Farmers | చిన్నశంకరంపేట, మే 12: కొద్ది వారాలుగా రాష్ట్రంలో రైతు రోడ్డెక్కని రోజు లేదు.. ఆందోళనకు దిగని దినం లేదు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామంటూ ప్రభుత్వం లెక్కలు చెప్తున్నప్పటికీ.. కాంటా జరుగదు. మద్దతు దొరకదు. దళారీ చెప్పిందే ధర. కొన్నదే ధాన్యం. వడ్లు కుప్ప పోసుకుని కూర్చున్న రైతు సాయం కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు. గాలివానో, రాళ్లవానో వస్తే.. ధాన్యం తడువకుండా తండ్లాడుతూనే ఉన్నాడు. రాష్ట్రమంతా కొనుగోళ్లు సాఫీగా సాగుతున్నాయని మంత్రులు చెప్తుంటే.. మరి రోడ్డెక్కుతున్న రైతులంతా ఎవరు? పంట కొంటరేమోనన్న తండ్లాటలో కోల్పోతున్న ప్రాణాలెవరివి? వడ్లకుప్ప వద్దే కుప్పకూలినవాళ్ల జాబితాలో ఇప్పుడు మరో ఇద్దరు చేరారు.
ధాన్యం కొనాలని రైతుల రాస్తారోకో
ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం అంబాజీపేట కొనుగోలు కేంద్రం వద్ద ఆదివారం రైతులు మెదక్-చేగుంట ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కొనుగోలు కేంద్రంలో వారం పది రోజులుగా ధాన్యాన్ని తూకం వేయకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దళారుల ధాన్యం కొనుగోలు చేసి రైతుల ధాన్యం తూకం వేయకపోవడం లేదని ఆరోపించారు. తమ ధాన్యాన్ని తూకం వేయకుంటే సోమవారం జరిగే ఎంపీ ఎన్నికల్లో తాము ఓటింగ్లో పాల్గొనబోమని తేల్చిచెప్పారు. ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యం అకాల వర్షంతో తడసి ముద్దవుతున్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దళారులపై ఉన్న ప్రేమ రైతులపై ఎందుకు లేదని ప్రశ్నించారు. తమ ధాన్యాన్ని తూకం వేయకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని అన్నదాతలు హెచ్చరించారు.