Influencer Marketing | 1992. చందన్‌కు అప్పుడు ఐదేండ్లు. వాళ్ల నాన్నను టీవీ కొనమని అడిగాడు. గొడవపడ్డాడు. ఆ పోరు తట్టుకోలేక షోరూమ్‌కు బయల్దేరింది ఆ కుటుంబం. టీవీ చిన్నదా పెద్దదా, కలరా బ్లాక్ అండ్ వైటా, ఒనిడానా మరో కంపెనీయా… ఇవే ఎంపికలు వాళ్ల మనసులో ఉన్నాయి. ఓ అరగంటలో ఎంపిక పూర్తయిపోయింది.
2022. చందన్కి ఇప్పుడు ముప్పై ఐదేండ్లు. కొత్త ఇంటికోసం ఓ టీవీ కొందామనుకున్నాడు. చుట్టూ పదుల కొద్దీ షోరూమ్‌లు పలకరించాయి. ఎందులోకి వెళ్లాలన్నదే పెద్ద సవాలుగా మారింది. తీరా షోరూమ్‌లో అడుగుపెట్టాక అదో పద్మవ్యూహంలా కనిపించింది. రకరకాల కొలతలు! స్మార్ట్, 4కె, 8కె, కర్వ్డ్… అంటూ రకరకాల సాంకేతికతలు. ఒకదాని టీవీ అద్దం పగలదట, ఒక టీవీలో రంగులు ఎక్కువట. ఎంపిక చేసుకోవడానికి మనసులో పెద్ద యుద్ధమే జరిగింది.
మూడు దశాబ్దాల్లో వచ్చిన మార్పు ఇది. ప్రపంచీకరణ పుణ్యమాని రకరకాల ఉత్పత్తులు అందుబాటులోకి వస్తున్నాయి, ఆర్థిక వనరులకు కొదవే లేదు. కొందామని అనుకునే ప్రతి వస్తువులోనూ వేలకొద్దీ ఆప్షన్లు. కొనే ఆలోచనే లేకపోయినా కొనమంటూ ఊరించే అనేకానేక వస్తువులు. మారిన పరిస్థితులకు అనుగుణంగా మార్కెటింగ్ తీరు కూడా మారాల్సిందే. ఒకప్పటిలా చిన్న ప్రకటనతో సరిపెట్టుకుంటే కుదరదు. ఉత్పత్తి బాగుంటే వాళ్లే వస్తారులే అన్న ధీమా పనికిరాదు. ఎన్ని రకాలుగా కుదిరితే… అన్ని రకాలుగా వినియోగదారుల దృష్టిలో పడాలి. ఎలా వీలైతే అలా వాళ్ల మనసులు గెలుచుకోవాలి. అందుకే ఓ తిరుగులేని అస్త్రాన్ని తయారుచేసుకున్నారు. అదే ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్!
ఆధునిక జీవితం రోజురోజుకూ వేగం పుంజుకుంటున్నది. ఆ హడావుడిలో ఒకరినొకరు చూసుకునే, మాట్లాడుకునే వెసులుబాటు తగ్గిపోతున్నది. కానీ భౌతిక దూరం ఎంతగా పెరుగుతున్నదో… సామాజిక మాధ్యమాల ద్వారా తన ఉనికిని పెంచుకోవాలనే తాపత్రయం అంతలా ఎక్కువ అవుతున్నది. సోషల్ మీడియాలో మిత్రుల సంఖ్యను పెంచుకుంటూ, తమకు నచ్చినవారిని అనుసరిస్తూ ఆన్లైన్ బంధాలను దృఢపర్చుకునే యత్నం సాగుతున్నది. ఈ కొత్తలోకమే వాణిజ్య ప్రపంచానికి వరంగా మారింది. అక్కడ కాస్త ప్రభావం (ఇన్ఫ్లుయెన్స్) ఉన్నవారిని మచ్చిక చేసుకుని వారి ద్వారా తమ ఉత్పత్తులను ప్రచారం చేసుకుంటున్నారు. అలాగని ఇదేమీ సులభమైన వ్యవహారం కాదు. అంచనా తప్పితే, వ్యూహం బెడిసికొట్టడం తథ్యం. అందుకే ఇప్పుడు సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఓ శాస్త్రంగా మారింది. దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తే… అది ఏమేరకు మన మీద ప్రభావం చూపిస్తున్నదో గమనించుకోవచ్చు. అవసరమైతే మనం కూడా ఆ రంగంలోకి ధైర్యంగా అడుగుపెట్టనూ వచ్చు!
