హైదరాబాద్ : భారత రైతు సంక్షేమమే లక్ష్యంగా బీఆర్ఎస్ ఏర్పడిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ఇందులో భాగంగా ఈనెల 18న ఖమ్మంలో నిర్వహిస్తున్న భారీ బహిరంగసభను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. దేశంలో కొత్త క్రాంతిని తీసుకురావడానికి తెలుగు ప్రజలు శ్రీకారం చుట్టాలని కోరారు.
తెలుగు తేజం,పీవీ ప్రధానిగా దేశాన్ని పాలించి తెలంగాణ సత్తా చాటిన గడ్డ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఏర్పడ్డ బీఆర్ఎస్ భారత దేశ భవిష్యత్ తీర్చిదిద్దడానికి ఆవిర్భవించడం పట్ల తెలుగు ప్రజలు గర్వించాలన్నారు.
పంటలు ఇంటికి వచ్చి రైతులు సంతోషంగా సంబరం చేసుకునే పండుగ సంక్రాంతి తరువాత 18 న తొలి అడుగుగా ఖమ్మంలో సభ పెట్టడం శుభారంభం అన్నారు.దేశానికి అన్నం పెట్టే రైతు ఈ దేశాన్ని శాసించాలి అన్న సంకల్పానికి ప్రజలంతా ఆశీస్సులు అందించాలని కోరుతూ తెలంగాణ ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.