నమస్తే తెలంగాణ నెట్వర్క్: హిమాన్షుపై చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న తన యూట్యూబ్ చానల్లో వాడిన భాష, వ్యాఖ్యలు ఏమాత్రం సమర్థనీయం కావని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ), రాష్ట్ర వరింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) తెలిపింది. మల్లన్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఐజేయూ అధ్యక్షుడు కే శ్రీనివాస్‌రెడ్డి, కార్యదర్శి వై నరేందర్‌రెడ్డి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, కే విరాహత్అలీ ఆదివారం సంయుక్త ప్రకటన విడుదల చేశారు. మల్లన్న వ్యాఖ్యలు మీడియా స్వేచ్ఛను దుర్వినియోగం చేయడమేనని, అది ప్రజా విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని తెలిపారు. ప్రజాప్రయోజనాల వార్తల వెల్లడికి ఎలాంటి సాహసాలకైనా పూనుకోవచ్చని, అయితే ఆ ముసుగులో జర్నలిజాన్ని దుర్వినియోగం చేయటం వృత్తి ధర్మాన్ని అపహాస్యం చేయటమేనని పేర్కొన్నారు. కాగా, హిమాన్షుపై తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలను బాలల సంఘం తీవ్రంగా ఖండించింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం రాఘవపురంలో ఆదర్శ బాలల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం తీన్మార్ మల్లన్న ఫ్లెక్సీకి శవయాత్ర నిర్వహించారు. అనంతరం గ్రామంలోని ప్రధాన కూడలి వద్ద దహనం చేసి, మల్లన్నకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హైదరాబాద్‌లోని రామంతపూర్ ప్రధాన రహదారిపై టీఆర్ఎస్ యువజన విభాగం నేత బోసాని పవన్ ఆధ్వర్యంలో తీన్మార్ మల్లన్న దిష్టిబొమ్మను దహనం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో టీఆర్ఎస్ నేతలు మల్లన్న చిత్రపటానికి చెప్పుల దండ వేసి ఊరేగించి నిరసన తెలిపారు. అనంతరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. టీఆర్ఎస్వీ నేతల ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలోని పోలీస్ స్టేషన్లో, సంగారెడ్డి జిల్లా జిన్నారం పోలీస్ స్టేషన్లో తీన్మార్ మల్లన్నపై ఫిర్యాదు చేశారు.
ఇంత పైశాచికమా?: మంత్రి సబిత
పసి మనసులను గాయపర్చుతూ తీన్మార్ మల్లన్న పైశాచిక ఆనందం పొందుతున్నారని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి మండిపడ్డారు. అల్మాస్గూడ తిరుమల్‌నగర్ కాలనీలో ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షుపై తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేయటం బాధాకరమని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం గురించి మాట్లాడకుండా ఇంట్లో వాళ్ల గురించి మాట్లాడటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లోకి కుటుంబసభ్యులు, పిల్లలను లాగటం మంచిది కాదని, ఇదెక్కడి సంస్కృతి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యత మరిచి సంస్కారహీనులుగా మారుతున్నారని ఆమె విమర్శించారు. ఇలాంటి వారికి ప్రజలు బుద్ధి చెప్తారని సబిత అన్నారు.