మనిషి కేవలం తన పరిచయస్తుల వల్లే కాదు… అపరిచితులను చూసి కూడా ప్రభావితుడు అవుతాడనే ఆలోచన 19వ శతాబ్దంలోనే వచ్చింది నార్మన్ ట్రిప్లెట్ అనే శాస్త్రవేత్తకు. సరదాగా చేపల వేటకు వెళ్లినవాళ్లు, తమ పక్కన ఎవరైనా ఉంటే ఇంకా హడావుడి చేస్తారని కనిపెట్టారు. ఈ రంగంలో దీన్నే తొలి పరిశోధనగా చెబుతారు. తన చుట్టూ ఉండేవారి ప్రభావం ఓ వ్యక్తి మీద ఎలా పడుతుందో విశ్లేషిస్తూ ‘సోషల్ ఇన్ఫ్లుయెన్స్’ అనే సిద్ధాంతాన్ని రూపొందించారు కెల్మన్ అనే సైకాలజిస్ట్. ఎదుటివారి అభిప్రాయాలను.. అంగీకరించడం, ప్రభావితం కావడం, అనుసరించడం అనే మూడు పద్ధతుల ద్వారా సోషల్ ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తుందని విడమరిచారు. ఇక 21వ శతాబ్దంలో సోషల్ ఇన్ఫ్లుయెన్స్ విశ్వరూపం దాల్చింది. సామాజిక మాధ్యమాల్లో కాస్త ప్రభావం ఉన్నవారిని గుర్తించి వారి ద్వారా తమ ఉత్పత్తులను ప్రచారం చేసుకునే ప్రయత్నం మొదలైంది. 2016తో పోలిస్తే.. ‘ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్’ అనే పదం గురించి వెతుకులాట 465 శాతం పెరిగిందట. ఒక దశలో ఈ వృద్ధి 1,500% గానూ కనిపించింది. గత ఐదేళ్లలోనే 1,300కు పైగా
ఏజెన్సీలు ఈ రంగంలో సేవలు అందించేందుకు ప్రవేశించాయి. ఇలాంటి గణాంకాలు చూస్తే… సోషల్ ఇన్ఫ్లుయెన్స్ ఎదుగుదల ఏ మేరకు ఉందో అర్థమవుతుంది!
ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియాలో వేలమంది అనుచరులు ఉన్నంత మాత్రాన వాళ్లను ఇన్ఫ్లుయెన్సర్లుగా భావించడానికి వీల్లేదు. ఆ వ్యక్తి ఏదో ఒక రంగంలో నిపుణుడై ఉండాలి. వారి మాటకు విలువ ఉంటుందనే అభిప్రాయం కలగాలి. ఉదాహరణకు ఒక వ్యక్తికి సాంకేతిక నిపుణుడిగా పేరుందని అనుకుందాం. తరచూ తన పోస్టులలో సాంకేతికతలో వస్తున్న కొత్త మార్పుల గురించి చెబుతూ, ఆ రంగం గురించి చర్చిస్తూ ఉంటే… సహజంగానే అతని మాటకు విలువ పెరుగుతుంది. ఆ ప్రభావాన్ని సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి కంపెనీలు. మధ్యమధ్యలో తమ ఉత్పత్తుల గురించి కూడా చెప్పమంటూ ఒప్పందం చేసుకుంటున్నాయి. ఏళ్ల తరబడి తన కష్టం, నమ్మకాలతో ఏర్పరుచుకున్న ఆన్లైన్ పరపతికి తగిన మూల్యం అది. ఇక సెలబ్రిటీలది మరో తరహా ప్రభావం. వాళ్ల జీవనవిధానం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. జుట్టు ముడి దగ్గరినుంచి కాలి చెప్పుల వరకూ ఆ వేషభాషలు అనుసరించాలనే తాపత్రయం అభిమానులకు ఉంటుంది. ఆ భ్రమలో సెలబ్స్ ఆడమన్నట్టు ఆడతారు. పాడమన్నట్టు పాడతారు. కొనమన్నవన్నీ కొనేస్తారు. కాబట్టి సినీతారల, క్రికెట్ వీరుల సామాజిక మాధ్యమాల్లో ఏవైనా ఉత్పత్తుల గురించి ప్రచారం చేయిస్తే మంచి ప్రభావమే ఉంటుంది. అమ్మకాలు పెరుగుతాయి. ఆ వస్తువుకు ఓ బ్రాండ్ విలువ వస్తుంది. ఇక నిపుణులు, సెలబ్రిటీలు కాకుండా మరో తరహా ఇన్ఫ్లుయెన్సర్స్ కనిపిస్తారు. టిక్ టాక్ లాంటి మాధ్యమాల ద్వారా అప్పటికప్పుడు పేరు సాధించి, అసాధారణమైన అనుచరగణాన్ని పెంచుకునేవాళ్లంతా ఈ వర్గంలోకి వస్తారు.
ఇన్ఫ్లుయెన్సర్లను గుర్తించడం అంత తేలిక కాదు. సామాజిక మాధ్యమంలో తన నైపుణ్యం ద్వారా, ఆకర్షణ శక్తి వల్ల అనుచరుల నిర్ణయాలను ప్రభావితం చేయగలగాలి. ఏ రంగంలో ఏ మేరకు అతని ప్రభావం ఉంటుందో కచ్చితంగా అంచనా వేయగలగాలి. ఆ అయస్కాంతత్వం ఆధారంగానే చెల్లింపు ఉంటుంది. ఇన్‌స్టాలో అయితే అనుచరుల సంఖ్య ఆధారంగా వారిని.. నానో, మైక్రో, మేక్రో, మిడ్-టయర్, మెగా అంటూ విభజిస్తారు. అంతేకాదు! తను సోషల్ మీడియాలో ఎంత క్రియాశీలంగా, ఎంత సానుకూలంగా ఉంటున్నాడు అనే విషయాలను కూడా గమనిస్తారు. సదరు వ్యక్తి ఏదైనా ఉత్పత్తిని సూచించినప్పుడు.. ఆన్లైన్ పౌరుల స్పందన ఎలా ఉంటున్నది, తను ఎన్ని ఉత్పత్తులను సూచిస్తున్నాడు లాంటి అంశాలు పరిగణిస్తారు. తమ ఉత్పత్తిని పోస్ట్ చేసి గమ్మున ఉంటున్నాడా, దాని గురించి నాలుగు మాటలేమైనా రాస్తున్నాడా, చిన్నపాటి వీడియో కూడా చేస్తున్నాడా.. అన్న కోణంలో ఆలోచించి కూడా ధరను నిర్ణయిస్తారు. సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ల ఎంపికలో ఏమాత్రం అశ్రద్ధ జరిగినా లాభం కంటే నష్టమే ఎక్కువ. సెలబ్రిటీ ఏదైనా బ్రాండ్‌ను సిఫారసు చేస్తున్నప్పుడు అదో వాణిజ్య ప్రకటనలా అనిపించకూడదు. సొంత అభిప్రాయంలా కనిపించాలన్నది… సోషల్ మార్కెటింగ్‌లో ముఖ్యమైన సూత్రం!
