మూడు రోజుల క్యాంపు నుంచి అప్పుడే స్టేషన్‌కు వచ్చిన ఇన్స్పెక్టర్ రుద్ర.. కొత్త కేసుల ఫైల్‌ను తీసుకురమ్మని హెడ్ కానిస్టేబుల్ రామస్వామిని పురమాయించాడు. కొత్త కేసుల కట్టను పట్టుకొచ్చిన రామస్వామి.. ‘సార్.. శశాంక్ సార్ చనిపోయారు’ అంటూ గద్గద స్వరంతో చెప్పాడు.
‘వాట్..!’ అశ్చర్యంతో షాకైన రుద్ర తనను తాను తమాయించుకొని.. ‘ఎలా? ఎప్పుడు?? హెడ్‌క్వార్టర్స్‌లో నాతో ఎవరూ ఈ విషయం అనలేదే?’ అంటూ ఆవేదన వ్యక్తంచేశాడు. రుద్ర, శశాంక్ గతంలో రెండు మూడు కేసుల మీద కలిసి పనిచేశారు. ఆ కొద్దికాలంలోనే శశాంక్ నడవడిక, మంచితనం, డ్యూటీపై మక్కువ.. రుద్రను ఎంతగానో ఆకర్షించాయి. ‘అసలు శశాంక్ ఎలా చనిపోయాడు?’ అంటూ ప్రశ్నించాడు రుద్ర. ‘రెండు రోజుల కిందట తన గదిలో సూసైడ్ చేసుకొన్నారట సార్.
ఏం కష్టమొచ్చిందో ఏమో? పాపం.. చిన్నవయసులోనే ఇలా అర్ధంతరంగా జీవితం ముగించారు. పాపం.. ఆయన భార్య..’ అంటూ ఆగిపోయాడు రామస్వామి. ‘పూజగారికి ఏమైంది?’ కాస్త ఆందోళనగా అడిగాడు రుద్ర. ‘నిండు గర్భిణి. భర్త కోల్పోయిన దుఃఖాన్ని ఎలా దిగమింగుతుందో ఏమో??’ సానుభూతి వ్యక్తంచేశాడు రామస్వామి. కేసు ఫైళ్లను పక్కనబెట్టిన రుద్ర.. ఫోన్ అందుకొని పూజకు కాల్ చేశాడు. శశాంక్ భార్య పూజ. ఆమెకు, రుద్రకు కూడా పరిచయం ఉంది. ‘హలో.. రుద్రగారూ చెప్పండి’ బాధగా అంది పూజ. ‘అసలేమైంది పూజగారూ??’ డైరెక్టుగా పాయింట్లోకి వచ్చాడు రుద్ర.
‘నా కండ్ల ముందే కాల్చుకొని.. నన్ను, నా బిడ్డకు అన్యాయం చేసి.. శశాంక్ వెళ్లిపోయాడు!’ అంటూ భోరున విలపించింది పూజ. ‘కంట్రోల్ పూజగారూ. అసలు ఎందుకిలా?’ ప్రశ్నించాడు రుద్ర. ‘నాకూ ఏమీ అర్థంకావట్లేదు రుద్రగారూ! అయన ఎందుకు ఈ దారుణ నిర్ణయం తీసుకున్నారో.. వద్దు వద్దంటున్నా అదీ నా కండ్లముందే ఎందుకు కాల్చుకున్నారో ఇప్పటికీ అర్థంకావట్లేదు’ అంటూ ఏడ్చింది. ‘ఐయామ్ వెరీ సారీ.. పూజగారూ! అన్నట్టు శశాంక్ నాన్నగారు ఎక్కడున్నారు?’ అడిగాడు రుద్ర. ‘మామయ్య.. ఇంతకుముందే ట్యాబ్లెట్స్ వేసుకొని పడుకొన్నారు’ చెప్పింది పూజ. ‘సరే.. ఆయనతో రేపు ఓసారి మాట్లాడుతాను!’ అని చెప్పేసి ఫోన్ కట్‌చేశాడు రుద్ర.
