పెట్టుబడి అనగానే అందరూ ఏ వ్యాపారంలో అనే అడుగుతుంటారు! ప్రతి పెట్టుబడినీ వ్యాపార కోణంలో చూడొద్దు. ఎక్కడ ఇన్వెస్ట్ చేశామన్నది ఎంత ముఖ్యమో? ఎప్పుడు చేశామన్నది కూడా అంతే ప్రాధాన్యాన్ని సంతరించుకుంటుంది. ఈ రెండిటి కన్నా.. ఎందుకు ఇన్వెస్ట్ చేశామన్నది ముఖ్యమైనది. చిట్ కట్టినా, బంగారం కొన్నా, భూమి కొనుగోలు చేసినా.. ఏదో ఓ ప్రయోజనమంటూ ఉండాలి. ఉన్నవాడు ఎన్నయినా చేయొచ్చు.. వేతన జీవులు, మధ్యతరగతి కుటుంబరావులు మాత్రం ఈ విషయంలో ఆచితూచి అడుగేయాల్సిందే!!
వేంకటేశ్వర్లు మంచి పొదుపరి. పైసల ముచ్చట్లు తనకన్నా బాగా తెలిసినవారు మరెవరూ లేరని అతగాడి నమ్మకం. ప్రతి రూపాయికి ఏడాది తిరిగేసరికి మరో రూపాయి పాపాయిగా పుట్టాలని చెబుతుంటాడు. అలా చేయగలిగితేనే ఈ రోజుల్లో బతకగలమని అతని ఫీలింగ్. అందుకోసం తనకొచ్చే వేతనంలో సింహభాగం ఇన్వెస్ట్ చేస్తుంటాడు. లెక్కకు మించి చీటీలు కడుతుంటాడు. చీటీలు ఎత్తి సరసమైన మిత్తీకి తిప్పడం అతగాడి మరో అలవాటు. ఆఫీసులో అందరూ వడ్డీకాసులు అని పిలుస్తుంటే.. గర్వంగా ఫీలవుతుంటాడు.
రోజులు దొర్లుతున్నాయ్. వేంకటేశ్వర్లు ఖజానా నిండుతున్నది. వచ్చిన వడ్డీ పైసలు మళ్లీ రొటేషన్‌లో పెడుతూ కాలర్ ఎగరేస్తుండేవాడు. వన్ ఫైన్ డే.. అతగాడు చీటీలు వేసే బాలమణి బిచాణా ఎత్తేసింది. అప్పటికే.. ఆమె దగ్గర పది నెలలుగా రెండు పది లక్షల చిట్స్ వేస్తున్నాడు. నికరంగా ఐదు లక్షలు ఎగిరిపోయాయి. ఆ వార్త తెలియగానే వేంకటేశ్వర్లు గుండె ఆగినంత పనైంది. ఆ కంగారులోనే తన దగ్గర అప్పు తీసుకున్న వారికి ఫోన్లు చేశాడు. ఫలానా అవసరం ఉంది.. వీలైనంత త్వరగా తీసుకున్న అప్పు చెల్లించాల్సిందిగా అడిగాడు. ఒక్కరి దగ్గరినుంచి కూడా సరైన సమాధానం రాలేదు. ఒకరిద్దరు ‘వడ్డీ చెల్లిస్తున్నాంగా’ అని స్వరం పెంచారు. మరొకరు ‘ఇలా ఉన్నఫళంగా అడిగితే ఎలా..?’ అని నిలదీసినంత పనిచేశారు. గొంతు తగ్గించి.. ఒకరిని బతిమాలాడు. మరొకరిపై గద్దించాడు. చీటీల బాలామణి చేసిన గాయంపై అప్పులు పొందినవాళ్లు తలా ఇంత ఉప్పూకారం చల్లారు. అప్పటికి గానీ వేంకటేశ్వర్లుకు తత్వం బోధపడింది కాదు.