‘ఫలానా వస్తువు బాగుంది’ అని నోటి ప్రచారంగా (వర్డ్ ఆఫ్ మౌత్) చెప్పుకొనే రోజులు పోయాయి. ఇప్పుడు, ఎలక్ట్రానిక్ వర్డ్ ఆఫ్ మౌత్ (eWOM)దే రాజ్యం. సామాజిక మాధ్యమాల్లో కనిపించే చాలా పోస్టులను మనం విశ్వసిస్తాం. అవన్నీ మన ఆలోచనలకు ఓ రూపం ఇస్తున్నాయి. ఆ విశ్వసనీయతను సొమ్ము చేసుకునేందుకు మార్కెట్ శక్తులు రూపొందించిన వ్యవస్థే.. సోషల్ ఇన్ఫ్లుయెన్సర్లు. కాస్త గమనిస్తే… ఏదో ఒక ఉత్పత్తిని చేత పట్టుకుని కనిపించడానికో, దాని గురించి నాలుగు మాటలు రాయడానికో వాళ్లు పరిమితం కారు. తమ అనుచరులకు ఓ వస్తువును పరిచయం చేయడానికి చాలా మార్గాలే ఎంచుకుంటారు. ఒక వస్తువు గురించి చెబుతూ.. దాన్ని కొనుగోలు చేసేందుకు లింక్స్, కూపన్స్ ఇస్తారు. సరికొత్త ఉత్పత్తులను పరిచయం చేస్తూ వాటి మీద తమ అభిప్రాయం చెబుతారు. లోతుగా సమీక్షిస్తారు. సొంతంగా ఉత్పత్తులను ప్రారంభించి వాటికి ప్రచారం కల్పిస్తారు. తామూ వాడుతున్నట్టు కనిపిస్తారు. వాటి గురించి తాజా సమాచారం ఇస్తారు… ఇలా చాలా రకాలుగా ఉత్పత్తులకు, మనకు వారధిగా నిలుస్తారు. అందుకే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అన్నీ కూడా ఈ తరహా ‘పెయిడ్ ప్రమోషన్’ గురించి ముందుగానే హెచ్చరిస్తాయి. అందులో వాణిజ్య కోణం ఉందన్న విషయాన్ని కూడా వీక్షకులకు గుర్తుచేస్తాయి.
కొవిడ్ వల్ల దేశంలో అన్ని వ్యాపారాలూ నష్టాల బారినపడితే… ఓ సంస్థ మాత్రం 50 రెట్ల వృద్ధిని సాధించింది. అదే బార్కోడ్ సంస్థ. కొన్నాళ్ల క్రితమే స్థాపించిన ఈ సంస్థ దేశవ్యాప్తంగా ఉన్న 10 లక్షలకు పైగా ఇన్ఫ్లుయెన్సర్లను గుర్తించగలిగింది. వారిని వ్యాపారసంస్థలతో అనుసంధానం చేస్తూ ఏకంగా రెండున్నర కోట్ల మంది అనుచరులను ప్రభావితం చేయగలుగుతున్నది. ఈ పనికోసం ఏకంగా 150 మంది మార్కెటింగ్ నిపుణులను భర్తీ చేసుకుంది బార్కోడ్. ‘ఈ రోజుల్లో ఏ వ్యాపార సంస్థా గాలివాటు లాభాల మీద ఆధారపడటం లేదు. వాళ్లకు కచ్చితమైన ఆధారాలు కావాలి. సామాజిక ప్రభావశీలుర ద్వారా సానుకూల ఫలితాలు సాధ్యమే’ అంటారు ఈ సంస్థ వ్యవస్థాపకులు రాహుల్ ఖన్నా.
