హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): పాన్‌షాపుల్లో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న అస్సాంవాసి హిలాలుద్దీన్ ముజుందార్‌ను టీఎస్ న్యాబ్, గచ్చిబౌలి పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎక్స్ప్రెస్బీ కొరియర్ సర్వీసెస్ ద్వారా ఉత్తరప్రదేశ్‌లోని లక్నో నుంచి ‘మునక్కా నం.1’ అనే బ్రాండ్ కలిగిన ‘అయుర్వేదిక్ ఔషధి’ చాక్లెట్స్‌ను ఆర్డర్ పెట్టి.. పాన్‌షాపుల్లో, కిరణా షాపుల్లో విక్రయిస్తున్నట్టు టీఎస్ న్యాబ్ పోలీసులు గుర్తించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం హిలాలుద్దీన్పై నిఘా పెట్టిన పోలీసులు.. 2.800 కేజీల బరువున్న 560 గంజాయి చాక్లెట్లను కొరియర్ ద్వారా ఆర్డర్ చేసి, రిసీవ్ చేసుకుంటుండగా అదుపులోకి చేసుకున్నారు.
వాటిని ల్యాబ్‌కు పంపగా అవి గంజాయి చాక్లెట్లుగా తేల్చారు. 2021లో అస్సాంలోని హైలకడి నుంచి హైదరాబాద్‌కు వలస వచ్చిన హిలాలుద్దీన్ నానక్‌రామ్‌గూడలోని పాన్‌షాపుల్లో పని చేశాడు. 2022లో నానక్‌రామ్‌గూడలో సొంతంగా పాన్‌షాప్ ప్రారంభించి.. అడ్డదారుల్లో గంజాయి, గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నాడు. తానుంటున్న ప్రాంతంలో గంజాయి చాక్లెట్లకు ఉన్న డిమాండ్‌ను బట్టి.. అక్రమంగా వ్యాపారం మొదలు పెట్టానని, ఆన్లైన్లో చాలాసార్లు చాక్లెట్లు ఆర్డర్ చేసి, విక్రయించినట్టు పోలీసు విచారణలో ఒప్పుకున్నాడు. ఆన్లైన్లో ఒక చాక్లెట్‌ను రూ.5 కొని అతడు బయట భారీ ధరకు విక్రయిస్తున్నట్టు టీఎస్ న్యాబ్ పోలీసులు గుర్తించారు.