‘బచావత్ ట్రిబ్యునల్, బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ చేసిన నీటి కేటాయింపులను మార్చడానికి వీల్లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చారిత్రక రక్షణలు ఉన్నాయి. ఆ నీటి కేటాయింపులను యథావిధిగా కొనసాగించాలి’- ఇదీ కృష్ణా జలాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇటీవల ట్రిబ్యునల్ ఎదుట చేసిన వాదన. తెలంగాణ నీటిహక్కులకు రక్షణ కల్పించకుండా పోలవరం-నల్లమలసాగర్ (పీఎన్) లింకు ప్రాజెక్టుకు అనుమతిస్తే, రేపటిరోజున గోదావరి బేసిన్లోనూ ఇదే పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉన్నది. రాష్ట్ర సాగునీటి హక్కులకు తీవ్ర విఘాతం వాటిల్లనున్నది.
హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): గోదావరి నదీ జలాల పంపిణీ కోసం బచావత్ ట్రిబ్యునల్ ఏర్పాటుచేశారు. ఈ ట్రిబ్యునల్ 1980లో అవార్డు ప్రకటించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు గోదావరి జలాల్లో 1,486 టీఎంసీలు కేటాయించింది. అందు లో తెలంగాణ వాటా 968 టీఎంసీలు, ఏపీ వాటా 518 టీఎంసీలు. అయితే ఆ కేటాయింపులు చెల్లబోవని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి ఏపీ అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నది.
ఏపీకి 775 టీఎంసీలకుపైగా కేటాయించాలని పట్టుబడుతున్నది. అందుకోసం వ్యూ హాత్మకంగా ముందుకు సాగుతున్నది. ఇప్పటికే ట్రిబ్యునల్ ఏర్పాటుచేయాలని కోరుతూ కేంద్రానికి ఫిర్యాదు చేసింది. మరోవైపు, పోలవరం-నల్లమలసాగర్ (పీఎన్) లింకు ప్రాజెక్టును చేపట్టేందుకు దూకుడుగా ముందుకు సాగుతున్నది. ఈ లింకు ప్రాజెక్టును ముందస్తుగా మొదలుపెట్టి చారిత్రక రక్షణలు పొందేందుకు ఎత్తులు వేస్తున్నది. తద్వారా గోదావరి జలాల్లో ఎక్కువ వాటా పొందాలన్నదే ఏపీ అసలు ఉద్దేశమని తేటతెల్లమవుతున్నది. ప్రాజెక్టుకు అదే జరిగితే ఎగువన తెలంగాణకే తీరని నష్టం వాటిల్లనున్నది. గోదావరి జలాల్లో వా టాకు గండిపడటమే కాక, భవిష్యత్తులో ప్రాజెక్టులు చేపట్టేందుకు సైతం పెనుముప్పుగా మారనున్నది.
నదీజలాలను వినియోగించుకునే రాష్ర్టాలు ప్రాజెక్టులను నిర్మించుకోవడం పరిపాటి. నీటివాటాల ఆధారంగా ప్రాజెక్టులను నిర్మించుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక వెసులుబాటును బట్టి కొన్ని రాష్ర్టాలు ముందుగా, మరికొన్ని రాష్ర్టాలు ఆలస్యంగా నిర్మించుకోవచ్చు. అయినప్పటికీ, ట్రిబ్యునళ్ల ఏర్పాటుకు ముందే ని ర్మాణం పూర్తయి వినియోగంలో ఉన్న, నిర్మాణంలో కొనసాగుతున్న, ప్రతిపాదిత ప్రాజెక్టులకు నీటి కేటాయింపుల్లో ట్రిబ్యునళ్లు తొలి ప్రాధాన్యమిస్తాయి.
కృష్ణా జలాల్లో ఇదే తరహాలో గతంలో ఏపీ భారీగా లబ్ధి పొందింది. కృష్ణా డెల్టాకు 183 టీఎంసీలు, కేసీ (కర్నూలు-కడప) కెనాల్‌కు 39 టీఎంసీలు తదితర ప్రాజెక్టులకు చారిత్రక రక్షణల కింద నీటిని కేటాయించుకున్నది. ప్రస్తుతం తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా జలాల పునఃపంపిణీ కోసం బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ విచారణలోనూ ఇదే విషయాన్ని ఏపీ పదే పదే నొక్కిచెప్తున్నది. కృష్ణా జలాల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్-1 (కేడబ్ల్యూడీటీ), ట్రిబ్యునల్-2 చేసిన కేటాయింపులను ఎట్టి పరిస్థితుల్లో మార్చకూడదని వాదనలు వినిపిస్తున్నది. ఆ నీటి కేటాయింపులను యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నది.
