యజమాని పుట్టిన తేది, నక్షత్రం, జన్మ స్థలం తదితర వివరాలతో ముహూర్తం నిర్ణయిస్తారు. ఆ నివాసంలోకి ఏ శుభ సమయాన ప్రవేశించాలనేది శాస్త్రం చెబుతుంది. ఆ అనుకూల సమయం ఎంతో గొప్ప ఫలితాన్ని, ఆనందకరమైన వృద్ధిని అందిస్తుంది. ఈ నియమాన్ని తప్పక పాటించాలి. సాధారణంగా మాఘ-పాల్గుణ-వైశాఖ- జ్యేష్ఠ మాసాలు ఉత్తరాయణంతో కూడుకున్నవి. ఎంతో ప్రశస్తమైనవి. అలాగే బుధ, గురు, శుక్రవారాలు మంచివి. ఇకపోతే.. చిత్త – అనూరాధ – మృగశిర – ఉత్తర – రోహిణి – ఉత్తరాషాఢ మొదలైన నక్షత్రాలు గొప్పగా ఉంటాయి. అర్ధరాత్రి, పట్టపగలు, సంధ్యాకాలం పనికిరావు. ఇంటి యజమాని – యజమానురాలు లేదా జ్యేష్ఠ పుత్రుడు మొదలైన వారి పేర్ల మీదనే శుభ ముహూర్తం నిర్ణయింపజేసుకుని, ఆ సమయాన్ని తప్పకుండా కాల – మంత్ర – ఆచార యుక్తంగా, గోబ్రాహ్మణ సహితంగా గృహప్రవేశం జరపాలి. స్తోమతను బట్టి నలుగురికీ అన్నదానం చేయాలి. బట్టలు పెట్టాలి.
– డి. శివకుమార్, మోత్కూర్
ఎలాంటి చోట ఇండ్లు కట్టకూడదు? మేము ఒక మంచి స్థలం తీసుకుందామని అనుకుంటున్నాం.
వీధిపోట్లు లేని స్థలాలు.. అంటే, దక్షిణ – పశ్చిమ – ఉత్తర – వాయవ్యం – తూర్పు – ఆగ్నేయం రోడ్లు స్థలంమీద పడకుండా ఉండేవి తీసుకోవచ్చు. శ్మశానం వద్ద, బావులు, చెరువులు పూడ్చిన స్థలాలు, దక్షిణం – పడమర చెరువులు ఉన్న చోట్లు మంచిది కాదు. అలాగే అమ్మవారి ఆలయాలకు ఆనుకొని ఉన్నవి కానీ, శివాలయానికి ఎదురుగా, విష్ణు ఆలయానికి వెనుక ఉండే స్థలాలు కానీ ఇంటి నిర్మాణానికి పనికిరావు. మాడవీధులు కలిగి ఉన్న ఆలయాలకు ఇరుపక్కలా ఇండ్లు కట్టినా దోషం ఉండదు. అలాగని శ్మశానం వద్ద వీధి కలిగి ఉన్నా మంచిది కాదు. ముఖ్యంగా హైటెన్షన్ (హెచ్టీ) తీగల కింద, రైల్వే ట్రాక్లను ఆనుకొని, నీరు – శబ్ద – వాయు కాలుష్యాలు ఉన్నచోట నిర్మాణాలు.. ఆయుష్షును క్షీణింపజేస్తాయి.
– కె. తిరుపతి రెడ్డి, చింతల్
గుడికి ప్రదక్షిణం చేస్తే మంచి ఫలితాలు వస్తాయా? ఇంటి లోపాలు సరిచేయాల్సిన అవసరం లేదా?
ఆధ్యాత్మిక జీవనం వేరు, ఇంటి నిర్మాణం వేరు. మీరు ఇల్లు కట్టినప్పుడు శాస్త్ర సమ్మతంగా కట్టాల్సిందే. ఆ ఇల్లు పాతదైనా, కొత్తది కొన్నా లోపాలు సవరించుకోవాల్సిందే! డాక్టర్ అయినంత మాత్రాన మాత్రలు మింగాల్సిన అవసరం లేదు అనుకుంటే.. రోగం తగ్గదు కదా! ఇక గుడికి ప్రదక్షిణ అనేది చేయకూడని కార్యం కాదు. ఈ జీవితమే ఒక ప్రదక్షిణం. బ్రహ్మాండంలో భాగమైన భూమిమీద పుట్టుక నుంచి మరణం వరకు మన బతుకంతా ప్రదక్షిణమే! అంటే అలాఎన్నోసార్లు భూమ్మీదికి వచ్చి పోయాక.. ఎప్పటికో ఆ మనిషి జ్ఞానాన్ని పొంది పరిపూర్ణుడు అవుతాడు. ప్రదక్షిణం ఒక ఆరోగ్య – ఆధ్యాత్మిక వైభవ కార్యం. భగవంతుని స్మరణతో చేసే ప్రదక్షిణ మనిషిలో మానసిక మాలిన్యం పోగొడుతుంది. దక్షిణల కన్నా.. ప్రదక్షిణలు అంటేనే దేవుడికి ఇష్టం.
– ఆర్. పుష్ప, కోరుట్ల
రోడ్డు మధ్యలో ఉన్న గుడిని మరోచోట కట్టుకోవచ్చా? అది దోషం కాదా?
మనిషి ఆలోచన శాస్త్రీయంగా, ఉన్నతంగా ఉండాలి. మానవ నిర్మిత ఆలయాలు ఎప్పుడు, ఎక్కడికి, ఏ విధంగా స్థాన చలనం చేసినా.. దోషం కాదు. స్వయంభువు ఆలయాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించకూడదు. ఆ పరిస్థితులు వాటికి రానేరావు. ఆ ఆలయాల పునరుద్ధరణ ఎంత గొప్పగా చేసుకున్నా.. వాటి శక్తికి విఘాతం కలుగదు. కొన్నిసార్లు ప్రకృతి ఉత్పాతాలు వచ్చినప్పుడు విగ్రహాలు విచ్ఛిన్నం కావచ్చు. అనివార్యంగా తొలగించాల్సిన పరిస్థితి రావచ్చు. కాబట్టి, ఆలయాన్ని మరోచోట పునఃస్థాపించడం దోషం కాదు. రోడ్ల మీద వెలిసినవి.. చాలావరకు అశాస్త్రీయంగా కట్టినవే అయి ఉంటాయి. వాటికి తగిన ఉద్వాసన పూజను సంకల్పంతో జరిపించి, శాస్త్రబద్ధంగా మరోచోట ఆలయాన్ని నిర్మించవచ్చు. విగ్రహ పునఃప్రతిష్ఠ చేసుకోవచ్చు. ఈ విషయంలో అనుమానంఅవసరం లేదు.
– కె. సరస్వతి, సత్తుపల్లి
‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక,
ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం.
రోడ్ నం: 10, బంజారాహిల్స్, హైదరాబాద్ – 500034.
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678