కలి గతాబ్ది: 5126, క్రీస్తు శకం: 2025-26, శాలివాహన శకం: 1947, భారత స్వాతంత్య్ర శకం: 78-79 నవనాయక ఫలితాలు
రాజు- రవి, మంత్రి- చంద్రుడు, సేనాధిపతి- శని, సస్యాధిపతి- బుధుడు, ధాన్యాధిపతి- కుజుడు, అర్ఘ్యాధిపతి- రవి, మేఘాధిపతి- రవి, రసాధిపతి- శుక్రుడు, నీరసాధిపతి- కుజుడు, రాజవాహనము- గజం (ఏనుగు) పశుపాలకుడు- యముడు, గోష్ఠాగార ప్రాపకుడు (స్థాన సంరక్షకుడు)- యముడు, గోష్ఠాద్బహిష్కర్త – యముడు
రాజు- రవి: గ్రహరాజు అయిన రవి రాజు కావడం వల్ల ఈ సంవత్సరంలో రెండు తూముల వర్షం కురుస్తుంది. ఇందులో సముద్రంలో 9 భాగాలు, పర్వతాల్లో 9 భాగాలు, భూమిపై 2 భాగాలు వర్షపాతం నమోదవుతుంది. అల్పవృష్టితో కాలం ప్రతికూలంగా పరిణమిస్తుంది. పాలకుల మధ్య విరోధాలు ఏర్పడతాయి. పాలకుల వల్ల ప్రజలకు ఇక్కట్లు తప్పవు. ఆయుధాలు, అగ్ని భయం కలుగుతాయి. పంటలు తక్కువగా పండుతాయి. చోరాగ్ని భయాలు ఉంటాయి. పాలకులకు గడ్డు పరిస్థితులు తప్పవు. ఉన్నత స్థితిలో ఉన్నవాళ్లు పదవీచ్యుతులు అవుతారు. దేశంలో, రాష్ట్రంలో రాజకీయాలు కల్లోలంగానే సాగుతాయి. ప్రకృతి వైపరీత్యాలు పరీక్షిస్తాయి. గోధుమలు, ధాన్యం, మిర్చి, మిరియాలు, కందులు, వేరుశనగ, ఇంగువ, కొబ్బరి కాయలు, కలప, పగడాలు, కెంపులు, నూలు దుస్తులు, మామిడి పండ్లు, వక్కలు, ఎర్రని పదార్థాలు, గులాబిరంగు, తెల్లని రంగులు, ఎలక్ట్రిక్ ఉపకరణాలు, జంతు చర్మాలు, రసాయన ఎరువులు, పశువుల ధరలు పెరుగుతాయి.
రాజవాహనం- గజం (ఏనుగు): రవి వల్ల కలిగే ఈతి బాధలు కొంత తగ్గుతాయి. ప్రజలకు సుఖం కలుగుతుంది. సస్యానుకూల వర్షాలు కురుస్తాయి. ప్రాణికోటికి సంతోషం కలుగుతుంది.
మంత్రి- చంద్రుడు: ప్రజల్లో చైతన్యం, మనసుల్లో పరివర్తన కలుగుతుంది. రాజకీయ పార్టీలు అభ్యుదయ భావాలతో పనిచేస్తాయి. పంటలు సమృద్ధిగా పండుతాయి. ఆహార ధాన్యానికి కొరత ఉండదు. పాడి పెరుగుతుంది. పెట్రోలు ధరలు స్వల్పంగా తగ్గే సూచన. నూనెగింజలు, వెన్న, నెయ్యి, చక్కెర, వెండి, బంగారం ధరలు పైపైకి పెరుగుతాయి. ప్రజల్లో ధర్మనిష్ఠ పెరుగుతుంది.
సేనాధిపతి- శని: పలు దేశాల్లో యుద్ధ ఛాయలు అలుముకుంటాయి. సైనికులకు కష్టకాలమనే చెప్పాలి. బలవంతులమని విర్రవీగే వారి పీచం అణుగుతుంది. నల్లని ధాన్యాలు, నల్లరేగడి భూముల్లో దిగుబడి అధికంగా వస్తుంది. రవాణా వ్యవస్థ లోపాలతో సతమతమవుతుంది. ధాన్యం ధరలు పెరుగుతాయి. కొన్ని ప్రదేశాల్లో తగ్గుతాయి. రాజకీయంగా ఒడుదొడుకులు ఉంటాయి.
