హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): లైకే కదా కొడితే పోలా.. జస్ట్ షేర్ చేస్తే బహుమతి, ఎందుకు వదులుకోవాలి.. ఫాలో అయితే పైసా ఖర్చు లేదు, పైగా క్యాష్‌బ్యాక్ వస్తుందట.. అని తొందరపడి సోషల్‌మీడియా అకౌంట్లలో దేనికిపడితే దానికి లైక్‌లు కొడుతున్నారా! తస్మాత్ జాగ్రత్త. బహుమతులు, క్యాష్‌బ్యాక్‌లు అంటూ సైబర్ కేటుగాళ్లు వేస్తున్న నయా ఎత్తుగడ ఇది. సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు సృష్టించి, వాటిల్లోకి మనల్ని లాగేందుకు బహుమతుల ఎర వేస్తున్నారు. ఇదిగో బహుమతి అంటూ లింక్ క్లిక్ చేయాలని అడుగుతారు. ఆ లింక్ క్లిక్ చేశామో మన సమాచారం మొత్తం లాగేస్తారు. మన వివరాలతో వాడేం చేసుకుంటాడని అనుకుంటున్నారా? సరిగ్గా ఇక్కడే ఉంది అసలు మతలబు. మనం అమాయకులమని గుర్తిస్తే కాల్స్, మెసేజ్‌ల ద్వారా మన ఖాతాల్లోని డబ్బులు కొట్టేసేందుకు ప్రయత్నిస్తారు. దానికి చిక్కకపోతే మన ఫోన్ నంబర్, ఇతర సమాచారాన్ని డంప్‌గా డార్క్‌నెట్‌లో అమ్మేస్తున్నారని సైబర్ సెక్యూరిటీ నిపుణుడు, ఎండ్‌నౌ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అనిల్ రాచమల్ల తెలిపారు. లక్కీ డ్రా, వంట సరుకులు వస్తాయి, డిజైనర్ దుస్తులు వస్తాయి, ప్రైజ్ మనీ గెలుచుకున్నారు వంటి లింక్‌లు కనిపిస్తే ఓపెన్ చేయవచ్చని సూచించారు.