అప్పుడెప్పుడో వచ్చిన గోదావరి సినిమాలో కమలినీ ముఖర్జీ ‘అందంగా లేనా.. అసలేం బాలేనా’ అని పాడుతూ సుమంత్ వెంట పడుతుంది గుర్తుందా? అప్పుడు ఆమె ఒక్కతే కావొచ్చేమో, ఇప్పుడు మన యువతలో చాలామంది అలాగే ఉన్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉన్న రకరకాల ఏఐ ఫిల్టర్లు, బ్యూటీ యాప్స్ మనల్ని క్షణాల్లో మరింత అందంగా, పర్ఫెక్ట్గా మార్చేస్తున్నాయి. అయితే ఈ డిజిటల్ అందాల వెనుక ఒక తీవ్రమైన మానసిక రుగ్మత దాగి ఉందంటున్నారు సైకాలజిస్టులు. దాన్నే ‘డిజిటల్ డిస్మోర్ఫియా’ అని పిలుస్తున్నారు.
సాధారణంగా సైకాలజీలో బాడీ డిస్మోర్ఫిక్ డిజార్డర్ అనే మానసిక సమస్య ఉంది. అంటే, తమ శరీరంలో లేదా రూపంలో ఏదో ఒక చిన్న లోపం ఉందని, దాని గురించే నిరంతరం ఆలోచిస్తూ కుంగిపోవడం దీనికి డిజిటల్ వెర్షనే ఈ డిజిటల్ డిస్మోర్ఫియా. ఏఐ ఫిల్టర్లు, ఎడిటింగ్ టూల్స్ సృష్టించిన అతి అందమైన, మచ్చలేని వర్చువల్ రూపానికి అలవాటుపడిపోయి, అద్దంలో కనిపించే తమ అసలు రూపాన్ని అస్సలు అంగీకరించలేకపోవడమే ఈ సమస్య ముఖ్య లక్షణం.
ఎలా మొదలవుతుంది?
సరదాగా ఫొటోలకు ఫిల్టర్లు పెట్టడం, మొటిమలు దాచడం, ముఖాన్ని సన్నగా మార్చడం లాంటి వాటితో ఇది మొదలవుతుంది. ఫిల్టర్ చేసిన ఫొటోలకు సోషల్ మీడియాలో ఎక్కువ లైకులు, కామెంట్లు రావడం వల్ల ‘నేను ఫిల్టర్లతోనే అందంగా ఉంటాను, సాధారణంగా ఉంటే నన్ను ఎవరూ మెచ్చుకోరు’ అనే భావన మనసులో బలంగా నాటుకుపోతుంది. క్రమంగా ఫిల్టర్ లేని తమ అసలు ఫొటోలను చూసుకోవడానికి భయపడతారు. అద్దంలో ముఖం చూసుకున్నప్పుడు చర్మం రంగు, ముక్కు ఆకారం, కళ్ల కింద నల్లటి వలయాలు పెద్ద లోపాలుగా కనిపిస్తాయి.
నష్టాలు ఇవీ..
తీవ్రమైన మానసిక ఒత్తిడి: తమ అసలు రూపం బయటపడిపోతుందేమోననే భయంతో నిరంతరం ఆందోళన చెందుతుంటారు. ఇది క్రమంగా తీవ్రమైన డిప్రెషన్‌కు దారితీస్తుంది.కృత్రిమ సౌందర్యం కోసం పాకులాట: డిజిటల్ ఫిల్టర్లలో కనిపించే విధంగా తమ ముక్కును, పెదవులను, చర్మాన్ని మార్చుకోవడం కోసం యువత చిన్న వయసులోనే కాస్మొటిక్ సర్జరీలు, ప్లాస్టిక్ సర్జరీల వైపు మొగ్గు చూపుతున్నారు.సామాజిక దూరం: సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే వీరు, నిజ జీవితంలో ఎవరైనా కలుస్తామంటే భయపడతారు. ఎందుకంటే బయట ఫిల్టర్లు ఉండవు కాబట్టి తమ ‘నిజ రూపం’ చూసి ఎక్కడ తక్కువ చేసి చూస్తారోనని సమాజానికి దూరంగా ఉంటారు.ఆత్మవిశ్వాసం దెబ్బతినడం: బాహ్య సౌందర్యమే సర్వస్వం అనుకోవడం వల్ల చదువు, ఉద్యోగం, ఇతర నైపుణ్యాలపై దృష్టి పెట్టలేరు.
