రెండు పెళ్లిళ్లు ఉన్నాయి.. ఐదారు రోజుల వ్యవధిలో. రెండూ వెళ్లవలసినవే. కొన్నేళ్ల క్రితం వరకూ అయితే ప్రతి సంవత్సరం కనీసం రెండుసార్లు సొంతూరికి వెళ్లేవాడు చంద్రకాంత్. వారం రోజుల ప్రయాణానికి సిద్ధమవ్వాలి ఇప్పుడు. ఒకరోజు హైదరాబాద్‌లో మిత్రుల్ని కలవొచ్చు. ఒకరోజు తిరుపతి. మిగిలిన సమయం ఏం చెయ్యాలా!? అని ఆలోచిస్తూ ఉండగా.. ఆస్ట్రేలియాలో స్థిరపడ్డ స్నేహితుడు శశాంక్ పంపిన ఒక వీడియోతో సమాధానం దొరికింది. శశాంక్ జేఎన్టీయూలో ఇంజినీరింగ్ చదివేటపుడు సహాధ్యాయి. చాలారోజుల తర్వాత ఈమధ్యే మళ్లీ టచ్‌లోకి వచ్చాడు. వాళ్ల ఊరి పొలిమేరల్లో బర్డ్ సాంక్చుయరీ ఏర్పాటు చేశారట. ఆ వివరాలతో వీడియో షేర్ చేశాడు. చంద్రకాంత్‌కు బాగా నచ్చింది. అక్కడికి వెళ్లాలని ఉందంటూ సందేశం పంపాడు.. శశాంక్‌కి. “తప్పకుండా వెళ్లు. నీకు నచ్చుతుంది. రెండ్రోజులు ఉండిరా! మా భాను అక్కడే ఉంటాడు. నీకు అన్ని ఏర్పాట్లుచేస్తాడు” అని ఫోన్ చేసి చెప్పాడు శశాంక్.
శశాంక్ తల్లిదండ్రులు ఆ ఊరిలోనే ఉంటారు. భాను తనకు శశాంక్ వాళ్ల ఇంట్లోనే మకాం ఏర్పాటు చేస్తాడని ఊహించలేదు చంద్రకాంత్. విశాలమైన లోగిలి, పెద్ద పెరడు. ఈమాత్రం జాగా ముంబైలో ఉంటే పది అంతస్తులు కట్టేసి ఒక అరవై కుటుంబాలు ఎవరికివారు ఇంకొకరితో పట్టనట్టుగా బతికేస్తుండేవారు. అన్నీ అధునాతనమైన వస్తువులతో ఇంటిని నింపేసినట్టున్నాడు శశాంక్. ఈ పాత ఇంటిలో మేము ఇమడలేకపోతున్నాం అన్నట్టు ఉన్నాయి.భోజనాలు అయ్యాయి.తను పోగొట్టుకున్నదేదో చంద్రకాంత్ ముఖంలో కనిపించినట్లు చూస్తున్నారు సుందరమ్మగారు.
“మా శశాంక్, నువ్వూ కలుస్తుంటారా బాబూ” అని అడిగింది.
“ఈ అబ్బాయి ఉండేది ఆస్ట్రేలియాలో కాదు సుందరీ. ముంబైలో” భాస్కరంగారు సర్దిచెప్పారు
“వీడియో కాల్స్ చేస్తుంటాడు” అందామె ఏదో సంజాయిషీ చెబుతున్నట్టు.
అందమైన ఆకృతితో పుస్తకాలు నిండుగా నింపుకొన్న ర్యాక్ ఒకటి ఉంది. దానిమీద చెయ్యి వేస్తూ..
“ఆన్లైన్లో ఎన్ని పుస్తకాలు ఉన్నా ఈ తృప్తి రాదు” అని నవ్వాడాయన. ఆ నవ్వులో జీవం లేదు. అప్పుడే భాను వచ్చాడు. ఇద్దరూ గ్రామంలో నడుస్తున్నారు. ఊరి పొలిమేరలో ఉన్న బర్డ్ సాంక్చుయరీ దగ్గరకి వెళ్లడానికి భాను మోటార్ సైకిల్ తెస్తానంటే చంద్రకాంత్ వద్దన్నాడు. పదబంధ ప్రహేళికలో ప్రతి మూడు, నాలుగు గడులకు ఒక సుడి ఉన్నట్టు కొన్ని ఇళ్లకు తాళాలు పెట్టి ఉన్నాయి. విదేశాల్లో స్థిరపడ్డ యువత తమ తల్లిదండ్రుల్ని హైదరాబాద్ వంటి పెద్ద నగరాలకు సామానుతోపాటు ప్యాక్ చేసి తరలించేశారు.