పోలవరం వద్ద లభ్యతలో సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) 2023లో హైడ్రాలజీ స్ట డీ నిర్వహించింది. పోలవరం వద్ద నీటి లభ్యత 496 టీఎంసీలని లెక్క తేల్చింది. అందులో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నీటి వినియోగాలకు 449.78 టీఎంసీలు సరిపోతాయని కూడా స్పష్టంగా పేర్కొన్నది. అయితే. సీడబ్ల్యూసీ లెకలపై ఏపీ అభ్యంతరం తెలిపింది. అక్కడితో ఆగకుండా అసలు గోదావరి నీటి కేటాయింపులే తప్పంటూ కొత్తవాదం ముందుకు తెచ్చింది. బచావత్ ట్రిబ్యునల్ తెలంగాణకు ఎకువ నీటిని కేటాయించిందని, వాస్తవంగా తమకే ఎకువ వాటా రావాలని ఏ పీ వాదిస్తున్నది. మొత్తంగా 1,486 టీఎంసీల్లో 775 టీఎంసీలు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నది.
పోలవరం వద్ద అవసరాలుపోనూ మిగులు జలాలతోనే బనకచర్ల లింక్ ప్రాజెక్టును చేపడుతున్నామని గతంలోనే వెల్లడిచింది. అందులో భాగంగా గోదావరి జలాల పంపిణీ కోసం ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని అంతర్రాష్ట్ర నదీ జలాల చట్టం-1956 సెక్షన్ 5 ప్రకారం ఇప్పటికే కేంద్రానికి ఏపీ ఫిర్యాదుచేసింది. అది కేంద్రం పరిశీలనలోనే ఉన్నది. ఏదైనా రాష్ట్రం నీటి కేటాయింపుల్లో అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేస్తే కేంద్రం ట్రిబ్యునల్ ఏర్పాటుచేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఏపీ చేసిన ఫిర్యాదు కేంద్రం పరిశీలనలో ఉన్నది. ట్రిబ్యునల్‌ను ఏర్పాటుచేసే అవకాశమూ ఉన్నదని తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో ఆలోగానే పీఎన్ లింకు ప్రాజెక్టును ప్రారంభించాలనేది ఏపీ ఎత్తుగడగా తెలుస్తున్నది. తద్వారా ప్రాజెక్టుకు రక్షణ పొందే అవకాశమూ ఏర్పడుతుందని నీటిరంగనిపుణులు వివరిస్తున్నారు.
సముద్రంలోకి వృథాగా పోయే నీటినే వాడుకుంటామని ఏపీ నమ్మబలుకుతున్నది. కానీ, గోదావరిలో వరదపై ఇప్పటివరకు శాస్త్రీయ లెక్కలే లేవు. ఆ లెకలు తేలకుండా కృష్ణాబేసిన్‌లోని ప్రాజెక్టులకు లింక్ చేయడం అక్రమం. అదీగాక బేసిన్‌లోని రాష్ర్టాల నీటిహక్కులకు తీరని నష్టం వాటిల్లుతుంది. పీఎన్ లింకు మరీ ముఖ్యంగా తెలంగాణకు గొడ్డలిపెట్టులా మారనున్నది. ఎలాగంటే గోదావరి జలాల్లో బచావత్ ట్రిబ్యునల్ తెలంగాణకు 968 టీఎంసీలు కేటాయించింది. రాష్ట్ర ఏర్పాటు నాటికి అందులో 200 టీఎంసీలకు మించి వాడుకున్నది లేదు.
మిగతా కేటాయింపులన్నీ కాగితాల మీదనే ఉన్నాయి. అందుకు ఇచ్చంపల్లి ప్రాజెక్టు సజీవ సాక్ష్యం. రాష్ట్ర ఏర్పాటు తరువాత కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం గోదావరిలో ట్రిబ్యునల్ కేటాయింపులకు అనుగుణంగా ప్రాజెక్టులు చేపట్టింది. కాళేశ్వరం, సీత్మమ్మసాగర్, మోడికుంట, చనాక కొరాట, సమ్మక్కసాగర్ తదితర ప్రాజెక్టులు చేపట్టడమేగాక, దాదాపు 467 టీఎంసీలకు కేంద్ర సంస్థల నుంచి అనుమతులు తీసుకొచ్చింది. మొత్తంగా 833 టీఎంసీల వినియోగానికి ప్రాజెక్టులు చేపట్టింది. మిగిలిన నికర జలాలను భవిష్యత్తు అవసరాల కోసమని ప్రణాళికలు సైతం చేసింది. ప్రస్తుతం తెలంగాణ ప్రాజెక్టులు పూర్తికాలేదు. ఆ మేరకు నీటి వినియోగం ప్రారంభం కాలేదు. తెలంగాణే కాదు ఎగువ ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర సైతం పూర్తిస్థాయి కేటాయింపుల మేరకు వినియోగించుకోవడం లేదు.