క్రీడలు, సినిమాల్లాంటి రంగాల్లో ప్రముఖులకు ఇప్పుడు సామాజిక మాధ్యమాలు కామధేనువులా మారాయి. ఓ మోస్తరు సెలబ్రిటీ స్థాయి సాధించి, సోషల్ మీడియాలో ఉనికిని చాటుకోగలిగితే చాలు! లక్షల ఆదాయం సొంతమవుతుంది. ఒక్క ఇన్‌స్టా పోస్టు కోసం విరాట్ కోహ్లి ఏకంగా అయిదు కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నాడు. ప్రియాంక చోప్రా మూడు కోట్లు… షారుఖ్ ఖాన్, అలియా భట్ చెరో కోటి అందుకుంటున్నారు. ఇక అంతర్జాతీయ స్టార్ల సంగతి చెప్పేదేముంది? హోపర్ ఇన్స్టాగ్రామ్ రిచ్‌లిస్ట్ ప్రకారం రొనాల్డో (ఫుట్‌బాల్ ఆటగాడు), డ్వేన్ జాన్సన్ (ద స్కార్పియన్ కింగ్ నటుడు), అరియానా గ్రాండ్ (పాప్ సింగర్), కైల్ జెన్నర్ (అమెరికన్ మోడల్)… ఒక్కో పోస్టుకు పది కోట్ల రూపాయలకు పైనే తీసుకుంటున్నారు. మన టాలీవుడ్ తారలు మహేష్‌బాబు, సమంత ఇన్‌స్టా పోస్టులు చూసినా… వాటిలో ప్రకటనల జోరు కనిపిస్తుంది.
తాము చేపట్టే సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడానికి ప్రభుత్వాలు కూడా ప్రకటనలు ఇస్తుంటాయని మనకు తెలుసు. ఇందుకోసం సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ల సేవలను కూడా వినియోగించుకుంటాయి. ఉదాహరణకు ఈజిప్టు సమాచార శాఖ ఈమధ్య 20 మంది ఇన్ఫ్లుయెన్సర్లను గుర్తించి వాళ్ల ద్వారా దేశంపట్ల సానుకూల భావన పెంచే ప్రయత్నం చేస్తున్నది. మానవహక్కులు, పత్రికా స్వేచ్ఛ విషయంలో ఈజిప్టుకు ఉన్న చెడ్డపేరును తుడిచేయడానికి ఇలా చేస్తున్నట్టు విశ్లేషణ. సౌదీ అరేబియా కూడా ఆమధ్య జరిగిన ఓ అనూహ్యమైన హత్య తర్వాత, పర్యాటకుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు ఇన్స్టాగ్రామ్ ప్రభావశీలురను ఉపయోగించుకున్నది. కానీ ఈ తీరుమీద ఎన్నో భయాందోళనలు ఉన్నాయి. సెలబ్రిటీల ఆకర్షణను ఉపయోగించి వాస్తవాలను కప్పిపెట్టే ప్రమాదం ఉందని, అధికారంలో ఉన్నవారు ఇన్ఫ్లుయెన్సర్లను భయపెడుతున్నారనీ ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీలు సామాజిక మాధ్యమాలను తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నాయి. సోషల్ మీడియా ద్వారా ఏకంగా అగ్రరాజ్యపు ఎన్నికలనే ప్రభావితం చేశారన్న వార్తలు వినిపించాయి. ఇలాంటి నేపథ్యంలో ఇన్ఫ్లుయెన్సర్లను రాజకీయాలకు వాడుకోవడం అంత ఆహ్వానించదగ్గ పరిణామం కాదు.
భువన్ విజయం
సోషల్ మీడియో ఓ వ్యక్తిని ఎంత ఎత్తుకు తీసుకెళ్లగలదో చెప్పేందుకు భువన్ బామ్ ఎదుగుదలే సాక్ష్యం. ఆరేండ్ల క్రితం ‘బిబి కీ వైన్స్’ పేరుతో ఓ యూట్యూబ్ చానల్ మొదలుపెట్టాడు. రకరకాల పాత్రలు తనే పోషిస్తూ… మధ్యతరగతి కథల కబుర్లు మొదలుపెట్టాడు. ఇప్పుడా చానల్‌కు రెండున్నర కోట్ల మంది సబ్‌స్ర్కైబర్లు. తన ఇన్‌స్టాకు 1.4 కోట్ల అనుచరులు. ఫోర్బ్స్ జాబితాలోకి సైతం చేరిన ఈ 28 ఏండ్ల కుర్రాడు, ప్రకటనలతో లక్షలు సంపాదిస్తున్నాడు.
