సూర్యాపేట, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ) : రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావాలనే అత్యాశ అనర్థానికి చేటు. ఇది అనాదిగా ఉన్న సామెత.. అయితే కోట్లాది మందిలో ఎప్పుడో ఎక్కడో లక్కుతోనో.. లాటరీ ద్వారానో ఒకరిద్దరూ మాత్రమే రాత్రికి రాత్రే కోటీశ్వరులు అవుతారు. దివాళా తీసిన వారు కోకొల్లలు… అదేవిధంగా క్రిప్టోకరెన్సీ లాంటి ఆన్లైన్ ట్రేడింగ్ చేసి ఒకరిద్దరూ స్వల్పకాలంలో ధనవంతులు కాగా అలాంటి వాటిలో అత్యాశపరులు డబ్బులు పెట్టి చాలా మంది నష్టపోతున్నారు.
ఆన్లైన్ ట్రేడింగ్ ప్రమాదకరం
సాధారణంగా షేర్ మార్కెట్లో హోల్డ్ చేయడం, ఆన్లైన్ ట్రేడింగ్ ఉంటుంది. ఈ రెండింటిలో కంపెనీ రిప్యుటేషన్, లాభనష్టాలను బట్టి షేర్ విలువలు తగ్గడం, పెరుగుతాయి. మంచి కంపెనీలను గుర్తించి షేర్లు కొనుగోలు చేసి దీర్ఘకాలికంగా ఉంచితే మంచి లాభాలు ఉంటాయి. అలా కాకుండా ఏ రోజుకారోజు లాభాల కోసం ట్రేడింగ్ చేస్తే లక్కీ లాటరీ మాదిరిగానే ఉంటుంది. కొందరికీ లాభం.. మరి కొందరికి నష్టం కలుగుతుంది. అందుకే ఆన్లైన్ ట్రేడింగ్ అత్యంత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎలాంటి గుర్తింపు లేనిది క్రిప్టో కరెన్సీ
క్రిప్టోఅనే పదం చాలాకాలం నుంచి వినిపిస్తున్నా ఇటీవల అది ప్రమాదకరమైనదని అం దులో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే ఊబీలో కూరుకుపోతారని నిపుణులు సూచిస్తున్నారు. స్టాక్ మార్కెట్‌కు అయితే రెగ్యులేటరీ బాడీ ఉంటుంది. ప్రభు త్వ కంట్రోల్లో ఉంటుంది. కంపెనీల ఆడిటింగ్, లాభనష్టాలు, ఈక్విటీ క్యాపిటల్, రెగ్యులర్ డివిడెండ్, బోనస్ ఇలా అనేకం ఉంటాయి. దీంతో మ ంచి కంపెనీలను ఎంచుకొని పెట్టుబడి పెడితే పెద్దగా రిస్క్ ఉండదు. కానీ క్రిప్టోకు ఎలాంటి రెగ్యులేటరీ బాడీ ఉండదు. ప్రభుత్వ కంట్రోల్ అంతకన్నా లేదు. వాటి ధరలు ఎందుకు పెరుగుతున్నాయి. ఎందుకు తగ్గుతున్నాయో ఎవరికీ అర్థం కాదు.
అసలే ప్రమాదకరం… ఆపై నకిలీవి
క్రిప్టో కరెన్సీ లాంటి వాటి జోలికి ఎవరూ వెళ్లవద్దని ఆర్థిక రంగ నిపుణులు చెబుతుంటే ఇందులో కూడా నకిలీ కంపెనీలు పుట్టుకొస్తుడడం గమనార్హం. క్రిప్టో కరెన్సీకి ఎలాంటి గుర్తింపు ఉండదు అయినా వేల కోట్లు పెట్టుబడులు పెట్టి అతి కొద్ది మంది లాభాలు తీసుకుంటుండగా మిగిలిన వారు చేతులు కాల్చుకు ంటున్నారు. అలాంటి కంపెనీలలో కూడా ఇండియాలో ఊరు, పేరు లేని అడ్రస్‌లతో 15 వరకు ఫేక్ ఉన్నట్లు సమాచారం. సూర్యాపేటలో ఆత్మహత్యకు పాల్పడిన ఖమ్మం జిల్లాకు చెందిన రామలింగస్వామి కూడా దాదాపు కోటి వరకు నకిలీ కంపెనీలో పెట్టినట్లు తేలింది.
ఆన్లైన్ ట్రేడింగ్, క్రిప్టో ప్రమాదకరమైనవి
ఎవరైనా వచ్చే ఆదాయాన్ని బట్టి స్టాక్ మార్కెట్లో కొంతమేర షేర్లలో పెట్టుబడి పెట్టుకోవచ్చు. స్టాక్ మార్కెట్‌కు రెగ్యులేటరీ బాడీ, ప్రభుత్వ కంట్రోల్ ఉంటుంది. మరో విషయం ఏంటంటే స్టాక్ మార్కెట్లో నిఫ్టీ, సెన్సెక్స్‌లోని ఏదైనా కంపెనీ షేర్లు కొనుగోలు చేయాలంటే సదరు కంపెనీకి సంబంధించిన ఆడిటింగ్, లాభనష్టాలు, ఈక్విటీ క్యాపిటల్, రెగ్యులర్ డివిడెండ్, బోనస్ చూస్తారు. క్రిప్టో కరెన్సీకి ఏ రోజుకారోజు లక్కుపై ఆధారపడి ఉండాల్సిందే. ఆన్లైన్ ట్రేడింగ్, క్రిప్టో కరెన్సీ లాంటివి కొనుగోలు చేయడం చాలా ప్రమాదకరం.