సిద్దిపేట అర్బన్, అక్టోబర్ 2: సమాజంలో నైతిక విలువలు పెంపొందిస్తున్న గొప్ప ఆధ్యాత్మిక ఉద్యమకారుడు చాగంటి కోటేశ్వరరావు అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ‘మానవీయ విలువలు’ అంశంపై చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాల కార్యక్రమం నిర్వహించారు. ఇందులో మంత్రి హరీశ్‌రావు పాల్గొని మాట్లాడుతూ.. చాగంటి ప్రవచనాలతో సిద్దిపేట గడ్డ పునీతమైందని చెప్పారు. చక్కటి ప్రవచనాలతో మూడు రోజులపాటు సిద్దిపేట ప్రజలందరికీ దిశానిర్దేశం చేశారని, అందుకే చాగంటిని అభివన బ్రహ్మ అంటారని.. దానికి ఆయన ముమ్మాటికీ అర్హులని కొనియాడారు. చాగంటి అంటే అర్థం.. స్నేహపూర్వకమైన వ్యక్తిత్వమని.. అందుకే ప్రజలు ఆయన చెప్పింది వింటారని తెలిపారు. ఎక్కడ ప్రవచనాలు చెప్పినా ఆయన ఒక్క రూపాయి కూడా తీసుకోరని, డబ్బులు సంపాదించలేదు కానీ.. కోట్లాది మంది భక్తుల ప్రేమను పొందారని హరీశ్‌రావు పేర్కొన్నారు.