హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): దివ్యాంగ పిల్లలకు ప్రత్యేక పద్ధతుల్లో విద్యాబోధన చేయడం చాలా గొప్ప విషయమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. ఈ విషయంలో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్స్ (ఐఈఆర్పీ) పాత్ర అమోఘమని కొనియాడారు. మంగళవారం శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమాగమంలో జరిగిన ఐఈఆర్పీల రాష్ట్ర సదస్సులో వినోద్‌కుమార్ ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. బుద్ధి మాంద్యం, మానసిక వైకల్యంతో బాధపడుతున్న పిల్లలకు, కండ్లు కనిపించని, చెవులు పినిపించని చిన్నారులకు ప్రత్యేక పద్ధతుల్లో విద్యాబోధన చేస్తున్న ఐఈఆర్పీల సేవలు ప్రతి ఒకరిని కదిలిస్తాయని చెప్పారు. ఐఈఆర్పీల సర్వీస్ క్రమబద్ధీకరణ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్‌భాసర్, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కమలాకర్, మాజీ ఎమ్మెల్సీ రవీందర్, ఐఈఆర్పీ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్, ప్రధాన కార్యదర్శి కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.