సుబేదారి, మే 29: వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో అక్రమంగా లింగనిర్ధారణ పరీక్షలు చేసి, గర్భస్రావాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును యాంటీ హ్యూ మన్ ట్రాఫికింగ్, టాస్‌ఫోర్స్, కేయూసీ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో రట్టుచేశారు. 18 మంది నిందితులను అరెస్టు చేసి.. 2 సానర్లు, 18 సెల్ఫోన్లు, రూ.73 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.
సోమవారం వరంగల్ పోలీసు కమిషనర్ రంగనాథ్ మీడియాతో మాట్లాడారు. కేయూసీ పోలీసుస్టేషన్ పరిధిలోని వెంకటేశ్వరకాలనీలోని కేంద్రానికి మహిళా కానిస్టేబుల్‌ను పంపి స్టింగ్ ఆపరేషన్ నిర్వహించగా అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేసి.. పుట్టబోయే బిడ్డ గురించి తెలుసుకొని ఆడపిల్ల అయితే గర్భస్రావానికి పాల్పడుతున్నట్టు విషయం వెలుగు చూసిందన్నారు. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్, టాస్క్‌ఫోర్స్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సంయుక్తంగా 18 మంది ముఠా సభ్యులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్టు చెప్పారు.