WHO on Covaxin | కరోనా మహమ్మారి ఆట కట్టించేందుకు భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ కొవాగ్జిన్‌ను అత్యవసర సమయంలో వాడేందుకు అనుమతించే విషయమై వచ్చేవారం తుది నిర్ణయం తీసుకుంటామని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. మంగళవారం ట్విట్టర్ వేదికగా ఈ విషయం వెల్లడించింది. వచ్చేవారం డబ్ల్యూహెచ్‌వో, స్వతంత్ర గ్రూప్ నిపుణులు సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపింది.
ఇప్పటికే కొవాగ్జిన్ వ్యాక్సిన్ తయారీకి సంబంధించిన డేటాను డబ్ల్యూహెచ్‌వోకు భారత్ బయోటెక్ అందజేసింది. గత నెల 27న డబ్ల్యూహెచ్‌వో విజ్ఞప్తి మేరకు అదనపు సమాచారం సమర్పించింది. ఈ సమాచారాన్ని ప్రస్తుతం తమ నిపుణులు సమీక్షిస్తున్నారని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. ఒకవేళ తలెత్తే సందేహాలపై వచ్చేవారం తుది మదింపు చేస్తామని తెలిపింది.
వ్యాక్సిన్ నాణ్యత, భద్రత, సమర్థతను డబ్ల్యూహెచ్‌వోతోపాటు ఇండిపెండెంట్ నిపుణుల టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ నిర్ధారిస్తాయి. తద్వారా అత్యవసర వినియోగానికి దీన్ని లిస్టింగ్ చేసే విషయమై తుది నిర్ణయం తీసుకుంటాయి.