ఎల్కతుర్తి, ఏప్రిల్ 7: ఆది నుంచి తెలంగాణ ప్రజలపాలిట కాంగ్రెస్ భూతంలా తయారైందని శాసనమండలి ప్రతిపక్షనేత, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి మండిపడ్డారు. ఈ నెల 27న ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రజతోత్సవ మహాసభ ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లను మాజీ ఎమ్మెల్యేలు వొడితెల సతీశ్‌కుమార్, నన్నపునేని నరేందర్‌తో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం విలేకర్ల సమావేశంలో మధుసూదనాచారి మాట్లాడుతూ.. గడిచిన 25 ఏండ్లల్లో తెలంగాణ ఆత్మగౌరవం, ప్రయోజనాల విషయంలో రాజీలేని పోరాటం చేసిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ అన్నారు. 1956లో తెలంగాణను ఆంధ్రాతో కలిపే సమయంలో ఇక్కడి నీళ్లు, నిధులు, ఆత్మగౌరవం కోల్పోతామని చెప్పినా వినలేదని చెప్పారు.
తెలంగాణ ప్రజల బతుకులు, వనరుల దోపిడీ చూసి చలించిన కేసీఆర్ 2001లో బీఆర్ఎస్ను స్థాపించి తెలంగాణను సాధించుకున్నామని గుర్తుచేశారు. అభివృద్ధే ధ్యేయంగా కేసీఆర్ పాలిస్తే, అబద్ధాలతో పాలిస్తున్న పార్టీ కాంగ్రెస్ అని మండిపడ్డారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రూ.4.17 లక్షల కోట్ల అప్పు చేస్తే, కాంగ్రెస్ 16 నెలల్లో లక్షా 60 వేల కోట్ల అప్పు చేసిందని ఆరోపించారు. తెలంగాణలో ఎక్కడా 6 గ్యారంటీల అమలు జరగలేదని ప్రజలు గగ్గోలు పెడుతున్నారన్నారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర సాధకుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్‌కు ఉంది కాబట్టే బ్రహ్మాండమైన బహిరంగ పెట్టాలని నిర్ణయించినట్టు తెలిపారు. తెలంగాణ నలుమూలల నుంచి ప్రజలు లక్షలాదిగా తరలివచ్చి చైత్యాన్ని చూపాలని కోరారు.
సభకు అనుమతిపై అపోహలు వద్దు : వొడితెల సతీశ్‌కుమార్
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు అనుమతి ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ స్పష్టంచేశారు. సభకు పోలీసుల ఆంక్షలు లేవని చెప్పారు. సభకు 50 వేల వరకు వాహనాలు వస్తాయనే అంచనాతో వరంగల్-సిద్దిపేట-కరీంనగర్ రూట్లల్లో భారీగా పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.