సస్యాధిపతి- బుధుడు: ప్రజలకు ఈతి బాధలు కలుగుతాయి. పంటలకు తెగుళ్ల బెడద పెరుగుతుంది. దిగుబడులు తగ్గుతాయి. అపర ధాన్యాలు సమృద్ధిగా పండుతాయి. నెయ్యి, నూనెగింజలు, నూనెలు, రసాయనిక ఎరువులు, పత్తి, కలప, నూలు దుస్తులు, నార, పసుపు, గోనెసంచులు, కాగితం, పెసలు, వెన్న, వెండి, బంగారం ధరలు హెచ్చుగానే ఉంటాయి.
ధాన్యాధిపతి- కుజుడు: ముల్లుగల ధాన్యాలు, కందులు, బొబ్బర్లు, మిర్చి, వేరుశనగ, ఎర్రని ధాన్యాలు, ఎర్రని భూములు ఫలించును. చెరకు, బెల్లం, చక్కెర, నెయ్యి, నూనెగింజలు, ఆముదం ధరలు పెరుగుతాయి. అపర ధాన్యాలకు మంచి డిమాండ్ ఉంటుంది.
అర్ఘ్యాధిపతి- రవి: వర్షపాతం తక్కువే! ధరలు పెరుగుతాయి. ప్రజలకు ఆకలి బాధలు తప్పవు. యుద్ధ భయం నెలకొంటుంది. అధికారంలో ఉన్నవారికి రాజకీయంగా కష్టకాలమే! ఎర్ర ధాన్యాలు ఎక్కువ దిగుబడి సాధిస్తాయి. వెండి, బంగారము ధరలు హెచ్చుగా ఉంటాయి. నూనెలు, కొబ్బరికాయలు, మిర్చి, మిరియాలు, వక్కలు, ఎర్రని రంగులు, నూలు దుస్తులు మొదలైన వాటి ధరలు ఎక్కువగా పలుకుతాయి.
మేఘాధిపతి- రవి: పంటల దిగుబడి తగ్గుతుంది. ఎర్రని భూములు, ఎర్రని ధాన్యాల దిగుబడి బాగుంటుంది. ప్రజలను నానారకాల భయాలు వెంటాడుతాయి.
రసాధిపతి- శుక్రుడు: కుంకుమపువ్వు, కర్పూరం, అగరు వస్తువులు, చందనం, అత్తరు, పన్నీరు మొదలైన సుగంధ ద్రవ్యాలు, పాదరసం లాంటి నిర్గంధ వస్తువులు, క్షారాలు, ఉప్పు, రసాయన పదార్థాలు, పసుపు, కందమూలాదులు, పండ్లు, పుష్పాల దిగుబడి పెరుగుతుంది. ఈ వస్తువుల ధరలు అందుబాటులో ఉంటాయి.
నీరసాధిపతి- కుజుడు: పుష్ప వృక్షాలు, ఫల వృక్షాలు చక్కగా దిగుబడిని అందిస్తాయి. బంగారం, మణులు, రక్త చందనం ధరలు హెచ్చుతగ్గులకు గురవుతాయి. మిర్చి, పొగాకు, ఇనుము, ఉక్కు, యంత్ర పరికరాలు, రాగి, ఇత్తడి, కంచు మొదలగు వాని ధరలు పెరిగి నిలబడి ఉంటాయి. అపర ధాన్యాల ధరలు పెరుగుతాయి.
పశుపాలకుడు, గోష్ఠాగార ప్రాపకుడు, గోష్ఠాద్బహి ప్రాపకుడు- యముడు: ధరలు అధికమగును. అల్పవృష్టి, పాడిపంటలు తక్కువ దిగుబడి కలిగి ఉంటాయి. రోగాది పీడలతో పశువులకు నష్టం వాటిల్లుతుంది. ప్రజలకు సంక్షేమం అందని ద్రాక్షే అవుతుంది. పశుపాలక, గోష్ఠాగార ప్రాపక, గోష్ఠాద్బహిష్కర్త అన్నిటా యముడికి సంపూర్ణ ఆధిపత్యం లభించింది. ఫలితంగా అల్పవృష్టి ఉంటుంది. పశువులకు పీడ తప్పదు. దుర్మార్గుల చెరలో అమాయకుల ధన, మాన, ప్రాణాలకు హాని కలుగుతుంది.