బయటపడటం ఎలా?
సోషల్ మీడియా యాప్స్ వాడకాన్ని తగ్గించాలి. ముఖ్యంగా ముఖాన్ని మార్చేసే బ్యూటీ ఫిల్టర్లను వాడటం పూర్తిగా ఆపేయాలి. సోషల్ మీడియాలో కనిపించే 90% ఫొటోలు ఎడిట్ చేసినవేనని, పర్ఫెక్ట్ బాడీ లేదా పర్ఫెక్ట్ ఫేస్ అనేది ఒక భ్రమ అని మనస్ఫూర్తిగా గుర్తించాలి. మన చర్మం రంగు, ఆకృతి, వయసుతోపాటు వచ్చే మార్పులు సహజమైనవని, వాటితోనే మనం ప్రత్యేకంగా ఉంటామని నమ్మాలి. ఈ అసంతృప్తి తీవ్రరూపం దాల్చి రోజువారీ జీవితాన్ని ఇబ్బంది పెడుతుంటే, ఆలస్యం చేయకుండా కౌన్సెలింగ్ సైకాలజిస్ట్‌ను లేదా థెరపిస్ట్‌ను సంప్రదించాలి.
ఏం చేస్తారు?
డిజిటల్ డిస్మోర్ఫియా సమస్యలతో బాధపడే వారికి కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీలో వాడే మిర్రర్ రీట్రైనింగ్ విత్ డిస్క్రిప్టివ్ లాంగ్వేజ్ బాగా సహాయపడుతుంది. సాధారణంగా డిజిటల్ డిస్మోర్ఫియా ఉన్నవారు అద్దాన్ని రెండు రకాలుగా వాడుతుంటారు, గంటల తరబడి అద్దంలో తమ లోపాలను వెతుకుతూ కూర్చోవడం. తమ అసలు రూపం నచ్చక అద్దాన్ని చూడటమే పూర్తిగా మానేయడం. ఈ ‘మిర్రర్ రీట్రైనింగ్’ టెక్నిక్ ద్వారా అద్దాన్ని చూసే పద్ధతిని ఆ సమయంలో మనసులో అనుకునే మాటలను మార్చడం జరుగుతుంది.ఈ టెక్నిక్‌ను క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయడం వల్ల మెదడులో ఉండే కాగ్నిటివ్ డిస్టార్షన్స్ తొలగిపోతాయి. స్క్రీన్‌పై కనిపించే ఫిల్టర్ల భ్రమ నిజం కాదని, అద్దంలో కనిపించే సహజ రూపమే యదార్థమని మనసు అంగీకరించడం ప్రారంభిస్తుంది.కౌన్సెలింగ్ ప్రక్రియలో ఈ టెక్నిక్స్‌తో పాటు డిజిటల్ ఎక్స్పోజర్ రెస్పాన్స్ ప్రివెన్షన్ లాంటి పద్ధతులను కూడా జోడించి క్లయింట్స్‌లో ఆత్మవిశ్వాసాన్ని పునరుద్ధరిస్తారు.స్క్రీన్ పైన కనిపించే కొన్ని పిక్సెల్స్ మన ఆత్మవిశ్వాసాన్ని శాసించకూడదు. డిజిటల్ ముసుగులను తీసేసి మన సహజత్వాన్ని మనం ప్రేమించినప్పుడే ఈ డిజిటల్ డిస్మోర్ఫియా అనే మాయ నుంచి బయటపడగలం.
-బి. కృష్ణ, సీనియర్ సైకాలజిస్ట్
ఇగ్నిషియో చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్,
హైదరాబాద్, 99854 28261