దారిలో చాలామంది.. ‘ఎవరు?’ అన్నట్టు భానువైపు చూశారు. కొత్తముఖం కనిపిస్తే మరి ఆశో, ఆసక్తో.
“భాస్కరం మావయ్య వాళ్ల శశాంక్ లేడూ.. తన స్నేహితుడు”
చంద్రకాంత్‌ని నిలబెట్టేసి తమ పిల్లలు ఏ దూరతీరాల్లో ఉన్నదీ చెప్పుకొన్నారు వాళ్లంతా.
“ఇది మా ఇల్లు”.. కొంచెంసేపు కూర్చున్నారు. పక్షుల ఫొటోలతో తయారుచేసిన ఆల్బం చూపించాడు. అద్భుతంగా ఉంది. ఇళ్ల బయట నులక మంచాలు వేసుకుని కూర్చున్నారు కొందరు. కొన్ని ఇళ్లలో టెలివిజన్ సెట్లు మోగుతున్నాయి. కళ్లపై ఎండ పడకుండా చెయ్యి అడ్డం పెట్టుకుని చూసే ముదుసలిని చూస్తే.. ‘పడని వాన, రాని అతిథి’ కోసం చూస్తున్నట్టు అనిపించింది చంద్రకాంత్‌కి. కొన్ని స్కూటర్లు; ఒకటీ, రెండు కార్లు వాళ్లను దాటి వెళ్లాయి. సంరక్షణ కేంద్రానికి వెళ్లాలంటే ఊరి గుండానే వెళ్లాలి.
“ఆదివారం కదండీ.. సందర్శకుల తాకిడి ఎక్కువే ఉంటుంది” చెప్పాడు భాను.
ఆ ఊరే కాకుండా చుట్టుపక్కల పల్లెలనుండి పట్నాల్లో, విదేశాల్లో స్థిరపడిన యువత కూడా పక్షుల్ని చూడటానికని ఈమధ్య పిల్లా పాపలతో వస్తున్నారు. ఆ విశేషాలను తమ సోషల్ మీడియాలో పంచుకోవడం గొప్పగా అనిపిస్తోంది వాళ్లకు.
ఒక ఇంటి ముందు బెంజ్ కారు ఆగి ఉంది. భాను కజిన్ అట. అమెరికా నుండి వచ్చాడు.
కొన్ని ఇళ్లలో గతంలో పాడిపశువులు ఉన్న గుర్తులతో కొట్టాలు కనిపించాయి. ఒక్కో ఇంటిలో జనాభా తగ్గిపోవడంతో చేసేవాళ్లూ లేరు, అవసరమూ లేకపోయింది.
ఈ అనుభవం మరలా రానిది అన్నట్టు నెమ్మదిగా నడుస్తున్నాడు చంద్రకాంత్.
ఎద్దుల బళ్ల జాడే లేదు, మువ్వల సవ్వడీ లేదు. కమ్మరులూ లేరు. ఒక గానుగ మూతపడి ఉంది. ఫలానా కాలంలో వెల్లివిరిసిన నాగరికతకు చిహ్నంగా మిగిలిపోతాయేమో శిథిలమవుతున్న పల్లెలు.
