
తిరుమలగిరి, ఆగస్టు 21: తెలంగాణ పల్లె ప్రజల జీవనరీతులు, సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పడుతుంటాయి జానపద కళారూపాలు. ఎంతో ఘనచరిత్ర కలిగిన జానపద కళనే వృత్తిగా స్వీకరించి మనుగడ సాధించిన కుటుంబాలు చాలానే ఉన్నాయి. పూర్వం ఈ కళాకారులను రాజులు, సంస్థానాధీశులు పోషించగా.. కాలక్రమంలో ప్రజలు ఆ బాధ్యతను తీసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలకులు ఏనా డూ వీరిని పట్టించుకోకపోవడంతో కళారూపాలు కనుమరుగయ్యే స్థితికి చేరాయి. అలాంటి వాటిలో తెరచీర (తొలుసూరుగొల్ల) జానపదం ముందువరుసలో ఉన్నది. యాదవ కులస్థులకు చెందిన ఈ కళారూపం దశాబ్దాల తరబడి నిర్లక్ష్యానికి గురవ్వగా, స్వరాష్ట్రంలో కేసీఆర్ సర్కారు ఆ కళాకారులను గుర్తిస్తున్నది. వీరికి పింఛన్, ఉద్యోగాలు ఇప్పించి అండగా ఉంటున్న ప్రభుత్వం.. భవిష్యత్తులో మరిం త భరోసాను అందించేందుకు క్షేత్రస్థాయిలో స్థితిగతులను పరిశీలిస్తున్నది. ఆదివారం జాతీయ జానపద దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.
పటం వేసి.. పదం పాడి
పూర్వీకుల గ్రంథాలు, పటాల ఆధారంగా యాద వ జాతి మనుగడ జీవన విధానం, వికాసాన్ని కళాకారులు తెరచీర జానపద రూపంలో ప్రదర్శిస్తుంటారు. యాదవులు పండుగలు చేస్తే పటం వేసి వారి ఉనికి, కృష్ణ పరమాత్ముడి లీలలు వివరిస్తారు.
ఆదుకునేందుకు సర్కారు చర్యలు
రాష్ట్రవ్యాప్తంగా 620 మంది తెరచీర కళాకారులున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. 2019లో అప్పటి బీసీ కమిషన్ సభ్యుడు జూలూరి గౌరీశంకర్ ఉమ్మడి జిల్లాలో పర్యటించి, తొలుసూరు గొల్లల స్థితిగతుల ను పరిశీలించి, ప్రభుత్వానికి నివేదించారు. ఈ ఏడా ది జూలైలో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మరోమారు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టింది. బీసీ కార్పొరేషన్ ద్వారా తొలుసూరు గొల్ల కళాకారులకు రుణా లు అందించి, ఆర్థికంగా నిలబెట్టే ప్రయత్నంలో ప్రభుత్వం ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఒక్క తుంగతుర్తి నియోజకవర్గంలో అత్యధికంగా 50 కుటుంబాలు ఉన్నట్టు గుర్తించారు.
జానపద కళల రక్షణకు సర్కార్ కృషి
జానపదకళను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. తెరచీర జానపద కళాకారులను సంచార జీవులుగా గుర్తించాలని మేం కోరుకుంటున్నాం. మా బతుకులు బాగుపడాలంటే సీఎం కేసీఆర్ సారుతోనే సాధ్యమవుతుందని నమ్ముతున్నం.
-కృష్ణమూర్తి, తెరచీర కళాకారుడు, మామిడాల, సూర్యాపేట జిల్లా