హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో పర్యాటక అభివృద్ధికి నిధులు కేటాయించాలని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డిని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా గురువారం ఆయన కిషన్‌రెడ్డితో భేటీ అయ్యారు. కేంద్రం ఆర్థికసాయంతో స్వదేశీ దర్శన్ పథ కం కింద మహబూబ్‌నగర్ జిల్లాలో పిలిగ్రిమ్ అండ్ నేచర్ టూరిజం సర్క్యూట్‌కు రూ.101.72 కోట్లు, తెలంగాణ ఫోర్ట్ సర్క్యూట్‌కు రూ.99.20 కోట్లు, ఇంటిగ్రేటెడ్ బుద్ధిస్ట్ సర్క్యూట్‌కు రూ.107.13 కోట్లు, ప్రసాద్ స్కీమ్ కింద మహబూబ్‌నగర్ జిల్లా మన్యంకొండ వేంకటేశ్వరస్వామి దేవాలయ అభివృద్ధికి రూ.50.15 కోట్లు, మహబూబ్‌నగర్‌లో ఠాగూర్ కల్చరల్ కాంప్లెక్స్ (టీసీసీ)కి రూ.25 కోట్లు నిధులు కేటాయించాలని గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదలు చేసిందని గుర్తుచేశారు. వీటిని పరిశీలించి నిధులు విడుదల చేయాలని కోరారు. అడాప్ట్ హెరిటేజ్ కింద గోల్కొండ, అలంపూర్‌లోని నవబ్రహ్మ తదితర ఆలయాలను దత్తత తీసుకునేందుకు సంస్థలు ముందుకొచ్చాయని, కేంద్రం నుం చి అనుమతే ఆలస్యం అవుతున్నదని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ (ఐఐటీటీఎం) ఏర్పాటు చేయాలని కోరారు. ఇందుకు అవసరమయ్యే స్థలం, మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభు త్వం తరఫున అందజేస్తామని తెలిపారు.
స్మారక కట్టడాలను యునెస్కోకు నామినేట్ చేయాలి
రాష్ట్రంలోని ప్రముఖ చారిత్రక, స్మారక కట్టడాలైన గోల్కొండ ఫోర్ట్, కుతుబ్‌షాహీ సమాధులు, చార్మినార్, వెయ్యిస్తంభాల దేవాలయానికి యునెస్కో గుర్తింపు కోసం కేంద్రం తరఫున నామినేట్ చేయాలని శ్రీనివాస్‌గౌడ్ కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. అంతకుముందు.. తెలంగాణ నుంచి తొలి కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కిషన్‌రెడ్డిని సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట తెలంగాణ టూరిజం ఎండీ మనోహర్ రావు, ఈడీ శంకర్‌రెడ్డి ఉన్నారు. మరోవైపు ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో రామప్ప ఆలయాన్ని చేర్చేందుకు కృషిచేసినందుకు కేంద్ర పురావస్తుశాఖ డైరెక్టర్ జనరల్ విద్యావతికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. భారత పురావస్తు సర్వే బృందం హైదరాబాద్, యాదాద్రి, భద్రాచలం, మహబూబ్‌నగర్‌లోని మన్యంకొండ వేంకటేశ్వర స్వామి దేవాలయాలను సందర్శించాలని, ఆలయాల అభివృద్ధికి నిధులను విడుదల చేయాలని విజ్ఞప్తిచేశారు. గోల్కొండ ఫోర్ట్‌లోని సౌండ్ అండ్ లైట్‌షోను నవీకరించాలని, షోను పర్యాటకులకు అనువుగా ఉండే రాణిమహల్‌కు మార్చాలని కోరారు.