తుంగతుర్తి, జూలై 16 : అక్రమంగా తరలిస్తున్న 20 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. తుంగతుర్తి మండలం మానాపురం గ్రామంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మానాపురం గ్రామానికి చెందిన బానోతు వీరన్న, బాలాజీ, భద్రు తండాల్లోని గిరిజనుల వద్ద ప్రభుత్వం పంపిణీ చేసిన పీడీఎస్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి ఆటోల్లో తీసుకెళ్లి అమ్ముతున్నారం. సమాచారం మేరకు ఎస్ఐ దానియేల్కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది రైడ్ చేసి బియ్యాన్ని పట్టుకున్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్ఐ రామకోటి, సతీశ్, రవి, దీపక్‌రెడ్డి పాల్గొన్నారు.
18 క్వింటాళ్లు పట్టివేత
ఆత్మకూరు(ఎం) : మండల కేంద్రంలోని కామునిగూడెం ఎక్స్‌రోడ్డు, పారుపల్లి గ్రామా ల్లో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా 18 క్వింటాళ్ల పీడీఎస్ బి య్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ మధు తెలిపారు. నిందితులను తుర్కపల్లి మండలం మల్కాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని బిల్యానాయక్తండాకు చెందిన గూగులోతు శ్రీనివాస్, మాలోతు రమేశ్గా గుర్తించినట్లు చెప్పారు. బియ్యాన్ని తరలిస్తున్న వాహనాలతో పాటు వ్యక్తులను పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
దత్తప్పగూడెంలో 12 క్వింటాళ్లు..
మోత్కూరు : మండలంలోని పాచర్లబడితండాకు చెందిన బానోతు కృష్ణ, జంపెల్లి తండాకు చెందిన కనావత్ నర్సింహ, దరావత్ జైహింద్ మండలంలోని పలు గ్రామాల నుంచి 12 క్వింటాళ్ల సబ్సిడీ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి వాహనంలో తరలిస్తుండగా దత్తప్పగూడెంలో పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. వాహనాన్ని స్వాధీనం చేసుకుని నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వి.జానకిరాంరెడ్డి తెలిపారు.