పిల్లలూ.. మీతో ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారా? శరీర భాగాలపై చేయి వేస్తూ ఇబ్బందికరంగా తడుముతున్నారా? ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరిస్తున్నారా? ఇంట్లో చెప్పే ధైర్యం లేక మీలో మీరే కుమిలిపోతున్నారా? తల్లిదండ్రులూ.. పరువు పోతుందని ఫిర్యాదులు చేయటం లేదా? మీ కోసమే ‘పోక్సో ఈ-బాక్స్’ను కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. కామాంధుల పని పట్టేందుకు మీ చేతిలో ఆయుధం పెట్టింది.
హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): చిన్నారులపై పెరుగుతున్న లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు అందుబాటులోకి తెచ్చిన పోక్సో ఈ-బాక్స్ చిన్నారులకు, వారి తల్లిదండ్రులకు ధైర్యాన్నిస్తున్నది. గోప్యతకు ఎలాంటి భంగం వాటిల్లకుండా దర్యాప్తు చేస్తూ, నిందితుల ఆగడాలకు కళ్లెం వేస్తున్నది. దీంతో ఫిర్యాదులు చేసేవాళ్లు ముందుకొస్తున్నారు. పాఠశాలలు, బస్సులు, ఇంటి ఆవరణ, కుటుంబ సభ్యులు, తెలిసినవాళ్లు.. ఇలా ఎవరి నుంచి వేధింపులు ఎదురైనా చిన్నారులు నేరుగా ఆన్లైన్లో ఫిర్యాదు చేయవచ్చు. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్సీపీసీఆర్) వెబ్సైట్లో పోక్సో ఈ-బాక్స్ ఆప్షన్‌ను ఏర్పాటు చేశారు. లైంగిక వేధింపులపై చిన్నారులు, కొన్ని సందర్భాల్లో వారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావటం లేదు. అలాంటి వారి వివరాలు గోప్యంగా ఉంచుతూనే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఫిర్యాదు అందిన వెంటనే మీ ఫిర్యాదు రిజిస్టర్ అయినట్టుగా కైంప్లెంట్ నంబర్ కూడా వస్తుంది. ఆ తర్వాత మీ ఏ ఫోన్ నంబర్ ఇచ్చారో ఆ నంబర్‌కు చైల్డ్‌లైన్ (1098) నుంచి ఫోన్ కాల్ వస్తుంది. వారే మీ వివరాలు ఫోన్ ద్వారా తీసుకొంటారు. ఎక్కడా మీ వివరాలు బయటికి రాకుండా దర్యాప్తు చేస్తారు. ప్రజల్లోనూ దీనిపై అవగాహన క్రమంగా పెరుగుతున్నది. 2018 నుంచి 2021 నవంబర్ చివరి వరకు మొత్తం 438 ఫిర్యాదులు అందినట్టు జాతీయ చిన్నారుల హక్కుల పరిరక్షణ కమిషన్ గురువారం పార్లమెంట్లో వెల్లడించింది. తెలంగాణ నుంచి నాలుగేండ్లలో మొత్తం 12 ఫిర్యాదులు అందినట్టు పేర్కొన్నది.
ఇలా ఫిర్యాదు చేయవచ్చు:
ఫిర్యాదుకు https://ncpcr.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించి, పోక్సో ఈ-బాక్స్ అనే బటన్‌పై క్లిక్ చేయాలి.
బాణం గుర్తు ఉన్న ఆప్షన్ వస్తుంది. దానిపై క్లిక్ చేస్తే మరో పేజీ ఓపెన్ అవుతుంది. ప్లే గ్రౌండ్, షాప్, రోడ్, స్కూల్, ట్యూషన్, బ్లాక్మెయిల్, ఇన్ స్కూల్ బస్, వ్యాన్, కుటుంబసభ్యులు, బంధువులు, ఇంటర్నెట్, ఫోన్ ఇలా వేధింపుల రకాలకు సంబంధించిన చిత్రాలు ఉంటాయి. వాటిపై ఫిర్యాదు రకాన్ని క్లిక్ చేయాలి.
పేరు, ఫోన్ నంబర్, ఈమెయిల్, ఘటనకు సంబంధించిన కొన్ని వివరాలు నమోదు చేయాలి.
మీ ఫిర్యాదు రిజిస్టర్ అయినట్టు నంబర్ వస్తుంది. తర్వాత మీరు ఇచ్చిన ఫోన్ నంబర్‌కు చైల్డ్‌లైన్ సిబ్బంది నుంచి ఫోన్ వస్తుంది. గుట్టుగా దర్యాప్తు ప్రారంభిస్తారు.