సందర్శకుల వల్ల చిన్న హోటల్ దగ్గర వ్యాపారం బాగానే సాగుతోంది. అమ్మవారి ఆలయంలో ఒకామె మెట్ల మీద కూర్చుని పూలమాల కడతా ఉంది. అవసరమైనంత మంది పిల్లలు లేరని బడి మూసేశారట. ఉన్న పిల్లల్ని ఇక్కడికి మూడు కిలోమీటర్ల దూరంలోని మరో బడిలో చేర్చారు. పూరించలేని ఖాళీలు దర్శనమిస్తున్నా.. చంద్రకాంత్ పల్లె అందాన్ని ఆస్వాదిస్తూనే ఉన్నాడు. తెగిపోయిన తీగె కూడా ఏదో ఒక రాగం పలికిస్తుందేమో. అసంపూర్ణ చిత్తరువులో కూడా ఆత్మ గోచరిస్తోంది. గాలి గతకాలపు పరిమళాన్ని ఇంకా మోస్తున్నట్టే ఉంది.
“పండక్కి రాము వస్తాడా.. పెద్దమ్మా?” ఒక
పెద్దావిడని పలకరించాడు భాను.
“వాడు అమెరిక బోయినంక ఎప్పుడొచ్చినడు? బాగ సంపాయించుకున్నడు. రెండో, మూడో ఇళ్లుండాయి. రెండేళ్ల కిందొచ్చి గొడవేసుకుని పాలే. అంతే ఇగ రాలె.” ఇప్పుడు తాటాకులు అవసరం లేవని పొలం గట్లపై ఉన్న తాటిచెట్లన్నీ కొట్టించేసినట్టు ఉన్నారు, ఎండిన ఆకులు పడి పంట పాడవకుండా. పొలాలు దాటారు. దూరంగా పక్షులు తీస్తున్న రాగాలు వినవస్తున్నాయి. పక్షుల కూతలు, జంతువుల అరుపులతో ఏర్పడినవే సప్తస్వరాలు అంటారు కదా. చెట్ల మీద, ఇసుక తిన్నెలపై, నీళ్లలో.. అదివో, అల్లదివో పక్షుల నివాసము అన్నట్టు ఉంది. పది ఎకరాల విస్తీర్ణంలో చెరువు అల్లంత దూరంలో ఉందనగా ఇనుప
కంచె ఏర్పాటు చేశారు.. జనాన్ని నిలువరించడానికి. రకరకాల, రంగురంగుల పక్షులు వేల సంఖ్యలో. జన విస్ఫోటనం మాత్రమే కనిపించే ముంబై నుండి వచ్చిన చంద్రకాంత్ కళ్లముందు ఒక కొత్త ప్రపంచం ఆవిష్కృతమైనట్టు ఉంది. “చైనా, నేపాల్, హిమాలయాల నుండి పెలికాన్స్, నైజీరియా నుండి పెయింటెడ్ స్టార్క్స్, శ్రీలంక, ఆఫ్రికా నుండి ఓపెన్ బిల్ స్టార్క్స్, దక్షిణాఫ్రికా నుంచి వైట్ ఐబిస్, సైబీరియా, ఆస్ట్రేలియా నుంచి మొత్తం ముప్పై రెండు రకాల పక్షులు వస్తాయి సార్” చెప్పాడు భాను. చెరువు మధ్యలో మట్టిదిబ్బలు, వాటిపై తుమ్మచెట్లు ఏపుగా పెరగడంతో పక్షుల ఆవాసానికి, గుడ్లు పొదగడానికి అనుకూలంగా ఉన్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం అక్కడికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామానికి పక్షులు వలస వచ్చేవి. కానీ అక్కడి చెరువు ప్రైవేట్ వ్యక్తుల అధీనంలోనిది. పెట్టుబడి పెట్టి చేపల చెరువుగా అభివృద్ధి చేశారు.
చుట్టుపక్కల కొన్ని పంటపొలాలూ ఉన్నాయి. పక్షుల ఆహారం కోసం అవి వనంలో కాసిన పళ్లూ, నదుల్లో, సముద్రంలో తిరిగే జలచరాలు కావు కదా! చెరువు లీజుదార్లు, రైతులు పెద్దగా శబ్దాలు చెయ్యడం వంటి పద్ధతులు పాటించి వాటిని తరిమేశారు. భాను వాళ్ల గ్రామం వాటిని అతిథి దేవోభవ అని అక్కున చేర్చుకుంది. వాటివల్ల పంటలకు కొంత నష్టం వాటిల్లినా, నీటికుంటలు కలుషితమైనా వాటిని సంరక్షించారు. ఈ భూమి మీద హక్కు ఒక్క మనుషులకే కాదు అన్ని జీవరాశులకూ ఉంటుందనే ఎరుక పల్లె ప్రజల్లోనే ఎక్కువ అనుకున్నాడు చంద్రకాంత్. సందర్శకులు బాగానే ఉన్నారు. బైనాక్యులర్స్‌తో పక్షులను పరీక్షగా గమనిస్తున్నారు.
