నాగర్కర్నూల్, ఏప్రిల్ 24: సమసమాజ స్థాపన, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషిచేసిన కమ్యూనిస్టు యోధుడు కందికొండ రామస్వామి అని ప్రజాకవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు. ఆదివారం నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో నెలపొడుపు సాహిత్య సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన కందికొండ రామస్వామి స్మారక రాష్ట్రస్థాయి పురస్కార సభకు ఎమ్మెల్సీ గోరటి హాజరయ్యారు. రామస్వామి చిత్రపటానికి నివాళులర్పించారు. కందికొండ రామస్వామి పురస్కార గ్రహీత గాజోజు నాగభూషణాన్ని రూ.10 వేల నగదు, ప్రశంసా పత్రం, జ్ఞాపికతో సత్కరించారు. అనంతరం గోరటి వెంకన్న మాట్లాడుతూ.. రామస్వామి బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ఎనలేని కృషిచేశారని కొనియాడారు. ఆయన కులాన్ని పాటించలేదని, ఆదర్శనీయ సమాజం కోసం నిరంతరం పోరాడినట్టు గుర్తుచేశారు. నాగభూషణం రచించిన పుస్తకాల్లో ప్రాణదీపం అద్భుతమని, అందుకే ఈ పుస్తకానికి నెలపొడుపు సాహిత్య సాంస్కృతిక వేదిక తరఫున కందికొండ రామస్వామి స్మారక రాష్ట్రస్థాయి పురస్కారాన్ని అందజేశారన్నారు. కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి వహీద్ఖాన్, కవులు వనపట్ల సుబ్బయ్య, ముచ్చర్ల దినకర్ పాల్గొన్నారు.