సంజీవనం
‘ఖానా ఖజానా’ పేరు వినని వాళ్లు ఉండరు. ఆసియాలోనే అత్యంత ప్రజాదరణ పొందిన వంటల కార్యక్రమంగా పేరు తెచ్చుకున్నది. అందులో తన చేతి మహిమను రుచి చూపించిన సంజీవ్ కపూర్… ఏకంగా వంటల కోసం ‘ఫుడ్ ఫుడ్’ అనే చానల్ మొదలుపెట్టారు. ఇక తన యూట్యూబ్, ఇన్‌స్టా ద్వారా కూడా లక్షల మంది అనుచరులను సంపాదించుకున్నారు.
అందమైన అభిప్రాయాలు
ఆష్నా ఫ్రాఫ్ ఎవరో మీకు తెలియకపోవచ్చు. ఆమె గురించి వికీపీడియాలోనూ వివరాలు ఉండవు. కానీ ఆమె ఆస్తుల విలువ రూ. 37 కోట్లు అని అంచనా. ఇంతకీ ఆష్నా ప్రత్యేకత ఏమిటి?.. దుస్తులు, మేకప్, ప్రయాణాల గురించి తన అభిప్రాయాలను చెబుతూ ఓ బ్లాగ్ మొదలుపెట్టడం! అది కాస్తా యూట్యూబ్‌గా, తర్వాత ఇన్స్టాగా మారింది. అంతర్జాతీయ ఉత్పత్తులను ప్రచారం చేసే స్థాయికి చేరుకుంది.
పెద్ద వెలుగుల చిన్నతార
జన్నత్ జుబేర్ రహ్మానీ.. సినిమాలు, టీవీ సీరియల్స్‌లో చిన్నాచితకా పాత్రలతో నెట్టుకొచ్చేది. కానీ ఇన్‌స్టాలో మాత్రం ఓ ధ్రువతార. దాదాపు నాలుగు కోట్ల మంది అనుచరులతో అత్యధిక ప్రజాదరణ కలిగిన ఇన్ఫ్లుయెన్సర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. ఫ్లిప్‌కార్ట్, పేటీఎమ్ సహా ఇరవైకి పైగా సంస్థల ఉత్పత్తులకు ప్రచారం చేసి కోట్లు గడించినట్టు వినికిడి.
టీనేజ్ స్టార్
ఝాన్సీ కీ రాణీలో చిన్ననాటి లక్ష్మీబాయిగా నటించింది అనుష్క సేన్. ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. అలాగని వాటి కోసం ఎదురుచూడలేదు కూడా. తన ఇన్‌స్టా ఖాతాలో నటన, ష్యాషన్, ప్రయాణాల గురించి చెబుతూ మూడుకోట్ల మంది అభిమానులను కూడబెట్టుకుంది. ఒక చిన్న ఫొటోకు కూడా పదేసి లక్షల లైక్స్ సంపాదించడంతో, ఆమె అభిమానులకు ఎర వేసేందుకు చాలా కంపెనీలు ముందుకు వస్తున్నాయి.
పంజాబీ పాప్
గురు రంధావా అనే కుర్రాడు దిల్లీలో ఎంబీఏ చదువుకుంటున్నప్పుడు చిన్నపాటి సంగీత ప్రదర్శనలు ఇచ్చేవాడు. తర్వాత స్నేహితుల సూచనతో మ్యూజిక్ ఆల్బమ్స్ చేశాడు కానీ, అవేవీ అంతగా ఆదరణ పొందలేదు. కానీ ఓ కొత్తస్వరాన్ని లోకానికి పరిచయం చేద్దామనే ప్రయత్నంలో టీ- సిరీస్ అతనికి అవకాశం ఇవ్వడంతో దశ తిరిగింది. పంజాబీ, భాంగ్రా సంప్రదాయాలకు తనదైన ఆకర్షణ జోడించి సంగీతకారుడిగా పేరు తెచ్చుకున్నాడు. పనిలోపనిగా ఇన్‌స్టాలో మూడు కోట్ల మంది అభిమానులనూ చేర్చుకున్నాడు.
నిజానికి ఈ జాబితా అనంతం. తమ చొరవతో, చిట్కాలతో ఇన్‌స్టా లాంటి సామాజిక మాధ్యమాలను ఓ రాజ్యంగా మార్చుకున్న మహారాజులు ఎంతోమంది కనిపిస్తారు. అభిమానంతో పాటు, ఆదాయాన్నీ అందుకునే మార్గం చూపిస్తారు.
‘లోకోభిన్నరుచిః’ అంటారు. అభిరుచులూ అంతే. ఒక్కోసారి వాటిని జీవనోపాధిగా మలుచుకుంటే బాగుండు అనిపించేంత అనురక్తి ఉంటుంది. అసాధ్యంగా తోచే ఆ అవకాశాన్ని సుగమం చేస్తుంది సోషల్ ఇన్ఫ్లుయెన్సింగ్. దిల్లీకి చెందిన శివేశ్ భాటియానే తీసుకోండి. తనకు కోడిగుడ్లు లేకుండా బేక్ చేయడం అంటే ఇష్టం. ఆ రంగంలో ప్రయోగాలు చేస్తూ వీడియోలు రూపొందించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు శివేశ్కు ఇన్‌స్టాలో ఏడులక్షల మంది వరకూ అభిమానులు ఉన్నారు. క్యాడ్బరీస్ వంటి సంస్థలు సైతం తమ ఉత్పత్తులను శివేశ్ అభిమానులకు చేరవేసేందుకు సిద్ధమయ్యాయి. అజయ్ నాగర్ అనే ఫరీదాబాద్ కుర్రాడు గేమింగ్ మీద తనకు ఉన్న పట్టుతో 1.4 కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నాడు. వాళ్లకు రకరకాల ఉత్పత్తులను పరిచయం చేస్తూ, పనిలోపనిగా ఆ ఉత్పత్తిదారుల నుంచి తనూ సొమ్ము చేసుకుంటున్నాడు. మరో సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ గౌరవ్ తనేజా, కేవలం శరీర దారుఢ్యం గురించి వీడియోలు రూపొందిస్తూ ముప్పై లక్షల మంది ఇన్‌స్టా అనుచరులను సంపాదించుకున్నాడు. ఒకప్పుడు ఇలాంటి వైవిధ్య రంగాల ద్వారా సంపాదన ఓ కలగా ఉండేది. కానీ సామాజిక మాధ్యమాలు ప్రతి కలనీ ఓ కళగా మార్చేసి కనకరాశులు కురిపిస్తున్నాయి.
సామాజిక మాధ్యమాల్లో ఒక ప్రకటన నేరుగా ఇవ్వాలంటే చాలా ఖర్చవుతుంది. పైగా యాడ్ బ్లాకర్ వ్యవస్థ వల్ల అవి అందరికీ చేరవు. కానీ ఇక్కడ మాత్రం, అభిమానులు ఏరికోరి ఎదురుచూస్తారు. ఓ నివేదిక ప్రకారం 90 శాతం మంది వినియోగదారులు సోషల్ మార్కెటింగ్ తమ మీద సానుకూల ప్రభావం చూపిందని ఒప్పుకొన్నారు.
స్థానిక కంపెనీలైతే ప్రాంతీయ భాషల సెలబ్రిటీల సాయంతో మంచి ఫలితాలు సాధిస్తున్నాయి.