“పక్షులకు పాస్‌పోర్ట్, వీసాలతోపాటు గూగుల్ మ్యాప్ కూడా అవసరం లేదు” అన్నాడు భాను.
“పక్షులు సంఘజీవులు”
“మరి మానవులు?”
“సెల్ జీవులు” నవ్వాడు. ఆ ఊరి పిల్లలు ఆదివారాలు అక్కడే ఉంటారు. వాళ్లు తెలుసుకున్నవి, గమనించినవి సందర్శకులకు వివరిస్తున్నారు.
“పక్షులు నెలల తరబడి ఆగకుండా ఆకాశంలో ఎగురుతూనే ఉండగలవు తెలుసా అండి?” అన్నాడో పిల్లాడు.
“నిద్ర, తిండి అన్నీ ఎగురుతూనే”
“వి.. ఆకారంలో ఎగరడం వలన ముందు ఉన్న పక్షి కన్నా వెనుక ఉన్న పక్షికి శక్తి తక్కువ ఖర్చు అవుతుంది. అందుకే అవి పొజిషన్స్ కూడా మార్చుకుంటాయి” అన్నాడు మరో పిల్లాడు.
“ఈ చెరువుకు ఊరివాళ్లు వాడుకునే చెరువుకు మధ్య తూము ఉండేది. పక్షుల రెట్టలు, మిగిలిన వ్యర్థ పదార్థాలు మా చెరువులోకి రాకుండా అడ్డుకట్ట వేసేశాము. అంటే ఇప్పుడు ఈ చెరువు మీద పూర్తి అధికారం పక్షులదేనన్నమాట” చెప్పాడు భాను.
“ఆ పక్కన ఇంకో చెరువు ఉంది కదా. అక్కడా పక్షులే కనపడుతున్నాయి?”
“అదా! ఏ యేటికాయేడు పక్షుల సంఖ్య పెరిగిపోవడంతో చెరువులో మేత సరిపోవడం లేదు. వాటి మధ్య పోటీ పెరిగిపోయింది. అందుకే దానికి దిగువన ఉన్న ఐదెకరాలు పక్షుల కోసం ఇచ్చేశారు”
“ఎవరా బలి చక్రవర్తి?” ఆశ్చర్యపోతూ అడిగాడు చంద్రకాంత్.
“ఇందాక బజారులో కనపడిందే. అదే.. వాళ్ల అబ్బాయి రెండేళ్ల క్రితం గొడవ పెట్టుకుని మళ్లీ రాలేదని చెప్పింది. ఆవిడే అండీ”
గొడవ ఎందుకయ్యిందో అర్థమయ్యింది. రాని కొడుకు కన్నా క్రమం తప్పకుండా వచ్చే పక్షులే తనకు వారసులు అనుకుని ఉంటుంది.
“ఆ భూమి పల్లంలోనే ఉంది కదా. మేమే ఇంకొంచెం తవ్వి చెరువులా చేసి ఉన్న చెరువు నుండి ఆ పొలానికి నీళ్లు పారేలా ఏర్పాటుచేశాం”
రావిచెట్టు చుట్టూ చేసిన చప్టా మీద కూర్చుని ఉన్నారు కొందరు యువకులు. షార్ట్స్, టీ షర్ట్ వేసుకున్న ఒకతను కుర్చీలో కూర్చుని.. ల్యాప్‌టాప్‌లో పనిచేసుకుంటూ మధ్యమధ్యలో మాట్లాడుతున్నాడు. బెంజ్ కారు యజమాని అయ్యుంటాడు. భాను.. చంద్రకాంత్‌ని పరిచయం చేశాడు అందరికీ.
“చస్! మళ్లీ నెట్వర్క్ డౌన్” విసుక్కున్నాడు బెంజ్.
