హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): కల్యాణమంటపంలో పెండ్లి బాజాలు మోగుతున్నాయి.. పిల్లల కేరింతలు, పెద్దల రాకపోకలతో ఆ ప్రదేశమంతా హడావిడిగా ఉన్నది. బంధుమిత్రులంతా సంతోషంగా కొత్త జంటను ఆశీర్వదించేందుకు సిద్ధమయ్యారు. అంతలోనే పెండ్లి కూతురు తల్లిందడ్రులు బలవన్మరణానికి పాల్పడ్డారన్న పిడుగులాంటి వార్త.. అప్పటివరకు ఆహ్లాదంగా ఉన్న పెండ్లిమంటపం ఒక్కసారిగా కళావిహీనమైపోయింది. పెండ్లికొచ్చిన బంధువులంతా శోకసంద్రంలో మునిగిపోయారు.
అంతుబట్టని ఆత్మహత్యలు
ఏం కష్టమొచ్చిందో ఏమో.. ఒకవైపు తమ కుమార్తె పెండ్లి జరుగుతుండగానే ఆమె తల్లిదండ్రులు తమ స్వగృహంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. విశాఖజిల్లా మద్దిపాలెంలో భానునగర్‌కు చెందిన వీ జగన్నాథరావు (63), విజయలక్ష్మి (57) దంపతులు తమ రెండో కుమార్తె భారతి వివాహం మద్దిలపాలెం హెచ్‌బీ కాలనీలోని ఓ ఫంక్షన్ హాలులో ఏర్పాటుచేశారు. బుధవారం రాత్రి 2.30 గంటలకు పెండ్లి ముహూర్తం ఉండగా, పెండ్లికి వచ్చిన బంధువులందరినీ జగన్నాథరావు, విజయలక్ష్మి స్వయంగా స్వాగతం పలికారు. అంతలోనే ఏమైందో తెలియదుకానీ ఎవరికి చెప్పకుండా వారు ఇంటికి వెళ్లిపోయారు. కన్యాదానం సమయానికి వధువు తల్లిదండ్రుల కోసం పురోహితులు పిలువటంతో వారిద్దరూ అకడ లేనట్టు బంధువులు గుర్తించారు. వాళ్లను వెతుకుతూ ఇంటికి వెళ్లగా జగన్నాథరావు సీలింగ్ ప్యాన్‌కు ఉరివేసుకొని వేలాడుతూ కనిపించారు. విజయలక్ష్మి మంచంపై విగతజీవిగా పడి ఉన్నారు. బంధువుల సమాచారంతో అక్కడికి చేరుకొన్న ఎంవీపీ సీఐ రమణయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.