ఆర్థిక నిర్వహణ విభాగంలో రాబర్ట్ కియోసాకి రాసిన ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ ఓ ప్రసిద్ధి చెందిన క్లాసిక్. దీన్ని చదివిన పాఠకులకు డబ్బు నిర్వహణ గురించి ఎన్నో విషయాలు తెలుస్తాయి. డబ్బును నిర్వహించడం మొదలుకుని దాన్ని సృష్టించేవరకు అనుసరించాల్సిన ఎన్నో వ్యూహాలను ఈ పుస్తకం మనకు నేర్పుతుంది. వాటిలో ముఖ్యమైన ఎనిమిది పాఠాలు.
ఈ పుస్తకంలో రాబర్ట్ కియోసాకి మనం విద్యాలయాల్లో నేర్చుకునే విద్య ఆర్థిక పాఠాలను నేర్పించదనే విషయాన్ని గుర్తుచేస్తారు. కానీ, డబ్బు ఎలా పనిచేస్తుంది, మంచి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం ఎలా అనేది అవగాహన చేసుకోవడానికి ఆర్థిక విద్య కూడా అంతే అవసరం అంటాడు.
రిచ్‌డాడ్ పూర్‌డాడ్ నేర్పే ముఖ్యమైన పాఠం ఆస్తులు (అసెట్స్), అప్పులు (లయబిలిటీస్) మధ్య తేడా ఎలా గ్రహించాలనేది. ఆస్తులు, డబ్బును మన జేబులోకి
తీసుకువస్తే, అప్పులు దాన్ని ఖాళీ చేస్తుంటాయి. కాబట్టి వీలైనంత వరకు అప్పుల జోలికి పోకుండా ఆస్తుల మీదే దృష్టిపెట్టాలన్నమాట!
చక్రవడ్డీ ప్రయోజనాన్ని భారీగా రాబట్టుకోవాలంటే వీలైనంత తొందరగా డబ్బును మదుపుచేయడం మంచిదని కియోసాకి సలహా. ఎంత తొందరగా మొదలుపెడితే అంత వేగంగా మన డబ్బులు పెరుగుతూ ఉంటాయి.
కేవలం ఒక్క జీతం మీద ఆధారపడటం రిస్క్‌తో కూడిన వ్యవహారం అంటాడు కియోసాకి. పైగా ఇప్పటి పరిస్థితులకు ఈ తరహా జీవన విధానం ఏమాత్రం సరైంది కాదు కూడా! కాబట్టి, పెట్టుబడులు, లేదంటే సైడ్ బిజినెస్‌ల ద్వారా వీలైనన్ని ఆదాయ మార్గాలను ఎంచుకోవాలనేది ఆయన సూచన.
రిచ్‌డాడ్ ప్రతి సందర్భంలోనూ అవకాశాలనే చూస్తాడు. అవసరమైతే కాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుంటాడు. అదే పూర్‌డాడ్ డబ్బులు కోల్పోతానేమో అని భయపడుతూ బిక్కుబిక్కుమంటూ బతుకుతుంటాడు. అలా డబ్బులు పెంచుకునే అవకాశాన్ని కోల్పోతాడు.
ధనవంతులు తమ దగ్గరున్న డబ్బు తమ కోసం పనిచేసేలా చూసుకుంటారని కియో సాకి వివరిస్తాడు. వాళ్లు నిరుపయోగంగా ఉన్న పాసివ్ ఆదాయ వనరులను తాము పని చేయనప్పుడు కూడా డబ్బులు తెచ్చిపెట్టేలా ఉపయోగించుకుంటారు.
సమాజంలో ఎవరో ఒకరు పన్నులు కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. రిచ్‌డాడ్ ప్రకారం అది మధ్యతరగతి వాళ్లపైన ఉంటుంది. కానీ, ధనవంతులు మాత్రం పన్నుల చట్టాలను అర్థం చేసుకుంటారు. వాటిలోని లొసుగుల ఆధారంగా భారీగా మిగుల్చుకుంటారని రిచ్‌డాడ్ పూర్‌డాడ్ వివరిస్తుంది.
ఎవరికైనా సరే ఆర్థిక విషయాల గురించి నేర్చుకోవడానికి మెంటర్ అవసరం ఉంటుందంటాడు కియోసాకి. ముఖ్యంగా మీరు ఆర్థికంగా చేరుకోవాలనుకుంటున్న ఉన్నత శిఖరాలను ఇప్పటికే అందుకున్న వారి సాయం తప్పనిసరి.