“ఒరే! మనూళ్లో ఏ వార్తయినా క్షణాల్లో పాకిపోద్ది. మాకు నెట్వర్క్ ఎందుకురా” అన్నాడు ఒకడు.
అందరూ నవ్వారు. ఇలాంటి వెటకారాలే పల్లెలకు మిగిలిన అలంకారాలు.
“అమ్మవాళ్లను అమెరికా రమ్మంటే రారు. ఈ ఐదేళ్లలో ఒక్కసారే వచ్చారు” అన్నాడు.
“దేవుడి విగ్రహం సంవత్సరంలో ఒక్కపాలే మన ఇళ్ల కాడికి వస్తాదిరా! మనమే రోజూ గుడికి పోవాలె” అన్నాడు భాను.
“శశాంక్గాడు వచ్చి కూడా మూడేళ్లయితలే. పక్షులు వచ్చిన రెండో సంవత్సరం వచ్చినాడు అంతే!”
“పక్షుల్ని చూడటానికి వచ్చినారా సార్” చంద్రకాంత్‌ని అడిగాడు ఒకతను.
“సమయానికి వచ్చినారు. రేపు చాలా మటుకు పక్షులు ఎల్లిపోతయి. ఈ పక్షులు, ఈ సందడి అంతా మా భాను పుణ్యమే”
పక్షులు రావడం గమనించి భానుయే చొరవ తీసుకుని ఊళ్లో వాళ్లను ఒప్పించడంతో వాటి సంరక్షణ, అవి గూళ్లు పెట్టుకోవడానికి వీలుగా చెట్లు పెంచడం, చెరువులోకి చేప పిల్లల్ని వదలడం ఇలా అన్ని పనులూ చేశారు. ప్రతి సంవత్సరం చెరువులో పెరిగే నాచు, డెక్కని శుభ్రం చేయిస్తాడు. తర్వాత అటవీశాఖ వాళ్ల వెంటపడితే ఈ సౌకర్యాలన్నీ కల్పించారు. గోరంత చేస్తే కొండంత చెప్పుకొనే ఈ రోజుల్లో భాను తనతో ఒక్కమాట కూడా అనకపోవడం..
“అవునా భానుగారూ!” చంద్రకాంత్ ఆశ్చర్యపోయాడు.
ఎదుటివారి గురించి చటుక్కున ఒక అభిప్రాయానికి రావడం ఎంత తప్పో తెలిసివచ్చింది చంద్రకాంత్‌కి. పెద్దగా చదువు అబ్బని యువతే పల్లెల్లో ఉండిపోతున్నారని అనుకునేవాడు. భాను అలాగే ఊళ్లోనే ఉండిపోయి వ్యవసాయం చేస్తూ దగ్గర్లో ఉన్న మండలంలో వీడియో షాప్ పెట్టుకున్నాడని అనుకున్నాడు. కానీ, భాను బీఎస్సీ అగ్రికల్చర్ చేశాడని తెలిసి ఆశ్చర్యపోయాడు. ప్రయత్నిస్తే ప్రభుత్వ శాఖల్లోనో, బ్యాంక్‌లోనో మంచి ఉద్యోగమే వచ్చేది.
“నేను ఈ ఊరు వదిలి వెళ్లలేను సార్. అది నా బలమో, బలహీనతో తెలియదు. ఇక్కడ ఉంటే నా జీవితం మీద నాకు పూర్తి అధికారం ఉన్నట్టుగా అనిపిస్తుంది. పక్షులపై ఎవరి నియంత్రణా లేనట్టే. మా ఇల్లు ఇక్కడే ఉంది. మీకు పట్నాల్లో దూరంగా ఉంటాయే.. అలా మా ఊరే నాకు ఫామ్ హౌస్”
ఎంతమందికి దక్కుతుంది ఆ అదృష్టం?
పండగకో, పబ్బానికో, శుభకార్యానికో, పలకరింపులకో వచ్చిన వాళ్లు తమ వలస ప్రదేశానికి తిరుగు ప్రయాణం అవుతారు. వలస వచ్చిన పక్షులు తమ తమ స్వస్థలాలకు తిరిగివెళ్లే సమయం వచ్చింది.