మొత్తంగా విశ్వావసు నామ సంవత్సరం క్రోధి మిగిల్చిన క్రోధానికి కొనసాగింపుగా కనిపిస్తున్నది. నవనాయకుల్లో శుభగ్రహాలకు ఆధిపత్యం తక్కువగా రావడం వల్ల.. కాలం ప్రతికూలంగా ఉంటుంది. పాలకులు ప్రజా కంటకులుగా ప్రవర్తిస్తారు. పాలనను గాలికొదిలేసి.. పబ్బం గడుపుకొంటారు. మొత్తంగా ఈ ఏడాది వర్షపాతం తక్కువే! రోగాలు ప్రబలుతాయి. ఆహార ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. చైత్రంలో రాజకీయంగా అలజడి రేగుతుంది. వైశాఖంలో కలహాలు, ప్రజాక్షోభం, పొరుగుదేశంలో దుర్భిక్షం. జ్యేష్ఠంలో రోగాధి భయాలు, ఆషాఢంలో అల్పవృష్టి, శ్రావణ భాద్రపద మాసాల్లో దుర్భిక్షం, కొన్ని ప్రాంతాల్లో సస్యానుకూల వర్షపాతం నమోదవుతుంది. ఆశ్వయుజంలో పశు నష్టం, కార్తికంలో ద్రవోల్బణం తారస్థాయికి చేరుకుంటుంది. సంవత్సరాంతం వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుంది.
పంచాంగ కర్త పరిచయం
సనాతన ధర్మానికి, జ్యోతిష్య విద్య, సంస్కృత, వేద శాస్త్రాలకు ఆలవాలమైన గుడి వంశంలో కాశ్యపస గోత్రంలో గుడి నృసింహ సిద్ధాంతి – గోదావరమ్మ దంపతులకు జన్మించారు. జ్యోతిర్విద్యా విశారదులుగా 46 సం॥లు నిరాటంకంగా పంచాంగ రచన గావించిన పితృదేవులైన గుడి నృసింహ సిద్ధాంతి గారి వద్ద జ్యోతిశ్శాస్త్రం, ముహూర్త, సిద్ధాంత (గణిత), జాతక, వాస్తు భాగాలను క్షుణ్ణంగా, సంపూర్ణంగా అభ్యసించారు. అదే సమయంలో సమాంతరంగా శతావధాని శ్రీమాన్ కృష్ణమాచార్యుల సహోదరులు శ్రీ వేంకటేశ్వర చెంపూ ప్రబంధాది అనేక గ్రంథాలను రచించిన అష్టావధాని శ్రీమాన్ శిరిశినహల్ పెరుమాండ్లాచార్యుల వద్ద సంస్కృతంలో పంచ కావ్యాలు నైషధాంతం శ్రద్ధాభక్తులతో అభ్యసించారు. స్మార్త, ఆగమ పండితులు నిత్య పూజా దురంధరులు పితామహులైన శ్రీ గుడి కృష్ణమూర్తి శాస్త్రి గారి వద్ద పూజాది కార్యక్రమాలకు సంబంధించిన అన్ని విషయాలను అభ్యసించారు. నిర్మల్ డిగ్రీ కళాశాలలో బి.ఎస్.సి. (ఎం.పి.సి) పూర్తి చేసి తదనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఎస్.సి. (అప్లయిడ్ మేథమేటికల్ స్టాటిస్టిక్స్) పూర్తి చేశారు. 19 సం॥ల వయసులోనే పంచాంగ గణితాన్ని ప్రారంభించి మొదటి 2 సంవత్సరాలు పితృదేవుల పర్యవేక్షణ సహాయ సహకారాలతో పూర్తిచేసి తదనంతరం స్వయంగా 41 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా పంచాంగ రచన చేస్తూ సంప్రదించిన వారందరికీ జాతక, జ్యోతిశ్శాస్త్ర, ప్రశ్న, ముహూర్త, వాస్తు విషయ నిర్ణయం తెలియజేస్తూ అనేక మంది మన్ననలను పొందుతున్నారు.
-గుడి ఉమామహేశ్వర శర్మ సిద్ధాంతి