
హనుమకొండ సబర్బన్, నవంబర్ 23: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఓ వ్యక్తి లేబర్ అధికారినంటూ వసూళ్ల పర్వానికి తెరలేపాడు. మంగళవారం శేఖర్ అనే వ్యక్తి కారులో ఎల్కతుర్తికి వచ్చి తాను కార్మికశాఖ అధికారినని దుకాణదారులను పరిచయం చేసుకున్నాడు. లేబర్ కమిషనర్ సాయంత్రం తనిఖీలకు వస్తున్నారని, ఈలోగా డబ్బులు చెల్లిస్తే లైసెన్స్ వస్తుందని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించాడు. దీంతో పలు దుకాణాల యజమానులు బెంబేలెత్తిపోయారు. కొందరు దుకాణాలను మూసుకొని వెళ్లగా, మరికొందరు డబ్బులు చెల్లించినట్టు తెలిసింది. వారికి సదరు వ్యక్తి ఎలాంటి రశీదు ఇవ్వలేదు. ఇదేంటని అడిగితే ఆన్లైన్ అయిన తర్వాత సర్టిఫికెట్ వస్తుందని చెప్పాడు. పలు గ్రానైట్ కంపెనీల వద్ద కూడా డబ్బులు వసూలు చేసినట్టు సదరు వ్యక్తి వ్యాపారులతో చెప్పడం గమనార్హం. అందరం ఒకేసారి సాయంత్రంలోగా వసూలు చేసి ఇస్తామని ఇంకొందరు చెప్పడంతో సరేనంటూ వెళ్లిపోయాడు. సాయంత్రం మరో కారులో ప్రభుత్వ వాహనం స్టిక్కర్‌తో వచ్చిన వ్యక్తి పలువురిని పలుకరించాడు. ‘మా మనిషి వచ్చాడు కదా.. లేబర్ లైసెన్స్‌కు డబ్బులు చెల్లించారా?’ అని ఆరా తీశాడు. ఇంకా ఇవ్వలేదని చెప్పడంతో.. ‘రేపు మా వ్యక్తి వస్తాడు, దుకాణానికి రూ.5 వేల చొప్పున వసూలు చేసి ఉంచాలి’ అని చెప్పి వెళ్లాడు. విషయం తెలుసుకున్న ‘నమస్తే తెలంగాణ’ విలేకరి సదరు వ్యక్తిని ప్రశ్నించగా తాను లేబర్ కమిషనర్ పీఏగా చెప్పుకొచ్చాడు. ఇంకా మద్యం దుకాణాలు, బార్లకు కూడా లైసెన్స్‌లు ఇవ్వాల్సి ఉన్నదని, కొత్తగా టెండర్లు పూర్తయినవి కదా.. మరో వా రం తర్వాత వస్తానని చెప్పాడు. ఈ విషయమై డిప్యూటీ కమిషనర్ శామ్యూల్‌ను సంప్రదించగా తాము ఎవరినీ పంపలేదని, వచ్చిన వ్యక్తికి, డిపార్ట్మెంట్కు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ విషయమై విచారణ జరిపిస్తామని చెప్పారు. జిల్లా అసిస్టెంట్ లేబర్ అధికారి ప్రసాద్ మాట్లాడుతూ.. నేరుగా లేబర్ లైసెన్స్ కోసం ఎవరూ షాపుల వద్దకు రారని, మీ సేవలో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుందని సూచించారు.