ఊరి జనమంతా సరస్సు వద్ద గుమిగూడారు.
రంగురంగుల పువ్వులు ఆకాశంలోకి ఎగరేసినట్టుగా వందలాదిగా పక్షులు గుంపుగా పైకి ఎగిరాయి. మనుషుల్లా వాటికి ట్రాఫిక్ పోలీస్ అవసరం లేదు. అవి చేసే శబ్దాలు ఆతిథ్యం ఇచ్చిన గ్రామస్తులకు ధన్యవాదాలు తెలుపుతున్నట్టుగా ఉన్నాయి. పక్షులు వలస వచ్చిన సంవత్సరం వర్షాలు బాగా కురుస్తాయని, పంటలు బాగా పండుతాయని వాళ్లకు ఒక నమ్మకం.
తమ ఊరికి జలకళనే కాక; కన్నబిడ్డలు, బంధువులు, పర్యాటకుల్ని సందర్శింపచేసి జనసంద్రపు కళని కూడా ప్రతి శీతకాలం క్రమం తప్పకుండా తీసుకువస్తున్న పక్షులు పితృదేవతల్లా అనిపిస్తాయి. అందుకే చేతులెత్తి నమస్కారాలు చేశారు. చంద్రకాంత్ తిరుగు ప్రయాణమయ్యాడు.
“మళ్లీ తప్పకుండా రా బాబూ”
“మీరు రమ్మనాలే కానీ ప్రతి సంవత్సరం వస్తా బాబాయ్‌గారూ” అన్నాడు చంద్రకాంత్.
భాస్కరంగారు చేతులు పట్టుకున్నారు. మాట రాలేదు. చంద్రకాంత్ వద్దంటున్నా టౌన్లో బస్ ఎక్కిస్తానని తనూ ఆటో ఎక్కాడు భాను.
“మీదీ పల్లెటూరేనా సార్?” భాను ప్రశ్నకి తల ఊపాడు చంద్రకాంత్.
“ఎప్పుడైనా వెళ్తుంటారా?”
ఈ రెండురోజుల నుండి తమ ఊరు గుర్తుకువస్తూనే ఉంది చంద్రకాంత్‌కి. వెళ్లినప్పుడల్లా పని ఉన్నా లేకపోయినా ఊరంతా కాలినడకన అన్ని వీధులూ తిరిగి వచ్చేవాడు. సరిగ్గా పదిహేను నిమిషాలు పట్టదు. నిదానంగా ఒక్కో వీధిలో అన్ని ఇళ్లూ చూసుకుంటూ, తెలిసినవాళ్ల దగ్గర ఆగి కబుర్లాడేవాడు.
‘నువ్వు మాత్రం యాడున్నా.. పెతీ సంకురేత్తిరికీ వస్తావు చంద్రం’ అనేవాళ్లు.
ఊరెళ్లేసరికి జుత్తు పెరిగేలా చూసుకుని తెలిసిన సెలూన్‌కి వెళ్లి ఇష్టంగా తల అప్పగించేవాడు. అవసరం ఉన్నా లేకపోయినా దర్జీ దగ్గర ఒక జత బట్టలు కుట్టించుకునేవాడు. జనంతోపాటు షాపులో దండెం మీద వేలాడే బట్టలు కూడా తగ్గిపోతుండేవి. ఉన్న కొద్దిమంది కుర్రాళ్లు రెడీమేడ్కి అలవాటు పడ్డారు. చదువుకున్న బడిని చూసి; బల్లల్ని, గోడల్ని తడిమి, ఊళ్లో ఉన్న మాస్టారు గారింటికి వెళ్లేవాడు.
శివాలయంలో తక్కువ ఎత్తులో ఉండే గర్భగుడి- దేవుడి ముందు తలవంచుకుని ఉండాలని చెప్పేది.
ఈత కొడుతున్న పిల్లల్లాగే ఉత్సాహంతో ఉరకలెత్తే పిల్లకాలువ. ఊళ్లో సంక్రాంతి తిరుణాళ్లు ముంబైలో పెట్టే ఎగ్జిబిషన్లో వందోవంతు కూడా ఉండదు. కానీ వెయ్యి రెట్లు ఎక్కువ ఆనందాన్నిచ్చేది. సెలూన్ కృష్ణ, దర్జీ రాంబాబు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో? పూజారిగారు ఇప్పుడు ఏ గుడి పంచన చేరారో?
