సోమవారం 28 సెప్టెంబర్ 2020
Suryapet - Feb 24, 2020 , 02:13:33

నేటి నుంచి ‘పట్టణ ప్రగతి’

నేటి నుంచి ‘పట్టణ ప్రగతి’
  • మార్చి 4 వరకు కొనసాగనున్న కార్యక్రమం
  • స్థానిక సమస్యలతో పాటు పచ్చదనం, పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ
  • ప్రత్యేకాధికారుల నియామకం, వార్డు కమిటీల ఏర్పాటు పూర్తి
  • ఇప్పటికే నిధులు విడుదల చేసిన ప్రభుత్వం
  • నేడు ‘పేట’లో కార్యక్రమాన్ని ప్రారంభించనున్న మంత్రి జగదీశ్‌రెడ్డి

పట్టణాలు ఇక కొత్త శోభను సంతరించుకోనున్నాయి. పల్లె ప్రగతితో గ్రామాలన్నీ పచ్చదనం, పరిశుభ్రతతో సర్వాంగ సుందరంగా మారుతుండగా ఆ దిశగా పట్టణాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. నేటి నుంచి మార్చి 4 వరకు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టనుండగా అందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని 

సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్‌, నేరేడుచర్ల, తిరుమలగిరి మున్సిపాలిటీల్లో 141 వార్డులకు ప్రత్యేకాధికారులను నియమించగా.. అన్ని వార్డుల్లో 60 మందితో కూడిన వార్డు కమిటీలను ఏర్పాటు చేశారు. కార్యక్రమం కోసం ప్రభుత్వం ఇప్పటికే జిల్లాకు రూ. 2.45 కోట్లు విడుదల చేసింది. నేడు సూర్యాపేట మున్సిపాలిటీలో విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి 

పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. సూర్యాపేట సిటీ :  పల్లె ప్రగతితో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పంచాయతీల్లో పారిశుధ్యం, పచ్చదనాన్ని పెంచడంతోపాటు వైకుంఠధామాలు, డంపింగ్‌యార్డుల నిర్మాణాలను చేపట్టి పల్లె అసవరాలను తీరుస్తోంది. అదే తరహాలో మున్సిపాల్టీల్లో సమస్యలను పరిష్కరించి అభివృద్ధి పరుగులు పెట్టించడానికి ఈ నెల 24 నుంచి 10రోజుల పాటు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాలో సూర్యాపేట, కోదాడ, తిరుమలగిరి, హుజూర్‌నగర్‌, నేరేడుచర్ల ఉండగా వీటిలో మూడు నూతనంగా మున్సిపాల్టీలుగా మారాయి. వాటికి తొలిసారిగా ఎన్నికలు జరగడంతో ఇక్కడి ప్రజలు అభివృద్ధికి నూతన పాలకవర్గంపై ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పట్టణాల్లో అభివృద్ధికి పట్టణ ప్రగతి కార్యక్రమంతో కార్యాచరణ రూపొందించింది. 


ఇప్పటికే జిల్లాలోని 5 మున్సిపాల్టీల పరిధిలోని 141 వార్డులకు వార్డును యూనిట్‌గా తీసుకొని ప్రతి వార్డుకు ఒక ప్రత్యేకాధికారిని నియమించారు. ఆయా వార్డులకు సంబంధించి సమస్యలను గుర్తించేలా 60మందితో కూడిన వార్డు కమిటీలను ఏర్పాటు చేసింది. ప్రత్యేక అధికారులు ఆయా వార్డులో ఆసక్తి గల వారి నుంచి కమిటీ సభ్యులుగా వారికి గల అర్హతతో కూడిన దరఖాస్తులను స్వీకరించి వార్డు కమిటీని ఎన్నిక పూర్తి చేశారు. ఈ కమిటీలో 15 మంది మహిళలు, 15మంది యువత, 15మంది సీనియర్‌ సిటిజన్‌, 15మంది వార్డు ప్రముఖులతో కూడిన కమిటీలు సభ్యులుగా ఉన్నారు. 


పట్టణ ప్రగతిలో లాభాలు.. 

దీనిలో వార్డులో అవసరమైన పనులు గుర్తించి వాటిని పరిష్కరించడానికి కావాల్సిన సిబ్బంది, సామగ్రిని ఇప్పటికే ఆయా పరిధిలో గల మున్సిపల్‌ ఉన్నతాధికారులు సిద్ధం చేసుకున్నారు. అత్యవసర పనులను గుర్తించి వాటి పరిష్కారానికి ఈ కార్యక్రంలో ప్రత్యేక చొరవ తీసుకోనున్నారు. వార్డుల్లో నీటి అవసరాలకు లైన్లు వేయడం లేదా డ్రైనేజీ సరిగా లేని చోట ఏర్పాటు, రోడ్ల మరమ్మతు, చెట్లను నాటడం, నాటిన చెట్ల సంరక్షణ చర్యలు, కరెంట్‌ సమస్యలు, వైర్లు ఇండ్లపై తేలడం, అస్తవ్యస్తమైన స్తంభాల తొలగింపు, పారిశుధ్య పనులు, వైకుంఠధామాల నిర్మాణం వంటి సమస్యలు పరిష్కారం కానున్నాయి. 


పచ్చదనం, పారిశుధ్యం ప్రత్యేక దృష్టి..

పట్టణ ప్రగతిలో ప్రధానంగా స్థానిక సమస్యలైన తాగునీరు, కరెంట్‌ సమస్యలు, రోడ్ల మరమ్మతుతోపాటు ముఖ్యంగా పచ్చదనంపై ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి పెట్టనున్నారు. వార్డుకు ఒకటి చొప్పున నర్సరీ ఏర్పాటు చేయనున్నారు. ప్రతి ఇంటికి 6కు పైగా మొక్కలను నాటేలా ప్రజలను భాగస్వాములగా చేయనున్నారు. పట్టణ ప్రగతిలో పదిశాతం వరకు పచ్చదనం కోసం వెచ్చించనున్నారు. గతం మాదిరి కాకుండా మొక్కలు పెంపకాన్ని వార్డు కమిటీలు లెక్కలతో సహా అధికారులకు చూపించాల్సి ఉంటుంది. వార్డులో నెలకొన్న పారిశుధ్య సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించారు. పారిశుధ్యం సమస్యల పరిష్కారం కోసం మున్సిపాల్టీల్లో తాత్కాలిక సిబ్బంది, ట్రాక్టర్‌, జేసీబీలను ఇప్పటికే సమకూర్చుకున్నారు.  రాష్ట్ర ప్రభుత్వం పల్లెల్లో రెండు విడుతల్లో పల్లె ప్రగతిని చేపట్టి గ్రామాల్లో పలు సమస్యలను పరిష్కరించడంలో పాటు ప్రతి గ్రామంలో నర్సరీ, వైకుంఠధామాలు, డంపింగ్‌యార్డు వంటి మౌలిక వసతులను ఏర్పాటు చేస్తున్నారు. నేడు పట్టణంలోని సమస్యలను సైతం పరిష్కరించి పారిశుధ్యం, రోడ్ల మరమ్మతు, నీటి సమస్యలు వంటి వాటిని అధికారులు యుద్ధ ప్రాతిపదికన చేస్తారని పట్టణ ప్రజల అవసరాలు ఈ కార్యక్రమంలో తీరుతాయని పట్టణ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నేడు సూర్యాపేట మున్సిపాలిటీలో విద్యుత్‌ శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుండగా ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ప్రారంభిస్తారు.


logo