ఫలితంగానే గోదావరిలో వరద వస్తున్నది. ఎగువ రాష్ర్టాలు కేటాయింపుల మేరకు వాడుకుంటే గోదావరిలో వరద ప్రవాహాలు తగ్గిపోతాయి. కానీ, ఏపీ వరద పేరిట ప్రాజెక్టును చేపట్టేందుకు సిద్ధమైంది. అదే జరిగితే ఏపీకి ఆ మేరకు హ క్కు లు లభిస్తాయి. రేపటిరోజున ఎగువ రాష్ర్టాలు క్రమం తప్పకుండా దిగువ ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నికర జలాల ఆధారంగానే తెలంగా ణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణంపై ఏపీ ఇప్పటికే అనేక ఫిర్యాదులు కేంద్రానికి చే సింది. రేపటి రోజున పీఎన్ లింకు నిర్మాణం పూర్తయితే ఏపీకి హక్కులు లభిస్తాయి. కేంద్ర సంస్థలు సైతం దిగువన ఏపీ ప్రాజెక్టులపై ఉన్న ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుంటూ ఎగువన తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేయాల్సి ఉంటుంది. ఇది తెలంగాణ హక్కులకు తీరని నష్టంగా మారుతుంది. దిగువ ప్రాజెక్టులకు నీటిని వదులుతూ ఎగువ రాష్ర్టాలు నీటిని వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఆ మేరకు ఆపరేషన్ ప్రొటోకాల్‌ను పాటించాల్సి ఉంటుంది.
కృష్ణా జలాల్లో అనుసరించిన విధానాన్నే గోదావరి జలాల్లోనూ అమలుచేసేందుకు ఏపీ వ్యూహాత్మకంగానే ముందుకు సాగుతున్నది. చారిత్రక రక్షణల కింద గోదావరి జలాలనూ కొల్లగొట్టే ఎత్తుగడలు అనుసరిస్తున్నది. అందులో భాగంగానే పోలవరం-నల్లమలసాగర్ లింకు ప్రాజెక్టును చేపట్టేందుకు శరవేగంగా ముందుకు సాగుతున్నది. వరద జలాలనే వాడుకుంటామని ఏపీ బుకాయిస్తున్నది. వరద జలాల్లో 200 టీఎంసీలను పోలవరం-ప్రకాశం (కృష్ణా)- బొల్లాపల్లి రిజర్వాయర్ మీదుగా వెలిగొండ ప్రాజెక్టులో భాగమైన నల్లమలసాగర్‌కు మళ్లించేందుకు పీఎన్లింకు ప్రాజెక్టును చేపట్టింది.
ప్రస్తుతానికి 50 టీఎంసీలను మళ్లిస్తామని, మిగతా 150 టీఎంసీలను భవిష్యత్తులో బనకచర్లకు లేదంటే పెన్నా బేసిన్‌లోని సోమశిల రిజర్వాయర్‌కు తరలించే అవకాశం ఉన్నదని కూడా వెల్లడిస్తున్నది. లింకు ప్రాజెక్టు పీఎఫ్ఆర్ (ప్రీ ఫిజబులిటీ రిపోర్టు)ను ఇప్పటికే కేంద్రానికి సమర్పించింది. 2017 మార్గదర్శకాల ప్రకారం పీఎఫ్ఆర్కు సూత్రప్రాయ అంగీకారం లభించిన తరువాతే డీపీఆర్ తయారుచేయాలి. కానీ, ఏపీ మాత్రం పీఎఫ్ఆర్కు ఎలాంటి ఆమోదం లభించకముందే పీఎన్ఎల్పీ డీపీఆర్ తయారీకి సిద్ధమైంది. టెండర్ల ప్రక్రియను సైతం పూర్తి చేసింది. ఇవే ఏపీ వ్యూహామేమిటో చెప్పకనే చెప్తున్నాయి.