ఎప్పుడూ నవ్వుతూ ఉండండి.. మీ ఎమోషన్స్‌ని ఎక్స్‌ప్రెస్ చెయ్యొద్దు, దాచుకోండి.. జరిగేదంతా మీ మంచికే అనుకోండి… ఇవీ పాజిటివ్ థింకింగ్ గురించి మోటివేషనల్ స్పీకర్స్, కోచ్‌లు చెప్పే మాటలు. ఓ రకంగా వారు చెప్పేది మంచిదే! కానీ, సైకాలజీ దీనికి రెండో కోణం గురించి చెబుతుంది. అదే టాక్సిక్ పాజిటివిటీ. అన్ని పరిస్థితుల్లో పాజిటివ్‌గా ఉండాలనుకోవడం, సహజమైన ఎమోషన్స్‌ను తిరస్కరించడమే టాక్సిక్ పాజిటివిటీ. దీని వల్ల కలిగే అనర్థాలు ఏంటో చూద్దాం.
ఏపరిస్థితిలోనైనా, ఎంత కష్టంలోనైనా కేవలం సానుకూల ఆలోచనలు మాత్రమే ఉండాలని పట్టుబట్టడాన్ని ‘టాక్సిక్ పాజిటివిటీ’ అంటారు. బాధ, కోపం, భయం లాంటి సహజమైన మానవ భావోద్వేగాలను పూర్తిగా తిరస్కరించి, కేవలం ‘అంతా మంచే జరుగుతుంది‘, ‘పాజిటివ్‌గా ఉండు’ అని బలవంతంగా నమ్మడం ఇందులో భాగం. సరళంగా చెప్పాలంటే నిజాన్ని అంగీకరించకుండా, నకిలీ ఆనందాన్ని ప్రదర్శించడం అన్నమాట.
సానుకూలత పేరుతో మనం భావోద్వేగాలను అణచివేస్తే, అది మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అది ఇలా ఉంటుంది.
అపరాధ భావం: కష్టాల్లో ఉన్నప్పుడు కూడా పాజిటివ్‌గా ఉండలేకపోతున్నాననే భావన వ్యక్తుల్లో అపరాధ భావాన్ని కలిగిస్తుంది.
భావోద్వేగాల అణచివేత: బాధను బయటపెట్టకుండా లోపల దాచుకోవడం వల్ల అది భవిష్యత్తులో తీవ్రమైన ఒత్తిడి, డిప్రెషన్‌కు దారితీయవచ్చు.
ఒంటరితనం: బాధలో ఉన్నప్పుడు ఎదుటివారు ‘పాజిటివ్‌గా ఉండు’ అని అంటే, ఆ వ్యక్తికి తనను ఎవరూ అర్థం చేసుకోవడం లేదనే ఒంటరి భావన కలుగుతుంది.
పరిష్కారానికి దూరం: సమస్యను అంగీకరించకుండా కేవలం సానుకూలంగా ఉంటే సరిపోతుందని అనుకుంటే, అసలు సమస్యకు పరిష్కారం దొరకదు.
టాక్సిక్ vs రియల్
స్నేహితులో, బంధువులో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు అనునయించే సమయంలో టాక్సిక్ పాజిటివిటీ, రియల్ పాజిటివిటీ ఎలా ఉంటాయో చూద్దాం.
టాక్సిక్: అంతా మంచే జరుగుతుంది, బాధపడకు.
రియల్: నువ్వు బాధపడటం సహజం, నేను నీకు తోడుంటాను.
టాక్సిక్: నెగటివ్‌గా అస్సలు ఆలోచించకు.
రియల్: నీకు ఎందుకు అలా అనిపిస్తుందో నాకు
అర్థమవుతున్నది.
టాక్సిక్: నీ కంటే తక్కువ ఉన్నవాళ్లని చూడు.
రియల్: ఇది నీకు కష్టమైన సమయమే, దీనిని అధిగమించగలవు.
భావోద్వేగ నియంత్రణ అనేది ఒక నైపుణ్యం అని మనం గుర్తించాలి. భావోద్వేగ నియంత్రణలో ఎమోషనల్ సప్రెషన్, కాగ్నిటివ్ రీ-అప్రైజల్ అనేవి రెండు విభిన్నమైన పద్ధతులు. వీటి మధ్య తేడాలను అర్థం చేసుకోవడం వల్ల మనం ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో స్పష్టత వస్తుంది.
ఇది రెస్పాన్స్-ఫోకస్డ్ పద్ధతి. అంటే భావోద్వేగం కలిగిన తర్వాత దానిని బయటికి రాకుండా ఆపడం. బాధ, కోపం లేదా భయం కలిగినప్పుడు ముఖంలో ఆ భావం కనిపించకుండా బలవంతంగా దాచుకోవడం. ఉదాహరణకు ఆఫీసులో బాస్ తిట్టినప్పుడు లోపల కోపం ఉన్నా, ఏమీ తెలియనట్లు నవ్వుతూ ఉండటం.
