ఫొటోగ్రఫీలో మరో కీలకమైన అంశం.. ఫ్రేమింగ్. ఇది ఫొటో కంపోజింగ్‌లో ప్రాథమిక టెక్నిక్. సాధారణ దృశ్యాలను కూడా ఆకర్షణీయంగా చూపిస్తుంది. కొంచెం క్రియేటివిటీని కూడా జతచేస్తే.. మామూలు సబ్జెక్టులను కళాఖండాలుగా మార్చేస్తుంది.
ఫ్రేమింగ్ అంటే చిత్రాన్ని కంపోజ్ చేసే ప్రక్రియ. ఫొటోల్లో ఏయే విషయాలు ఉండాలో.. వేటిని వదిలేయాలో ఎంచుకోవడమే ఫ్రేమింగ్! సరైన ఫ్రేమింగ్ వల్ల వీక్షకుల దృష్టి సబ్జెక్ట్పైకి మళ్లుతుంది. అందులోనూ ‘క్రియేటివ్ ఫ్రేమింగ్’ అంటే.. సబ్జెక్ట్ చుట్టూ ఉండే వస్తువులనే ఓ ఫ్రేమ్‌గా మార్చేయడం. ఇందుకోసం పెద్దపెద్ద కెమెరాలే ఉండాల్సిన అవసరం లేదు. స్మార్ట్‌ఫోన్‌తోనే మంచి ఫ్రేమింగ్‌తో అద్భుతమైన ఫొటోలు తీయొచ్చు.
మీరు ఎంచుకున్న దృశ్యంలో సబ్జెక్ట్ చుట్టూ ఉండే వస్తువుల్నే ఫ్రేమ్‌లా చూపించడాన్ని క్రియేటివ్ ఫ్రేమింగ్ అంటారు. ఇందులో సహజసిద్ధంగా ఉండే వస్తువులతోపాటు అవసరమైతే.. ఆర్టిఫీషియల్ వస్తువులనైనా ఫ్రేమింగ్ కోసం వాడుకోవచ్చు. ఇది.. వీక్షకుల దృష్టిని డైరెక్ట్‌గా సబ్జెక్ట్పైకి తీసుకెళ్తుంది. ఫొటోకు మంచి డెప్త్‌ను తీసుకొస్తుంది. కొన్ని ఫ్రేమ్స్.. సబ్జెక్ట్‌కు సంబంధించిన స్టోరీని కూడా చెబుతాయి.
కిటికీలు, గేట్లు, చెట్ల ఆకులు, ఫ్రెంచ్ డోర్లు, లైటింగ్, షాడోలు (నీడలు), చేతులు లేదా ఇతర శరీర భాగాలను కూడా ఫ్రేమ్‌గా వాడుకోవచ్చు.
ఇక మీ ఫ్రేమ్‌లో సబ్జెక్ట్ సరిగ్గా అమరిందా లేదా అన్నదీ చూసుకోవాలి. అందుకోసం ఫోకస్ మొత్తం సబ్జెక్ట్‌పైనే పెట్టాలి. లేకుంటే.. ఫ్రేమ్ హైలైట్ (ఫోకస్) అయ్యే అవకాశం ఉంటుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో ఏవైనా డిస్ట్రాక్షన్స్ ఉంటే.. వీక్షకుల దృష్టి సబ్జెక్ట్ పైనుంచి పక్కకు మర్లుతుంది. కాబట్టి, ఫ్రేమ్‌లో ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా చూసుకోవాలి. ఇక నెగెటివ్ స్పేస్ (ఖాళీ స్థలం) ఎక్కువగా ఉంటే.. ఫొటోకు కొత్త అందం వస్తుంది. ఫొటోలు సరికొత్తగా కనిపించాలంటే.. విభిన్న యాంగిల్స్‌లో ఫ్రేమింగ్ చేయండి. కిందినుంచి పైకి.. పై నుంచి కిందికి ఫొటోలు తీయండి. గోడల్లోని రంధ్రాలనే ఫ్రేమ్‌గా చేసుకొని.. అవతల ఉన్న సబ్జెక్ట్పైకి ఫోకస్ పెట్టి ఫొటోలు తీయండి. అయితే, ఫ్లాష్‌లైట్ కంటే సహజమైన వెలుతురే బాగుంటుంది. కాబట్టి, ఉదయం లేదా సాయంత్రం వేళల్లోని గోల్డెన్ అవర్స్‌ను ఇందుకోసం ఎంచుకోండి. ఈ క్రియేటివ్ ఫ్రేమింగ్ కోసం ఎక్కడెక్కడికో వెళ్లాల్సిన పనిలేదు. ఇంట్లో ఉన్నప్పుడు కిటికీలు, దర్వాజలోంచి బయటి దృశ్యాలను ఫొటో తీయొచ్చు. పార్క్‌లో ఉంటే.. చెట్ల కొమ్మలు, ఆకులనే ఫ్రేమ్‌గా మలుచుకోవచ్చు. రోడ్డుమీద కారులో వెళ్తున్నారా? అయితే, కారు విండోలో కనిపించే అస్తమించే సూర్యుడు, నీలాకాశాన్ని ఫోకస్ చేయండి. ఫ్రేమ్‌లో ఎక్కువ అంశాలు లేకుండా చూసుకోండి. లేకుంటే.. అన్నీ కలిపి ఫొటో గజిబిజిగా తయారవుతుంది.
గ్రిడ్లైన్స్ : ఆన్ చేసుకొని.. రూల్ ఆఫ్ థర్డ్స్ను పాటించండి.
ఫోకస్ : ఎప్పుడూ సబ్జెక్ట్‌పైనే ఉండేలా చూసుకోండి.
పోర్ట్రెయిట్ మోడ్ : బ్యాక్‌గ్రౌండ్‌ను బ్లర్‌గా మార్చేసి.. సబ్జెక్ట్‌ను హైలైట్ చేస్తుంది.
హెచ్డీఆర్ మోడ్ : వెలుతురు ఇబ్బంది ఉన్నప్పుడు ఈ మోడ్‌ను ఆన్ చేసుకోండి. ఎడిటింగ్ సమయంలో ఇబ్బంది లేకుండా ఉంటుంది.
ఎడిటింగ్ టిప్స్ : క్రాప్ : ఈ టూల్ ద్వారా ఫొటోను కావాల్సిన మేరకు కట్ చేసుకోండి. ఫ్రేమ్‌ను మరింత పర్ఫెక్ట్గా మార్చండి.
బ్రైట్నెస్, కాంట్రాస్ట్‌ను తగ్గించడం ద్వారా ఫొటోకు మంచి టోన్ ఇవ్వండి.
షార్పెనింగ్ అండ్ స్ట్రక్చర్ : ఈ టూల్స్‌తో ప్రధాన అంశాన్ని మరింత స్పష్టంగా చూపించండి.
చివరిగా.. క్రియేటివ్ ఫ్రేమింగ్ అనేది ప్రతిఫొటోకూ ఓ కథను తీసుకొస్తుంది. ఓ దృష్టికోణాన్ని అందిస్తుంది. మీరు మొబైల్ ఫోన్‌తో ఉన్నా సరే.. సృజనాత్మకంగా ఆలోచిస్తే ప్రతిఫొటోనూ ప్రత్యేకంగా చూపించొచ్చు. మీ చుట్టూ ఒక్కసారి పరికించి చూడండి. ఏ వస్తువుతో ఎలాంటి ఫ్రేమ్ తయారు చేయొచ్చో ఆలోచించండి. ఒక ఫొటో తీసి ప్రయత్నించండి. బాగాలేకుంటే.. మరొక ఫ్రేమ్‌ను ప్రయత్నించండి. బాగుంటే.. మరింత క్రియేటివ్‌గా ఫ్రేమింగ్ చేయండి.