ఆ రాత్రంతా రుద్రకు నిద్రపట్టలేదు. ఎప్పుడూ ఎంతో ధైర్యంగా ఉండే శశాంక్ ఇలా చేసుకున్నాడంటే రుద్రకు నమ్మాలనిపించట్లేదు. పైగా ఫ్యామిలీ రిలేషన్స్‌కు ఎప్పుడూ ప్రాధాన్యం ఇచ్చే శశాంక్.. భార్య గర్భిణిగా ఉన్న సమయంలో ఇలా చేశాడన్న విషయమే రుద్రను స్థిమితంగా ఉండనివ్వట్లేదు. దీంతో ఆ రాత్రే కేసు ఫైల్‌ను హెడ్‌క్వార్టర్స్ నుంచి తెప్పించుకున్నాడు రుద్ర.
రెండు రోజుల కిందట సాయంత్రం ఏడు గంటల సమయంలో తన గదిలోకి వెళ్లి డోర్ పెట్టుకొన్నాడు శశాంక్. ఏమైందోనంటూ కిచెన్ నుంచి పరిగెత్తుకొచ్చిన పూజ.. డోర్ తీయాలంటూ బతిమిలాడింది. ఎంతకూ తీయకపోవడంతో కిటికీలోంచి చూసింది. రైఫిల్‌తో తల కణితిలో తనను తాను కాల్చుకోబోతున్న శశాంక్‌ను వద్దంటూ బతిమాలింది. ‘మామయ్యా.. త్వరగా రండి!’ అంటూ పిలవసాగింది. ఈలోపే శశాంక్ కాల్చేసుకున్నాడు. అది చూసిన పూజ స్పృహ కోల్పోయింది. శబ్దంవిని మేడ మీదినుంచి కిందికి పరిగెత్తుకొచ్చిన శశాంక్ నాన్న.. పూజ పరిస్థితిని చూసి షాక్ అయ్యాడు. గదిలో విగతజీవిగా పడిఉన్న కొడుకు దగ్గరికి వెళ్లి.. భోరున ఏడుస్తూ పోలీసులకు సమాచారం ఇచ్చాడు.. ఇదీ రిపోర్ట్‌లో రాసి ఉంది. మరుసటి రోజు..
‘అంకుల్.. శశాంక్‌కు అలా జరిగినందుకు చాలా బాధగా ఉంది’ ఉద్వేగంగా చెప్పాడు రుద్ర. ‘నాకు తెలిసి.. వాడు ఎన్నడూ ఎవరికీ ఏ అపకారం చేయలేదు. ఆర్మీలో ఎంతోమంది చనిపోవడాన్ని చూశా. అయితే, కన్న కొడుకు మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నా..’ అంటూ కన్నీళ్లు తుడుచుకొంటూ నిస్సహాయంగా అన్నాడు శశాంక్ తండ్రి. ‘అంకుల్.. శశాంక్‌ది నిజంగానే సూసైడా?’ సూటిగా అడిగాడు రుద్ర. ఆ ప్రశ్నతో ఒకింత షాక్‌కు గురైన శశాంక్ తండ్రి.. ఏం జరుగుతున్నదో అర్థంకానట్టు మిన్నకుండిపోయాడు. ఇంతలో అక్కడికి వచ్చిన పూజ.. ‘ఏంటి రుద్రగారూ? మా మామయ్యను అనుమానిస్తున్నారా?’ కోపంతో మండిపడింది. ‘యెస్ పూజగారు. సర్వీస్ రివాల్వర్ ఉండగా, శశాంక్.. రిటైరైన మీ మామగారి పాత రైఫిల్‌తో కాల్చుకోవడమేంటి? అందుకే నాకు ఈయన మీద డౌట్ వస్తున్నది’ అన్నాడు రుద్ర.
‘మీరు చెప్తుంటే.. నాక్కూడా అనుమానంగానే ఉంది రుద్రగారూ. అవునూ.. నా భర్త రైఫిల్‌తో కాల్చుకోవడమేంటి?’ సందేహాన్ని వ్యక్తం చేసింది పూజ. ఒళ్లంతా పట్టిన చెమటలతో నిశ్చేష్టుడిగా ఉండిపోయాడు శశాంక్ తండ్రి. ఇంతలో రుద్ర కలగజేసుకొంటూ.. ‘అసలు మీరు సరిగ్గా గుర్తు చేసుకోండి. శశాంక్.. మీ మామయ్యగారి రైఫిల్‌తోనే కాల్చుకొన్నారా? రివాల్వర్‌తోనా? ఒకవేళ, మీ మామగారి రైఫిల్‌తో కాల్చుకొంటే, అప్పుడు మీ మామయ్య ఎక్కడ ఉన్నారు? మేడమీద ఉన్నారనుకొనే మీరు ‘మామయ్యా..’ అంటూ పిలిచినట్టు రిపోర్ట్‌లో ఉంది. ఆ తర్వాత మీరు స్పృహ కోల్పోయారు.