ప్రభావం: ఇది స్వల్పకాలికంగా పని చేసినట్లు అనిపించినా, దీర్ఘకాలంలో హానికరం. భావాలను లోపలే నొక్కడం వల్ల గుండె వేగం పెరగడం, రక్తపోటు పెరగడం వంటి శారీరక మార్పులు జరుగుతాయి. ఇది మానసిక అలసటను కలిగిస్తుంది.
ఇది యాంటిసిడెంట్-ఫోకస్డ్ పద్ధతి. భావోద్వేగం తీవ్రం కాకముందే ఆ పరిస్థితిని చూసే దృక్పథాన్ని మార్చుకోవడం. జరిగిన విషయాన్ని మరో కోణంలో ఆలోచించడం. ఉదాహరణకు ఒక స్నేహితుడు మీకు మెసేజ్ చేయకపోతే, ‘అతను నన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడు’ అని బాధపడటానికి బదులు, ‘అతను పనిలో బిజీగా ఉండి ఉండవచ్చు’ అని సానుకూలంగా ఆలోచించడం.
ప్రభావం: ఇది అత్యంత ప్రభావవంతమైన పద్ధతి. దీనివల్ల అసలు ప్రతికూల భావోద్వేగం పుట్టదు లేదా దాని తీవ్రత తగ్గుతుంది. ఇది మానసిక దృఢత్వాన్ని పెంచుతుంది.
టాక్సిక్ పాజిటివిటీకి ప్రత్యామ్నాయంగా మనస్తత్వవేత్తలు ట్రాజికల్ ఆప్టిమిజంను సూచిస్తారు. దీని అర్థం జీవితంలో కష్టాలు, నష్టాలు ఉన్నాయని అంగీకరిస్తూనే వాటి మధ్యలో కూడా అర్థాన్ని, ఆశను వెతుక్కోవడం. ఉదాహరణకు నువ్వు ఫెయిల్ అయ్యావా? పర్వాలేదు, ఎప్పుడూ నవ్వుతూ ఉండు అని చెప్పడం టాక్సిక్ పాజిటివిటీ. నువ్వు ఫెయిల్ అయినందుకు బాధగా ఉందని నాకు తెలుసు. అది చాలా కష్టమైన విషయం. కొంచెం సమయం తీసుకో, ఆ తర్వాత మనం మళ్లీ ఎలా ప్రయత్నించాలో ఆలోచిద్దాం అని చెప్పడం ట్రాజికల్ ఆప్టిమిజం.
టాక్సిక్ పాజిటివిటీని ఎదుర్కోవడం, భావోద్వేగాలను ఆరోగ్యకరమైన రీతిలో నియంత్రించుకోవడం నిరంతర ప్రక్రియ. దీని కోసం మీరు కొన్ని పద్ధతులు అనుసరించాలి.
భావోద్వేగాలను అంగీకరించడం: టాక్సిక్ పాజిటివిటీకి విరుగుడు ‘అంగీకారం’. ఏదైనా కష్టం వచ్చినప్పుడు వెంటనే ‘నేను పాజిటివ్‌గా ఉండాలి‘ అని మిమ్మల్ని మీరు ఒత్తిడి చేసుకోవద్దు. ‘ప్రస్తుతం నేను బాధగా ఉన్నాను! అయినా ఫర్వాలేదు‘ అని మీకు మీరు చెప్పుకోండి. భావోద్వేగాలు అనేవి సముద్రపు అలల లాంటివి. అవి వస్తాయి, పోతాయి. వాటిని ఆపడానికి ప్రయత్నించకండి.
జర్నలింగ్: మీ మనసులోని భావాలను కాగితంపై పెట్టడం వల్ల ‘ఎమోషనల్ సప్రెషన్’ తగ్గుతుంది. మీకు కలిగే నెగటివ్ ఆలోచనలను ఏ మాత్రం ఫిల్టర్ చేయకుండా రాయండి. ఇది మీ మెదడులోని ఒత్తిడిని తగ్గించి, పరిస్థితిపై మీకు స్పష్టతనిస్తుంది.
మైండ్‌ఫుల్‌నెస్: భావోద్వేగాలు మన శరీరంలో ఎక్కడో ఒక చోట వ్యక్తమవుతాయి. గుండెలో బరువుగా ఉండటం, గొంతులో ఏదో అడ్డుపడినట్లు అనిపించడం అలా. ఆ సమయంలో కళ్లు మూసుకుని గాలి పీలుస్తూ, ఆ శారీరక స్పందనను గమనించండి. దానితో పోరాడకండి. ఇది మీ నాడీ వ్యవస్థను శాంతింపజేస్తుంది ఎమోషన్స్ ఉండటం తప్పు కాదు అని గుర్తుంచుకోండి. మీ ఎమోషన్స్‌ను ఎంత ఎక్కువగా గౌరవిస్తే, అంత త్వరగా వాటి నుంచి బయటపడగలరు. జీవితం అంటే ఎప్పుడూ నవ్వుతూ ఉండటం కాదు. అన్ని రకాల భావోద్వేగాలను అనుభవించడమే అసలైన మనిషి లక్షణం అని గుర్తుంచుకోండి.