వరంగల్ : వరంగల్ (Warangal) జిల్లా బార్ అసోసియేషన్ సభ్యుడు, న్యాయవాది గంధం శివ పై దాడి చేసిన హన్మకొండ సీఐ, కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సూర్యపేటలో న్యాయవాదులు విధులను బహిష్కరించి (Boycott ) కోర్టు ఎదుట నిరసన తెలిపారు. న్యాయవాదిపై పోలీసులు దురుసుగా ప్రవర్తించిన చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు.
దాడికి పాల్పడ్డ పోలీసులపై (Police) చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే రూపొందించాలన్నారు. చట్టానికి విధేయులుగా తమ విధులను నిర్వహిస్తున్న న్యాయవాదులపై పోలీసుల దౌర్జన్యం గర్హనీయమన్నారు. తమ విధుల బహిష్కరణ కు న్యాయమూర్తులు సహకరించాలని కోరుతూ రెండవ అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్ శ్యాం శ్రీ, సీనియర్ సివిల్ జడ్జి జిట్టా శ్యాం కుమార్, జూనియర్ సివిల్ జడ్జి మారుతి ప్రసాద్‌కు వినతి పత్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి జక్కుల వీరయ్య, న్యాయవాదులు కాల్వ శ్రీనివాసరావు, చనగాని యాదగిరి, ఒట్టికూటి అంజయ్య, కమతం నాగార్జున,రమణారెడ్డి, మీసాల అంజయ్య, విజికే మూర్తి, ఊదారి యాదగిరి, రామ లక్ష్మారెడ్డి, బుడిగ నరేష్, చక్రాల వెంకటేశ్వర్లు, ఎమ్మెస్ రాఘవరావు, నాగేష్ రాథోడ్, లతీఫ్, పాలేటి శ్రీనివాసరావు, మద్దుల నాగేశ్వరరావు, రమేష్, బానోతు శ్రీను నాయక్, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.