హైదరాబాద్, మే 16(నమస్తే తెలంగాణ): హౌసింగ్ బోర్డు భూములను ఇకపై లీజు ఇవ్వబోమని, వాటి చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మిస్తామని, లేకపోతే వేలం ద్వారా అమ్మేస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. హౌసింగ్ బోర్డు భూములు అన్యాక్రాంతమవుతున్న నేపథ్యం లో ఈ ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. ఈ మే రకు శనివారం సచివాలయంలో మీడియాత్ చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… భూభారతికి కొత్త వెర్షన్ వెబ్సైట్ రూపకల్పన దాదాపుగా పూర్తయిందన్నారు.
ఈ నెలాఖరులోగా భూములు రిజిస్ట్రేషన్ విలువను పెంచుతామని స్పష్టం చేశారు. బహిరంగ మార్కెట్ విలువకు, రిజిస్ట్రేషన్ విలువకు మధ్య భారీ తేడా ఉందన్నారు. అందుకు అవసరమైన చోట విలువను పెంచుతున్నట్లు తెలిపారు. ఇక ఇందిరమ్మ ఇళ్లపై మాట్లాడుతూ… జూన్ 2న మరోదశ ఇళ్లను కేటాయించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రెండో దశలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి సాంకేతికతను వినియోగించుకొని మరింత కఠిన నిబంధనలు అమలు చేస్తామని తెలిపారు.
రెండో దశలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో పలు సడలింపులు ఇవ్వపోతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఇళ్లకు క్షేత్రస్థాయిలో భారీ డిమాండ్ ఉందన్నారు. అయితే ప్రభుత్వం ని ధుల వెసులుబాటును చూసుకొని దాని ప్రకారమే కొత్తవి మంజూరు చేస్తుందని స్పష్టంచేశారు. గతంలో కేటాయించని డబుల్ ఇళ్లకు లబ్ధిదారులను ఎంపిక చేసి అవి పూర్తి చేసేందుకు అయ్యే ఖర్చును వాళ్లే భరించాలని తెలిపారు. ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇచ్చే రూ.5 లక్షల్లో ఇప్పటికే అక్కడ ప్రభుత్వం ఖర్చుచేసిన మొత్తాన్ని తీసేసి మిగిలిన పైసలను ఇస్తామన్నారు. గతంలో ఎన్నికల ముందు కేటాయించిన డబుల్ బెడ్రూం ఇళ్లలో 16వేల మంది ఉండడంలేదని, వారికి నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. వారు రాకపోతే.. స్థానికంగా ఉండేవాళ్లకు ఇళ్లు కేటాయిస్తామన్నారు.
బండి భగీరథ కేసులో తమ ప్రభుత్వ నిర్లక్ష్యం ఏమీ లేదని మంత్రి పొంగులేటి తెలిపారు. అరెస్టులో ఆలస్యానికి అనేక కారణాలున్నాయన్నారు. భగీరథ అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అయితే ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడు కనిపించకుండా పోవడం, ఆయన అచూకి పోలీసులకు లభించకపోవడంపై ప్రశ్నించగా ఆయన స్పందించలేదు. ఇదిలా ఉంటే మంత్రి క్రషర్ వివాదంపై అసెంబ్లీ హౌజ్ కమిటీ గురించి విలేకరులు ప్రశ్నించగా ఆ విషయం ఇప్పుడు ఎందుకులే అంటూ దాటవేశారు.