ఖైరతాబాద్, జూన్ 13: తెలంగాణలో జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డుల జారీలో జాప్యమెందుకు జరుగుతున్నదని వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు సంజయ్ ఉపాధ్యాయ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ తక్షణమే విధివిధానాలు ప్రకటించి, అర్హులందరికీ కార్డులివ్వాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించి పటిష్ఠమైన ఇన్సూరెన్స్, ఉచిత ఆరోగ్య చికిత్స, ఆరోగ్య కార్డులు వంటి అంశాలపై త్వరలో ముఖ్యమంత్రిని కలుస్తానని తెలిపారు. రైళ్లు, విమానాల్లో రాయితీలు, టోల్ ఛార్జీల మినహాయింపుల కోసం కేంద్రాన్ని కోరుతామని చెప్పారు. సెప్టెంబర్‌లో ఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించి, ప్రధానిని కలిసి ఈ సమస్యలపై వినతిపత్రం సమర్పించనున్నట్టు తెలిపారు. డబ్ల్యూజేఐ ఆధ్వర్యంలో శనివారం ఉదయం ఉస్మానియా యూనివర్సిటీలో ‘జాతీయ విద్యావిధానం2020: మీడియా పాత్ర’ అనే అంశంపై జాతీయ సెమినార్ నిర్వహించనున్నట్టు తెలిపారు.