శనివారం 26 సెప్టెంబర్ 2020
Suryapet - May 27, 2020 , 04:31:57

ఎండ ప్రచండం .. వాహనం భద్రం

ఎండ ప్రచండం ..   వాహనం భద్రం

  • తగిన జాగ్రత్తలు  తీసుకోకపోతే నష్టం

ప్రస్తుతం ఎండ ప్రచండంగా మారిన నేపథ్యంలో మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కానీ నిత్య జీవితంలో భాగమైన ద్విచక్రవాహనం గురించి పట్టించుకోవడం లేదు. వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వాహనంతో పాటు జేబు గుల్లకావడం ఖాయమని మెకానిక్‌లు హెచ్చరిస్తున్నారు. చిన్నపాటి జాగ్రత్తలుతీసుకుంటే వాహనాలు సైతం పది కాలాలు నడుస్తాయి.

-తిరుమలగిరి/నేరేడుచర్ల    

ప్రస్తుతం ఎండ దంచి కొడుతోంది. జిల్లాలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో మనం, మన వాహనాన్ని ఎండ నుంచి కాపాడుకోవాలి. జిల్లాలో సుమారు 2.63లక్షలకు పైగా ద్విచక్రవాహనాలు ఉన్నాయి . నిత్యం వివిధ అవసరాల కోసం అన్ని వర్గాల ప్రజలు వీటిని వినియోగిస్తున్నారు. ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న ప్రస్తుత తరుణంలో ఎండవేడికి వాహనాలు ఆదే పనిగా తిప్పటం వల్ల వాహనాల జీవితకాలం తరిగి పోతుందని మెకానిక్‌లు పేర్కొంటున్నారు.  

పెట్రోల్‌ ఆవిరి. ..

వాహనాలను ఎండలో ఉంచితే పెట్రోల్‌ ఆవిరయ్యే ప్రమాదం ఉంది. రెండు గంటల పాటు ద్విచక్రవాహనాన్ని ఎండలో నిలిపి ఉంచినా ...తిప్పినా.. దాదాపు 100 మిల్లీ లీటర్ల పెట్రోల్‌ ట్యాంక్‌లోనే ఆవిరవుతుంది. దీనికి తోడు టైర్ల అరుగుదల కూడా అధికమవుతోంది. పగటిపూట బీటీ, సీసీ రోడ్లు వేడిగా ఉంటాయి. ఆ సమయంలో ద్విచక్రవాహనాలు వాటిపై వేగంగా తిప్పటం, ఆకస్మికంగా బ్రేకులు వేయడం వంటివి చేస్తే టైర్లు మెత్తబడి అరిగిపోతాయి. టైర్ల జీవితకాలం తగ్గి పోతుంది. ఎండలో వాహనాలు గంటల తరబడి నిలిపి ఉంచటం , తిప్పడం వల్ల ఉష్ణోగ్రతల తీవ్రత కారణంగా వాహనాల రంగు పాలిపోతుందని మెకానిక్‌లు హెచ్చరిస్తున్నారు. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • ఇళ్లల్లో వాహనం నిలిసే సదుపాయం లేక ఆరుబయట నిలపాల్సి వస్తే దానిపై విధిగా టార్పాలిన్‌ కవర్లు కప్పాలి. సాధ్యమైనంత వరకు చెట్ల నీడన నిలపడం మంచిది.
  • వేసవిలో ఉదయం 8 గంటలలోపు, సాయంత్రం 5గంటల తర్వాత వాహనాల్లో పెట్రోల్‌ పోయించడం మంచిది. రాత్రి సమయాల్లో ఇంధనం నింపితే ఆవిరయ్యే శాతం తగ్గుతుంది. 
  •  ద్విచక్ర వాహనం నిలిపి ఉంచిన సమయంలో తప్పనిసరిగా పెట్రోలు ఆఫ్‌ చేయాలి. ఆన్‌లో ఉంచితే ఓవర్‌ఫ్లో ఆవుతుంది. ఇంజిన్‌ నుంచి బయటకు లీకైతే బయటి వేడికి తోడు ఇంజిన్‌ వేడికి పెట్రోలు రాజుకునే ప్రమాదం ఉంటుంది. 
  •   టైర్లలో తగినంత గాలి ఉండేలా చూసుకోవాలి. బైక్‌పై ఎక్కువ దూరం వెళ్లేవారు 30 నుంచి 40 కిలోమీటర్లకు ఒకసారి ఆపి ప్రయాణిస్తే మేలు.  

ఇంజిన్‌ ఆయిల్‌ త్వరగా మార్చాలి

ద్విచక్రవాహనాలు ఎండలో అదే పనిగా తిప్పితే ఇంజిన్‌ ఆయిల్‌ త్వరగా మార్చాల్సి వస్తుంది. సాధారణంగా 3 వేల కిలోమీటర్లకు ఒక సారి బైక్‌లో ఇంజిన్‌ ఆయిల్‌ మార్చుతారు. వేసవిలో రెండు వేల కిలోమీటర్లకే దానిని మార్చాల్సి ఉంటుంది. ఎండలో ఎక్కువసేపు వాహనాలు తిప్పితే ఇంకా త్వరగా మార్చుకోవాల్సి ఉంటుంది.  

-పాషా, సీనియర్‌ మెకానిక్‌, తిరుమలగిరి


logo