టిఫిన్ సెంటర్ మల్లమ్మ.. కూతురు దగ్గరికి గుంటూరు వెళిపోతానంది. ఒక్కో కుటుంబం ఊరు వదిలి వెళిపోతూ ఉంటే.. పల్లె నగ్నమౌతున్నట్టు, దగ్ధమౌతున్నట్టు దుఃఖం పొంగిపొర్లేది. పంజరంలో బంధించబడిన పక్షుల్లా.. తన ముంబై ఫ్లాట్‌లో తల్లిదండ్రులు. కాలేజ్ సెలవులప్పుడే కాదు, ఉద్యోగంలో చేరాక సెలవు పెట్టి ఊరికి వెళ్లినప్పుడు తిరిగి వెళ్లే సమయంలో మనసంతా దిగులు కమ్మేసేది. ఇప్పుడు అదే మానసిక స్థితిలో ఉన్నాడు. భాను అడిగిన ప్రశ్న గుర్తుకు వచ్చి ఆలోచనల్లోంచి తేరుకున్నాడు.
“మా ఊరికా? వెళ్లాలనే ఉంటుంది. కానీ ఊరే లేదు” అన్నాడు భారంగా.
“అదేంటి?” అడిగాడు భాను విస్తుపోతూ.
“పోలవరం ముంపు గ్రామాల్లో మాదీ ఒకటి”.. ప్రతి పల్లె అనుభవిస్తున్న ఆర్తిని ప్రతిఫలిస్తూ చంద్రకాంత్ కళ్లల్లో నీటితెర. ఊరు ఎదురుచూస్తున్నా.. మనిషి రాడు. మనిషి వెళ్దామనుకున్నా.. ఊరు లేదు. భుజం మీద అనునయంగా చెయ్యి వేశాడు భాను.
వలసలతో ఖాళీ అవుతున్న పల్లెలు అనుభవిస్తున్న ‘ఆర్తి’ని.. ఈ కథతో కళ్లకు కట్టారు రచయిత అనిసెట్టి శ్రీధర్. ఈయన స్వస్థలం నరసరావుపేట. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో చీఫ్ మేనేజర్‌గా పదవీ విరమణ చేశారు. 1990లో కథలు రాయడం మొదలుపెట్టారు. 2008లో 15 కథలతో వేసిన ‘కొత్త బంగారులోకం’ సంపుటిని కారా మాస్టారు ఆవిష్కరించారు. ఆ తర్వాత మరో 28 కథలు ప్రచురితమయ్యాయి. గత మూడేళ్లుగా సామాజిక మాధ్యమాల్లో చిన్న కథలు, గల్పికలు, హాస్య-వ్యంగ్య రచనలు వందకి పైనే వచ్చాయి. 2011లో ‘నివేదన’ కవితా సంపుటిని తీసుకొచ్చారు.
వీరి కథలు ఆదివారం ఆంధ్రజ్యోతి, ఇండియాటుడే, రచన, స్వాతి, సాక్షి ఫన్డే, నవ్య, విపుల, ఈమాట తదితర పత్రికలలో వచ్చాయి. మరికొన్ని హిందీ, మరాఠీ, ఆంగ్లం, తమిళంలోకి అనువాదమయ్యాయి. వీరి రెండో కథ ‘పాతసామాను’కు ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధం నిర్వహించిన ఉగాది కథల పోటీ (1991)లో ప్రథమ బహుమతి దక్కింది. ‘మద్దతు’ కథకు రచన పత్రిక ద్వారా కథాపురస్కారం, ‘జనజీవన స్రవంతి’ కథకు విపుల మాసపత్రిక అవార్డు లభించింది. ఇక ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం- అనూస్ హాస్టల్స్ నిర్వహించిన కథల పోటీలో ‘శాహా వర్సెస్ మాహా’ కథకు రూ.పదివేలు ప్రైజ్‌మనీ అందుకున్నారు.