మీ మామయ్య మేడమీద ఉన్నారో.. లేదా ఆ రూమ్‌లోపలే ఉన్నారో తెలియదు కదా!? పైగా మేడ మీదినుంచి వచ్చీరాగానే గడియపెట్టిన రూమ్‌లోకి మీ మామయ్యగారు ఎలా వెళ్లగలిగారు??’ పోలీస్ రిపోర్ట్‌ను చూపిస్తూ రుద్ర అడిగిన ప్రశ్నలతో అక్కడ నిశ్శబ్దం రాజ్యమేలింది. ‘అవునవును.. ఇప్పుడు గుర్తొస్తుంది. శశాంక్.. మామయ్య రైఫిల్‌తోనే కాల్చుకొన్నాడు. అది నేను చూశా. అయితే, మామయ్య అప్పుడు రూమ్‌లో ఉన్నారో, మేడ మీద ఉన్నారో మాత్రం నాకు తెలియదు. ఆ తర్వాత స్పృహతప్పి పడిపోయా’ అంటూ పూజ సమాధానమిచ్చింది. ఐదు నిమిషాలపాటు నిశ్శబ్దం.
ఒళ్లంతా చెమటలు పట్టి శశాంక్ తండ్రి స్పృహ కోల్పోయే స్థితికి వచ్చాడు. ఇంతలో అక్కడికి వచ్చిన లేడీ కానిస్టేబుల్‌తో.. ‘ఈమెను అరెస్ట్ చేయండి’ అంటూ రుద్ర పూజవైపు వేలుని చూయించాడు. ‘అంకుల్.. మరేం భయపడకండి. శశాంక్‌ను చంపింది మీరుకాదు. మీ అబ్బాయిని చంపింది మీ కోడలే!’ అంటూ బాంబు పేల్చాడు రుద్ర. తర్వాతి విచారణలోనూ అదే నిజమని తేలింది. ఇంతకీ, శశాంక్‌ది ఆత్మహత్య కాదు హత్య అని, ఆ హత్య కూడా పూజే చేసిందని రుద్ర ఎలా కనిపెట్టాడు?
పోలీసు రిపోర్టులో పూజ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం.. శశాంక్ రైఫిల్‌తో కాల్చుకొని చనిపోయాడు. అయితే, నిజానికి పొడుగ్గా ఉండే ఆర్మీ రైఫిల్‌తో ఎవరూ తమకు తాము కణితిలో కాల్చుకోవడం సాధ్యంకాదు. అంటే, పూజ అబద్ధం చెప్పిందని అర్థమయ్యింది. పైగా మేడ మీదినుంచి పరుగెత్తుకొచ్చిన శశాంక్ తండ్రి గదిలోకి డైరెక్టుగా వెళ్లాడంటే, శశాంక్‌ను రైఫిల్‌తో కాల్చేసిన పూజ.. బయటికి వచ్చి స్పృహకోల్పోయినట్టు నాటకమాడినట్టు లెక్క. శశాంక్ కొలిగ్ ప్రియతమ్‌తో అక్రమ సంబంధం పెట్టుకొన్న పూజ గర్భవతి అయ్యింది. ఆ విషయం తెలుసుకొన్న శశాంక్ దానిపైనే ప్రశ్నించాడు. దాంతో ప్రియతమ్ ఇచ్చిన సలహాతో పూజానే శశాంక్‌ను చంపేసింది. ప్రియతమ్ కూడా డిపార్ట్మెంట్లోనే పనిచేస్తుండటంతో.. విషయం బయటికి పొక్కకుండా పోస్ట్‌మార్టమ్, ఫోరెన్సిక్ ఇలా అందర్నీ మేనేజ్ చేశాడు. అయితే, చివరికి ఇద్దరూ రుద్రకు ఇలా దొరికిపోయారు.
…? రాజశేఖర్ కడవేర్గు