పనులు పూర్తి చేయాలని నిర్ధేశించారు. శ్రీశైలం నుంచి నల్లగొండ జిల్లాకు 30 టీఎంసీల కృష్ణా జలాలను తరలించాలన్నది ఈ ప్రాజెక్టు ఉద్దేశం. అయితే టన్నెల్ బోరింగ్ మిషన్‌తో సొరంగం తవ్వకం చేపట్టగా సాంకేతిక సమస్యలు, వరద సమస్యలతో పనులు ఆగుతూ సాగుతున్నాయి. కాగా, మొత్తం ఇన్ లెట్, అవుట్ లెట్ సొరంగాలు కలిపి 44 కిలోమీటర్లు తవ్వాల్సి ఉండగా.. 9.559 కిలోమీటర్ల తవ్వకం పనులు పెండింగ్‌లో ఉన్నాయి.
ఇప్పటికే ప్రభుత్వం ఆరుసార్లు పనుల గడువు పొడించింది. తాజాగా 2026 జూన్ వరకు పనులు పూర్తిచేయాలని నిర్ధేశించారు. ప్రాజెక్టు అంచనాలను రూ.4,637 కోట్లకు పెంచారు. ఇప్పటిదాకా రూ.2646 కోట్లు ఖర్చుచేశారు. నల్లగొండలోని ఉదయ సముద్రం ప్రాజెక్టు కూడా ఈ ప్రాజెక్టులో అంతర్భాగం. కాగా, సొరంగం పనులు పూర్తి చేస్తే జిల్లాలో 3.41 లక్షల ఎకరాలకు సాగునీరు, 200 గ్రామాలకు తాగునీరు అందనుంది.