టీవీ ప్రకటనలు, భారీ హోర్డింగులతో పోలిస్తే ఇన్ఫ్లుయెన్సర్లకు చెల్లించే డబ్బు లాభసాటిగా ఉంటున్నదని ఓ అభిప్రాయం. ‘బెంచ్‌మార్క్’ సంస్థ నివేదిక ప్రకారం ఇన్ఫ్లుయెన్సర్ల మీద చెల్లించే ప్రతి రూపాయికి ఆరు రూపాయల విలువైన ప్రచారం లభిస్తున్నదట.
ఒకప్పుడు సబ్బుల దగ్గరినుంచి టీవీ వరకూ ఏ ఉత్పత్తికైనా సినీతారలే ప్రచారకర్తలు. ఇప్పుడలా కాదు. తన వస్తువు ఏమిటి? ఆ రంగంలో ఎవరు నిష్ణాతులు? అని ఎంచుకుని మరీ వారి ద్వారా ప్రచారం చేసుకొని, ‘టార్గెట్ కన్జ్యూమర్స్'(లక్ష్యిత వినియోగదారులు)ను చేరుకునే అవకాశం వచ్చింది.
ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్కి ఎంత చెల్లిస్తున్నాం. అతని అభిమానులు ఎలా స్పందిస్తున్నారు. ఎలాంటి సూచనలు చేస్తున్నారు… అన్నది కచ్చితంగా తేలిపోతుంది. ఫలితం కనిపిస్తే తనతో లావాదేవీ కొనసాగించవచ్చు. లేదా ఒకే ఒక్క పోస్టుతో ఆ బంధాన్ని ముగించేయవచ్చు!
కొన్నాళ్ల క్రితం మనకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అన్న పదం వినిపించినప్పుడు అది కేవలం ప్రముఖులకు మాత్రమే పరిమితమైన వ్యవహారమని అనుకున్నాం. సామాజిక మాధ్యమాలు ఎదుగుతున్న కొద్దీ ఈ వనరు కూడా అందరికీ అందుబాటులోకి వస్తున్నది. కొవిడ్ సమయంలో సామాజిక మాధ్యమాల వినియోగం రెట్టింపు కావడంతో… ఇన్ఫ్లుయెన్సర్ల గురించి వాడవాడలా తెలుస్తున్నది. ప్రస్తుతానికి మనదేశంలో సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెట్ విలువ రూ. 900 కోట్లని అంచనా. 2025 నాటికి అది రూ. 2,200 కోట్లకు చేరుకుంటుందని అనుకుంటున్నారు. మన అనుచరులకు ఒక ఉత్పత్తిని పరిచయం చేసి, డబ్బులు సంపాదించడం అనే మాట వినడానికి బాగానే ఉంది కానీ… అదేమంత తేలికైన పని కాదు. ప్రస్తుతానికైతే ఓ సెలబ్రిటీ ఏదైనా వస్తువును సిఫార్సు చేసినప్పుడు, ఆ బ్రాండ్ కంటే అతని అభిప్రాయానికే విలువ ఇస్తున్నారు. కానీ తమ అభిమానాన్ని వాళ్లు సొమ్ము చేసుకుంటున్నారేమో అన్న అనుమానం మొదలైతే మాత్రం… ఈ ‘ఇన్ఫ్లుయెన్స్’ బుడగ పేలిపోయే ప్రమాదం ఉంది.
“బ్లాక్ వాటర్ తాగుతున్న కోహ్లీ, మలైకా అరోరా.. అసలేంటి ఈ నీటి స్పెషాలిటీ..”
కొంపముంచిన సెలబ్రెటీల ట్వీట్లు.. ఒక్కో పోస్టుతో వేల కోట్ల రూపాయలు ఆవిరి !”
మన దగ్గర డ్రైవింగ్ సీటు కుడివైపు ఉంటే.. అమెరికాలో ఎడమ వైపు ఎందుకుంటుంది ? ఎందుకీ తేడా?
NFT | నాన్ ఫంగిబుల్ టోకెన్ అంటే ఏంటి? దీనికెందుకంత క్రేజ్? క్రిప్టోకరెన్సీకి, దీనికి తేడా ఏంటి?