అడుగడుగునా ఎక్సైజ్, పోలీసుల దాడులు
హైదరాబాద్, డిసెంబర్ 28 : రాష్ట్రంలో డ్రగ్ పెడ్లర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గంజాయితోపాటు ఇతర మాదకద్రవ్యాల స్మగ్లర్లకు చెక్ పెట్టేందుకు డ్రగ్ అఫెండర్స్ ప్రొఫైలింగ్, అనాలసిస్ అండ్ మానిటరింగ్ సిస్టం (డొపమ్స్) పేరిట ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తెచ్చారు. గతంలో డ్రగ్స్‌ను తరలిస్తూ పట్టుబడిన పాత నేరస్థుల సమాచారంపై దర్యాప్తు సంస్థల మధ్య సమన్వయం లోపించడం గంజాయి స్మగ్లింగ్ ముఠాలకు కలిసొచ్చేది. అధికారులు ఒక మార్గంపై దృష్టి పెడితే.. స్మగ్లర్లు మరో మార్గంలో ‘సరుకు’ దాటించేవారు. ఇలాంటి వారిని పట్టుకొనేందుకే పోలీసులు ‘డొపమ్స్’ను అందుబాటులోకి తీసుకొచ్చారు. డ్రగ్స్ తయారీ, రవాణా, విక్రయదారుల కేసుల ప్రొఫైలింగ్, మానిటరింగ్, విశ్లేషణకు ఈ టెక్నాలజీని ఉపయోగించనున్నారు. దీంతో డ్రగ్ పెడ్లర్లు రాష్ట్రంలో ఎక్కడ అరెస్టయినా, వారిపై ఏ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనా ఆ వివరాలన్నీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లకు అందుబాటులో ఉంటాయి. తద్వారా ఎక్కడ ఎలాంటి మత్తు పదార్థాలు పట్టుబడుతున్నాయో గుర్తించి ఆయా హాట్‌స్పాట్‌లో నిఘా పెంచేందుకు వీలవుతుంది. ఈ అప్లికేషన్‌ను టీఎస్‌కాప్ మొబైల్ యాప్‌తో అనుసంధానించడంతో రాష్ట్రవ్యాప్తంగా పోలీస్‌ల మధ్య సమన్వయం పెరుగుతుంది.
సరిహద్దుల్లో పటిష్ఠ నిఘా
వాస్తవానికి తెలంగాణలో గంజాయి సాగు, వినియోగం చాలా తక్కువ. కానీ ఇతర రాష్ర్టాల్లో పండించే గంజాయిని స్మగ్లర్లు మన రాష్ట్రం మీదుగా ఉత్తరాదికి పెద్ద మొత్తంలో తరలిస్తున్నారు. ప్రధానంగా ఇది ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (ఏవోబీ) నుంచి భద్రాచలం మీదుగా మన రాష్ట్రంలోకి వస్తున్నది. ఇక్కడి నుంచి మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ర్టాలకు రవాణా అవుతున్నది. ఈ రూట్‌పై తెలంగాణ ఎక్సైజ్ సిబ్బంది, పోలీసులు ప్రత్యేక నిఘా పెడుతున్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల ఉత్పత్తి, రవాణా సమాచారాన్ని అందించేవారికి, స్మగ్లర్లను పట్టుకొన్నవారికి ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. ఇటీవల రూ.2 కోట్ల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకొన్న మల్కాజ్గిరి ఎక్సైజ్ సూపరింటెండెంట్ అరుణ్‌కుమార్, ఇతర సిబ్బందిని ఆ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ శాలువాతో సత్కరించారు.
డ్రగ్స్ ఫ్రీ తెలంగాణే లక్ష్యం
మత్తు పదార్థాల రవాణా ముఠాలను పట్టుకొనేందుకు క్షేత్రస్థాయిలో సోదాలు పెంచాం. డ్రగ్స్ నుంచి తెలంగాణకు పూర్తిస్థాయిలో విముక్తి కల్పించడమే లక్ష్యంగా అనేక చర్యలు చేపడుతున్నాం. సాంకేతికత వినియోగాన్ని పెంచుకోవడంతోపాటు ఇతర రాష్ర్టాల దర్యాప్తు సంస్థలతోనూ టచ్‌లో ఉంటున్నాం. -మహేందర్‌రెడ్డి, డీజీపీ
ఎంతటివారైనా ఉపేక్షించేది లేదు
రాష్ట్రంలో మత్తు పదార్థాల రవాణా ముఠాలపై ఉక్కుపాదం మోపుతున్నాం. వీరి వెనుక ఎంతటివారున్నా ఉపేక్షించేది లేదు. పోలీస్, ఎక్సైజ్‌శాఖ అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం. రోడ్డు మార్గాలతోపాటు రైలు మార్గాలను కూడా కట్టుదిట్టం చేశాం. పరిస్థితి కంట్రోల్లోకి వచ్చింది. – శ్రీనివాస్‌గౌడ్, ఎక్సైజ్‌శాఖ మంత్రి