లండన్, సెప్టెంబర్ 3: దేశంలో 16 ఏండ్ల లోపు పిల్లలకు ఎనర్జీ డ్రింక్‌ల అమ్మకంపై నిషేధం విధించాలని యూకే ప్రభుత్వం యోచిస్తున్నది. లీటర్‌కు 150 ఎంజీల కెఫిన్ కలిగి ఉన్న అన్ని డ్రింక్‌లను ఇకపై వీరికి అమ్మరు. రెడ్ బుల్, మాన్స్టర్, రెలెంట్‌లెస్, ప్రైమ్ తదితర డ్రింక్‌లు ఈ విభాగం కిందకు వస్తాయి. కాగా, కోకా కోల, పెప్సీ, డైట్ కోక్, కాఫీ, టీ వంటి పానీయాలు ఈ నిషేధ జాబితా పరిధిలోకి రావు.
పిల్లల్లో ఊబకాయం, నిద్రలేమి, ఒత్తడి వంటివి తగ్గించడంతో పాటు గత ఏడాది ఎన్నికల సందర్భంగా లేబర్ పార్టీ ఇచ్చిన ఎన్నికల వాగ్దానం మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనుంది. అత్యధిక కెఫిన్ ఉన్న ఇలాంటి పానీయాలను పిల్లలకు అమ్మకుండా నిషేధం విధించడం వల్ల వారిలో శారీరక, మానసిక ఒత్తిడి తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.