శ్రీకృష్ణ భగవానుడి అత్యత ప్రీతికరమైన మురళి ఈ వెదురుతో తయారైనదే. మనుషులు అత్యధికంగా ఉపయోగించే కలపలో వెదురు ముఖ్యమైనది. గృహ నిర్మాణంలో వెదురును విరివిగా వినియోగిస్తుంటారు. వెదురు నుంచి తీసిన నారతో వస్ర్తాలను తయారు చేస్తారు. వెదురు గుజ్జు నుంచి కాగితం తయారు చేస్తారు. వెదురుతో అనేక రకాలైన గృహోపకరణాలను తయారు చేస్తున్నారు. కంచెలు కట్టడానికి, తడికెలు అల్లడానికి, బుట్టల తయారీకి వెదురును వాడుతుంటారు. అందుకే దీనిని ‘పేదల కలప’ అంటారు.
వెదురు నిటారుగా పెరిగే గడ్డి జాతి మొక్క. దాదాపు 90 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. వెదురు కాండం గట్టిగానూ, మధ్యలో బోలుగా ఉంటుంది. ఉష్ణ ప్రదేశాలలో వెదురు తొందరగా పెరుగుతుంది. అందువల్ల వెదురు వనాలు విస్తారంగా కనిపిస్తాయి. ఇవి వాతావరణ కాలుష్యాన్ని తగ్గిస్తాయి. నేలను సారవంతం చేస్తాయి. ఒక వెదురు చెట్టు రోజులో రెండు కార్లు విడుదల చేసే కార్బన్ డై ఆక్సైడ్‌ని గ్రహిస్తుందట. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వెదురు అడవుల్లో ఎనభై శాతం ఆసియా ఖండంలోనే ఉన్నాయి. అత్యధిక రకాలు పెరిగే చైనాను ‘వెదురు దేశం’ అంటారు. వెదురు వృద్ధి రేటు కూడా అధికమే. 36 గంటల్లోనే సుమారు రెండు అంగుళాలు పెరుగుతూ కేవలం మూడు నెలల్లో 60 అడుగుల వరకు ఎదుగుతుంది. అందుకే వెదురు చెట్టు కింద సేద తీరొద్దని పెద్దలు అంటారు. మన దేశంలో 23 రకాల దేశీ వెదురు, 136 రకాల విదేశీ వెదురు పెరుగుతున్నది.
చిన్న వెదురు మొక్కలైన ‘లక్కీ బ్యాంబూ’ మొక్కలను ఇంటి అలంకరణ కోసం పెంచుకుంటారు. వెదురు లాభసాటి వాణిజ్య పంట. ఒకప్పుడు వెదురుని అటవీ జాతి మొక్కగా పరిగణించేవారు. వీటిని సాగు చేయాలంటే ప్రభుత్వ అనుమతి అవసరం ఉండేది. దానిని అటవీ మొక్కల జాబితా నుంచి తొలగించి గడ్డి జాతి మొక్కల జాబితాలో చేర్చారు. ఇప్పుడు వెదురు సాగుకు ఎలాంటి అనుమతులూ అవసరం లేదు. తక్కువ సమయంలో మంచి దిగుబడి వస్తుంది. ప్రజల జీవనోపాధికి ఉపయోగపడుతుంది. ఏపుగా పెరిగిన వెదురుని కోసిన తర్వాత మరో పంట వస్తుంది. వెదురు వేళ్ల నుంచి మొలకలు భూమిని చీల్చుకుని కత్తుల్లా పొడుచుకొస్తాయి. ఒకసారి నాటితే యాభై ఏళ్లపాటు పంట తీసుకోవచ్చు. యాభై ఏళ్లకు వెదురు పూలు పూస్తుంది. అప్పటి నుంచి కొత్త మొక్కలు పుట్టవు. వెదురుని పురుగు ఆశించదు. ఎటువంటి నేలలోనైనా పెరుగుతుంది.
-ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, పీవీ కూతురు