హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): క్లిష్టమైన ఔషధాల సరఫరాను వేగవంతం చేసేందుకు అవసరమైన ప్రాథమిక ప్యాకేజింగ్ ఉత్పత్తుల అధునాతన తయారీ కేంద్రం మహబూబ్‌నగర్ జిల్లాలో ఏర్పాటు కానున్నది. ఫార్మాస్యూటికల్ ప్రైమరీ ప్యాకేజింగ్‌లో గ్లోబల్ ప్రొడ్యూసర్‌గా ఉన్న ఎస్జీడీ ఫార్మా తోపాటు మెటీరియల్ సైన్స్‌లో గ్లోబల్ లీడర్‌గా ఉన్న కార్నింగ్ ఇన్కార్పొరేటెడ్తో రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకొన్నది. రూ.500 కోట్ల పెట్టుబడితో ఏర్పాటుచేయనున్న ఈ కేంద్రంలో ప్రత్యక్షంగా 450 మందికి, పరోక్షంగా మరో 100 మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు తెలిపారు.
ఫార్మా రంగానికి మరింత శక్తి
గ్లాస్ సైన్స్, సిరామిక్ సైన్స్, ఆప్టికల్ ఫిజిక్స్ తదితర విభాగాల్లో అసాధారణ నైపుణ్యాలు, ఇంజినీరింగ్ సామర్థ్యాలను కలిగివున్న కార్నింగ్ సంస్థ పరిశ్రమకు అవసరమైన ఉత్పత్తులను అభివృద్ధి చేస్తున్నది. ఎస్జీడీ ఫార్మా ఔషధ ఉత్పత్తుల ప్రైమరీ ప్యాకేజింగ్ కోసం అవసరమైన గాజు గొట్టాలు, ఇతర వస్తువులను తయారుచేస్తున్నది. కార్నింగ్ సాంకేతికతను, ఎస్జీడీ నైపుణ్యాలను అందిపుచ్చుకొనేందుకు ఈ ఒప్పందం దోహదపడనున్నది. ఈ కేంద్రం ద్వారా జాతీయ, అంతర్జాతీయ వినియోగదారులకు ప్రాథమిక ప్యాకేజింగ్ సామగ్రిని ఎస్జీడీ అందించనున్నది. ప్రైమరీ ప్యాకేజింగ్ సరఫరా గొలుసును సురక్షితం చేయడం ద్వారా తెలంగాణలోని ఔషధ పరిశ్రమ సామర్థ్యాన్ని మరింత పెంచటానికి ప్రయత్నిస్తామని ఎస్జీడీ ఫార్మా ఎండీ అక్షయ్ సింగ్, కార్నింగ్ ఇండియా ఎండీ సుధీర్ పిైళ్లె తెలిపారు.
లైఫ్ సైన్సెస్ అభివృద్ధి వేగవంతం
ఈ ఒప్పందం రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ రంగం వృద్ధిని వేగవంతం చేసేందుకు దోహదపడుతుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు. ఫార్చ్యూన్ 500 కంపెనీ అయిన కార్నింగ్, ఎస్జీడీ ఫార్మా తెలంగాణలో ప్రపంచస్థాయి తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేసేందుకు ముందుకు రావడం సంతోషంగా ఉన్నదని పేర్కొన్నారు. తెలంగాణ నుంచి ఫార్మాస్యూటికల్ ప్యాకేజింగ్ గ్లాస్ తయారీ ఔషధ ఉత్పత్తుల సరఫరాను వేగవంతం చేస్తుందని చెప్పారు. తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఎకోసిస్టం విలువను 250 బిలియన్ డాలర్లకు చేర్చాలన్న తమ లక్ష్య సాధనకు ఇది ఎంతగానో ఉపకరిస్తుందని అన్నారు.