
పంచాయతీ కార్యాలయాల్లో సిటిజన్ చార్టర్
పక్కాగా పంచాయతీ రాజ్ చట్టం అమలు
నిర్ణీత గడువులో 17 రకాల సేవలు
ఆన్లైన్లో దరఖాస్తు చేస్తే వెంటనే పరిష్కారం
మిగతా రాష్ర్టాలకు ఆదర్శంగా పౌర సేవలు
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన
సూర్యాపేట, జూలై 1 : కొత్త పంచాయతీరాజ్ చట్టం విజయవంతంగా అమలవుతున్నది. గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేసిన సిటిజన్ చార్టర్ ప్రకారం 17 రకాల సేవలు నిర్ణీత గడువులోపు అందుతున్నాయి. ఈ-పంచాయతీ వెబ్సైట్లోకి వెళ్లి కావాల్సిన పనిపై దరఖాస్తు చేసుకుంటే పంచాయతీ అధికారి వెంటనే స్పందిస్తారు. సరైన పత్రాలు ఉంటే అనుమతిస్తారు.. లేకుంటే తిరస్కరిస్తారు. ఈ విధానంతో సంబంధిత వ్యక్తితోపాటు పంచాయతీ కార్యదర్శి ఫోన్‌కు
సమాచారం అందుతుంది. నిర్ణయించిన సమయంలో పనిచేయని అధికారిపై ఫిర్యాదు కూడా చేయొచ్చు. ఈ పౌర సేవలను అన్ని రాష్ర్టాలు అనుసరించాలని కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ సూచించడంతో దీనికి మరింత ప్రాధాన్యం పెరిగింది.
గ్రామాల్లో ప్రజలకు పారదర్శకంగా, మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం పంచాయతీ రాజ్-2018 చట్టాన్ని అమలు చేస్తున్నది. ఈ చట్టంలో భాగంగా గ్రామ పంచాయతీలో 17 రకాల సేవలు త్వరగా అందించాలనే ఉద్దేశంతో రూపొందించిన సిటిజన్ చార్టర్‌తో మెరుగైన సేవలు అందుతున్నాయి ప్రస్తుతం చార్టర్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా అమలు కానున్నది. జనన, మరణాల నుంచి వీధుల శుభ్రం వరకు ఎలాంటి సమస్య ఉన్న ఆన్లైన్లో దరఖాస్తు చేస్తే నిర్ణయించిన గడువులోగా పనులు చేయాల్సి ఉంటుంది. ఒక వేళ సమస్యను పరిష్కరించకపోతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి సదరు అధికారిపై చర్యలు తీసుకోవచ్చు.
సమైక్య రాష్ట్రంలో మూస పద్ధతిలో ఉన్న పం చాయతీ చట్టాన్ని పక్కకు పెట్టి సీఎం కేసీఆర్ పంచా యతీరాజ్ చట్టం-2018 తీసుకొచ్చారు. గ్రామ పంచాయతీ పాలన విధులు, నిధులను పక్కాగా పొందుపరుస్తున్నారు. నూతన పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చిన తరువాత గ్రామాల్లో అభివృద్ధ్ది కమిటీలను ఏర్పాటు చేసి పరిపాలనను పారదర్శకం చేసింది. పల్లె ప్రగతితో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి గ్రామాలను శుభ్రం చేయడంతోపాటు పార్కులు, డంపింగ్ యార్డులు, వైకుంఠధామాల నిర్మాణం, హరితహారం వంటి కార్యక్రమాలను చేపట్టి గ్రామాలను అభివృద్ధ్ది పథంలో నడిపిస్తున్నారు. వీటితోపాటు పౌర సేవల కోసం ఈ -పంచాయతీ ద్వారా మెరుగైన సేవలు అందిస్తున్నారు. 17 రకాల సేవలు నిర్ణీత కాల వ్యవధిలో అందేలా ఈ -పంచాయతీలో పొందుపరిచారు. ఒక్క రోజు నుంచి 15 రోజుల వ్యవధి లోపు అమలు చేయాల్సి ఉంటుంది .
దరఖాస్తు విధానం
గ్రామ పంచాయతీలో నివాసం ఉండే వారు జనన, మరణ ధ్రువీకరణ పత్రం లేదా ఇంటి నిర్మాణం వంటి 17 రకాల సేవల్లో ఏదో ఒకటి దరఖాస్తు చేసుకోవాలంటే ఈ -పంచాయతీ పోర్టల్‌లో e – panchayat. telangana.gov.inలో లాగిన్ అయిన తరువాత ఫోన్ నంబర్‌తో ఐడీ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. కావాల్సిన సేవ కోసం పూర్తి డాక్యుమెంట్లు సమర్పించాలి. దరఖాస్తు చేసుకున్న వెంటనే ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి, దరఖాస్తు దారుడికి మెసేజ్ వస్తుంది. ఉదాహరణకు జనన ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసే మూడు రోజుల వ్యవధిలో ఇవ్వాల్సి ఉంటుంది. కానీ పంచాయతీ కార్యదర్శి వాటిని దరఖాస్త్తు దారుడు పెట్టుకున్న దానిని పరిశీలించి ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే మరికొన్ని డాక్యుమెంట్లను పెట్టాల్సి ఉంటే తిరస్కరిస్తాడు. పెట్టాల్సిన పత్రాల వివరాలు పొందుపరుస్తాడు. ఒకవేళ అనుమతి వస్తే ధ్రువీకరణ పత్రం ఇస్తున్నట్లు మెసేజ్ వస్తుంది.