ప్రకృతి సాహిత్యం, భక్తి సాహిత్యం, బాలసాహిత్యం, విప్లవ సాహిత్యం ఇలా ఎన్నో పరిమళాలు ఉన్నాయి సాహిత్యంలో. వాటన్నిటినీ ఆస్వాదించిన రచయిత తనదైన శైలిలో విశ్లేషణలు, సమీక్షలు ఈ పుస్తకంలో పొందుపరిచారు. అంతేకాకుండా అలాంటి సాహిత్యానికి మూలపురుషులైన వ్యక్తుల జీవితాలను క్లుప్తంగా, అర్థవంతంగా వివరించే ప్రయత్నం చేశారు.
పుస్తకం చదివినంత మాత్రన పూర్ణత్వం సిద్ధించదు, హృదయంతో ఆలోచించాలి. అదే హృదయంతో సమీక్షించాలి. అలాంటి కోవకు చెందినవాడే రచయిత వేదాద్రి కూడా! ఆత్మీయ అనుబంధాలతో తెలంగాణ మాండలిక భాషా గంధంతో మనసును తట్టిలేపిన కవిత్వం ‘చింతల తొవ్వ’. నేలతల్లి పురిటి నొప్పులను మొదలుకొని కన్నతల్లి కన్నీటి గాథ వరకు విశ్లేషించిన ఈ కవిత్వంపై వేదాద్రి చేసిన సమీక్ష ముదావహం. గద్దర్ పాటలను, శ్రీశ్రీ కవితలను, అందెశ్రీ గీతాలను, వంగపండు గేయాలను ఇలా గత గర్తులన్నీ తన సమీక్షల రూపంలో మన ముందుకు తెచ్చాడు.
ఒక మనిషి మన ఎదురుగా ఉన్నప్పుడు వాళ్ల ముఖాన్ని చూసి మనసులోని భావాలను కనిపెట్టే ఫేస్రీడింగ్ లాగా.. మనిషి రాసిన సాహిత్యాన్ని చదివి ఆ రచయిత స్వభావాన్ని అంచనా వేయడంలో ఈ సమీక్షకుడు విజయం సాధించాడు. తెలుగు సాహిత్యంలో కొత్త ఆలోచన, సరికొత్త చైతన్యం జాగృతమవడానికి ఈ పుస్తకం ఒక సోర్సులా పనిచేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
రచయిత: డాక్టర్ పూసపాటి వేదాద్రి
పేజీలు: 192, ధర:రూ.200
ప్రతులకు: 99121 97694
-రాజు