చలం రాసిన ‘వేదాంతం’ కథ ఆలోచనకు పదునుపెట్టే ప్రహేళిక (పజిల్) లాంటిది. స్త్రీ అంతరంగాన్ని అర్థం చేసుకోవడానికి పురుషుడు నిత్యం చేసే విశ్వ ప్రయత్నంగా ఇది గోచరిస్తుంది. ‘పురుషాధిక్య ప్రపంచంలో ఓ సంస్కారిగా జీవించగలుగుతున్నా.. మోహావేశాలకు లోనై బలహీనతలకు జారిపోతున్నానా? నిందపడిన స్త్రీకి నిజంగా చేయూతనిస్తున్నానా? ఆమె కోరుకున్న భవితను ఇవ్వగలుగుతున్నానా? ఆమె ఏం కోరుకుంటున్నది? ప్రకృతికి సమాంతరంగా స్పందిస్తూ అదే సందర్భంలో ఆమె అంత నిర్వికారంగా ఎలా జీవించగలుగుతున్నది? అనుభవం ఆమెకు అదే నేర్పిందా? లేక సహజంగానే ఆమెకు అబ్బిందా? ఏమో?’ ఇన్ని ప్రశ్నలకు సమాధానం ‘వేదాంతం’ నాటకం.
కథలోకి వెళ్తే.. సత్తిరాజు ఆత్మహత్య చేసుకుంటాడు. అందుకు అతని భార్య అరుణే కారణమని కొందరి అనుమానం. సత్తిరాజు స్నేహితుడు చలపతి సత్యశోధన కోసం రంగప్రవేశం చేస్తాడు. సత్తిరాజు ఒక మలబార్ టీచర్ని ప్రేమించాడని, కొంతకాలం తర్వాత ఆమె ఇతణ్ని కాదని మరో పెద్ద ఉద్యోగితో చనువు పెంచుకుని, అతనితో వెళ్లిపోతుంది. ఆ అవమానం భరించలేక సత్తిరాజు తనువు చాలించాడనేది అసలు విషయం. కానీ, చలపతికి రాసిన ఉత్తరంలో… ‘నాకు దగ్గర బంధువులు, నా కోసం విచారించేవాళ్లు, శ్రమపడేవారు ఎవరూ లేరు. నా భర్య ఓ విచిత్రమైన వ్యక్తి. రాక్షసిగా నిశ్చయించలేను. ఆమెలో హృదయానికి బదులు రాయి ఉంది. రక్తం బదులు పాదరసం ఉంది. ఆమె కనికరిస్తే నాగతి ఇట్లా కాకపోవు. నాకు పిల్లలు లేరు. కానీ, దిక్కులేని నా మేనల్లుడు నా పాలపడ్డాడు. వాణ్ని నా భార్య దయాదాక్షిణ్యాలకు వదలడం నాకిష్టం లేదు. కనుక వాడి భారమంతా నీదే’ అంటూ ఉత్తరం రాస్తాడు. ఆ ఉత్తరం పట్టుకుని చలపతి అరుణ ఇంటికి వస్తాడు.
ఇక అక్కడినుంచి అరుణ- చలపతి మధ్య మాటల తూటాలు పేలుతుంటాయి. అరుణ: మీరు ఊహించినట్టు మా ఇద్దరి మధ్య ప్రేమ-పగా లేవు. మీ స్నేహితుడి స్వభావం మోహపూరితం. నాది స్వచ్ఛం. అందుకే మా సంసారంలో సామరస్యం చచ్చిపోయింది. పెళ్లికి ముందే ఏర్పడిన ఆయన అపవిత్ర బంధానికి నాతో పెళ్లితో రక్షా కవచం లాంటి లైసెన్స్ వచ్చిందనుకున్నారు. ఆయన ఆటలు నేను సాగనివ్వలేదని తన మోహోద్రేకాన్ని ఆమెపై చూపారు. చివర్లో ఆమె దగా చేయడంతో నిరాశతో గోదావరిలో పడాలని చూశాడు. ఎలాగో తప్పించాను. ఇంకా బతికేటట్టు చేసేదాన్ని, కానీ, నాకా అవసరం కనిపించలేదు.
చలపతి: కనిపించలేదా..? అంటే తోడూ-నీడా అక్కర్లేదా..?
అరుణ: నిజంగా భర్త అయితే ఆలోచించేదాన్ని. పిల్లలుంటే వాళ్ల కోసం బతికేదాన్ని. ఇలా ఇద్దరి మధ్య సంభాషణలు సాగుతూ మధ్య మధ్యలో అపోహలు, అంతరాల దొంతరలు ఒక్కొక్కటి ముడులు విప్పినట్టు తొలగిపోతాయి. ఒకరిపట్ల ఒకరికి ఆకర్షణ, ప్రేమలు చిగురిస్తాయి. ‘నేను ప్రేమించింది నీ బాహ్య సౌందర్యాన్ని కాదు’ అని చలపతి అంటే… ‘నా పట్ల మీకున్న ప్రేమ ముందు నేను ఓడిపోయాను మాస్టారు’ అని అరుణ అంటుంది. ‘అరుణా నిన్ను ఓదార్చగల మనసున్న దేవుడు చలపతి. అతని కోసం పూసిన అనాఘ్రాత కుసుమానివి’ (సత్యరాజ్ వాయిస్) వినిపిస్తుండగా తెరపడుతుంది.
ఇలాంటి కథను నాటకీకరణ చేయడం రచయితకు కత్తి మీద సామే! చేసిన పాత్రధారులకు, చూసిన ప్రేక్షకులకూ ఓ ప్రహేళికే మరి! ఈ కథను ఉన్నంతలో దృశ్యమానం చేయడానికి ప్రయత్నించాడు రచయిత. అజో-విభో- కందాళం వారు, జాషువా సాంస్కృతిక కేంద్రం ఇటీవల నిర్వహించిన కథా నాటికల పోటీలలో ఈ నాటిక మూడు బహుమతులు గెలుచుకున్నది.
నాటిక పేరు: వేదాంతం
రచయిత: డా. బి.వి. రమణమూర్తి (మార్గశీర్ష)
మూల కథ: చలం
ప్రదర్శన: శ్రీ షిర్డి సాయి కల్చరల్ వెల్ఫేర్ అసోసియేషన్
దర్శకత్వం: పి.ముత్యాలరావు
పాత్రధారులు: ముత్యాలరావు, శంకర్రావు, జ్యోతిరాణి, శ్రీజ సాధినేని
-కె. శాంతారావు
రంగస్థల నటుడు, విశ్లేషకుడు