నిన్నటి తరం వేంకటేశ్వర్లు కథ కాసేపు పక్కన పెట్టండి. ఈ తరం ప్రతినిధి అని చెప్పుకొనే వికాస్‌ది మరో తరహా! సాఫ్ట్వేర్ ఉద్యోగి. మంచి జీతం. విచ్చలవిడిగా ఖర్చు చేసే మనిషి కాదు. కానీ, పదిహేనేండ్లు ఉద్యోగం చేసి హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయాలనుకునే బాపతు. అందుకోసం.. పొదుపు, మదుపు మంత్రాలు ఉపదేశం తీసుకున్నాడు. ఇష్టాలకు, వెచ్చాలకు పోను మిగిలిందంతా షేర్ మార్కెట్లో కుమ్మరించాడు. అక్కడైనా తెలివిగా అడుగు వేశాడా అంటే.. అదీ లేదు! స్మాల్, మిడ్, లార్జ్ క్యాప్ ఇలా రకరకాల ఆప్షన్స్ ఉన్నా కూడా.. ఒక్కదాన్నే పట్టుకున్నాడు. ఉన్నదంతా అక్కడే పెడుతూ వచ్చాడు. పదేండ్లు గడిచాయి. తన పెట్టుబడి ఘనమైన రిటర్న్స్ ఊరించసాగింది. మరింత ఇన్వెస్ట్ చేయాలనుకున్నాడు. మార్కెట్ ఒడుదొడుకుల్లోనూ నిలబడిన సదరు కంపెనీలో ఏదో ఫ్రాడ్ జరిగింది. కంపెనీ ఒక్కసారిగా పేకమేడలా కూలిపోయింది. వికాస్ పెట్టుబడంతా కరిగిపోయింది. ఏండ్ల శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరైంది.
వ్యాపార రంగంలో ఉన్నవాళ్లు విజయం సాధించే దాకా ఒకే మార్గంలో వెళ్లడం అవసరం. కానీ, పెట్టుబడికి ఎన్నో దారులు. ఒక్కదాన్నే పట్టుకుంటానంటే కుదరదు. మల్టిపుల్ ఆప్షన్స్ ఎంచుకోవాలి. తక్కువ కాలం ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఈక్విటీ షేర్ల జోలికి వెళ్లకపోవడం మంచి. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని కాంక్షించినప్పుడే వాటిని ఎంచుకోవాలి. అదే సమయంలో ఉన్నదంతా ఒకే కంపెనీ షేర్లపై పెట్టొద్దు.
పైన పేర్కొన్న వేంకటేశ్వర్లు వ్యక్తులను నమ్మి మోసపోయాడు. వికాస్.. వ్యవస్థను నమ్ముకున్నా.. పద్ధతి లేకుండా ఉన్నదంతా ఒకేచోట కుమ్మరించి నష్టపోయాడు. వ్యాపార రంగంలో ఉన్నవాళ్లు విజయం సాధించే దాకా ఒకే మార్గంలో వెళ్లడం అవసరం. కానీ, పెట్టుబడికి ఎన్నో దారులు. ఒక్కదాన్నే పట్టుకుంటానంటే కుదరదు. మల్టిపుల్ ఆప్షన్స్ ఎంచుకోవాలి. తక్కువ కాలం ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఈక్విటీ షేర్ల జోలికి వెళ్లకపోవడం మంచి. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని కాంక్షించినప్పుడే వాటిని ఎంచుకోవాలి. అదే సమయంలో ఉన్నదంతా ఒకే కంపెనీ షేర్లపై పెట్టొద్దు. గతాన్ని తెలుసుకొని, భవిష్యత్తును అంచనా వేసి.. ఇన్వెస్ట్ చేయాలి. పెట్టుబడి కోసం పక్కకు పెట్టిన ప్రతి రూపాయిని మూడు విధాలుగా ఇన్వెస్ట్ చేయాలి. ఒక భాగం లిక్విడ్ అసెట్స్ రూపంలో. ఒక భాగం స్థిరాస్తి కోసం, మూడో భాగం ఎమర్జెన్సీ ఫండ్‌గా వికేంద్రీకరించుకోవాలి . లిక్విడ్ అసెట్స్‌లో బంగారం, మ్యూచువల్ఫండ్స్, ఎఫ్డీలు ఇతరత్రా వస్తాయి. ఎమర్జెన్సీ ఫండ్ కూడా లిక్విడ్ అసెట్ రూపంలోనే ఉండాలి. ఎన్ని చేసినా ప్రతి పెట్టుబడికీ పర్పస్ ఉండాలి. ఏది ఎప్పుడు చేతికి అందాలో ముందుగానే నిర్ణయించుకొని… అప్పటి అవసరానికి తగ్గట్టుగా ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలి.