రీల్స్, షాట్స్, మీమ్స్.. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి!! ఫ్రెండ్స్.. పీర్ గ్రూపు నుంచి నిత్యం నోటిఫికేషన్స్!! అన్నీ చూడటం.. స్పందించడం!! ఇదో నిరంతర ప్రక్రియ. ఈ నేపథ్యంలో ఆన్లైన్లో మనల్ని మనంఎలా ప్రజెంట్ చేసుకుంటున్నాం? ఎలా నియంత్రించుకుంటున్నాం? సమాధానం సంతృప్తికరంగా లేదు కదా!! సామాజిక మాధ్యమాల్లో పట్టుతప్పి వ్యవహరిస్తుండటమే ఇందుకు కారణం! అలా ఫీల్ కావొద్దంటే.. డిజిటల్
దునియాలో మనసా, వాచా, కర్మణా నడుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు పద్ధతిగా స్పందిస్తే చాలు.. డిజిటల్ దారిలో త్రికరణ శుద్ధిగా సాగిపోవచ్చు.వినికిడి, దృష్టి, స్పర్శ, రుచి, వాసన జ్ఞానేంద్రియాలు చేసే పనులు. మాట్లాడటం, పనులు చేయడం, నడవడం, విసర్జన, పునరుత్పత్తి ఇవి కర్మేంద్రియాల పనులు. డిజిటల్ దునియాలో జ్ఞానేంద్రియాలు చూడటం, వినడం, తెలుసుకోవడం లాంటి
పనులు చేస్తాయి. ఇక మనం ఆన్లైన్లో చేసే చర్యలు అదేనండి పోస్టులు, షేర్లు, కామెంట్స్ కర్మేంద్రియాల పనుల కిందికి వస్తాయి.
డిజిటల్ జ్ఞానేంద్రియాలు
ఎప్పుడైతే మన ఇంద్రియాలపై పట్టు కోల్పోతామో కనిపించిన ప్రతి అంశమూ ప్రభావితం చేస్తుంది. ఫేక్ అని తెలిసినా ఆకర్షణకు లోనవుతాం. అంటే.. తప్పని తెలిసినా తప్పదన్నట్టు తప్పుదోవలో పయనిస్తాం. ఎప్పుడైతే అది వ్యసనంగా మారుతుందో.. అందుకు తగిన ఇంటర్‌ఫేస్‌లను వెతుకుతాం. ఇవి మన డిజిటల్ జ్ఞానేంద్రియాలను ఓవర్‌లోడ్ చేసి, మనల్ని ఫోన్‌కి, వర్చువల్ లైఫ్‌కి బానిసలను చేస్తాయి. మన బలహీనతలను క్యాష్ చేసుకునేలా ప్రకటనలు వెల్లువెత్తుతుంటాయి. దీనికి విరుగుడు మన చేతల్లోనే ఉంది. మనం డిజిటల్ దునియా నుంచి ఏం తీసుకుంటున్నాం? ఏం ఇస్తున్నాం? అనేది ముఖ్యం. ఆన్లైన్లో మనం ఏం చూస్తున్నాం అనే దానిపై అవగాహన ఉండాలి. మీరు చూసిన సమాచారం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు చెప్పారు? ఎంతసేపు దానిపై దృష్టి పెట్టారు? ఇవన్నీ మీకు మీరే విశ్లేషించుకోవాలి.
డిజిటల్ కర్మేంద్రియాలు
కర్మ గాడి తప్పితే.. విచక్షణ లేని యాక్షన్స్ చోటు చేసుకుంటాయి. దీంతో ఫేక్ వరల్డ్‌లోకి ఎంటర్ అవుతాం. ఇక వెనకా ముందు చూసుకోం. వాస్తవాలు పట్టించుకోం. ఆపద గురించి ఆలోచించం. రిస్కుతో కూడిన డౌన్లోడ్లు/అప్లోడ్లు చేస్తుంటాం. ఇవి మీ వ్యక్తిగత డేటాకు ముప్పు తెస్తాయి. దీనికి విరుగుడు ఏంటంటే.. ఆన్లైన్లో ఏదైనా చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. మీరు చేసే ప్రతి లైక్, పోస్ట్, కామెంట్ డిజిటల్ ప్రపంచంలో మీ అడుగుజాడను వదిలి వెళ్తుంది. మీ చర్యలు ఉద్దేశపూర్వకంగా, గౌరవంగా, గోప్యతను గౌరవించేలా ఉండాలి. మన ప్రాచీన తత్వశాస్త్రం స్వీయ అవగాహన గురించి చెబుతుంది. నైతికతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. నేటి డిజిటల్ యుగంలో ఈ సూత్రాలు చాలా అవసరం. డిజిటల్ జ్ఞానేంద్రియాలు మనం ఏం తీసుకుంటున్నామో స్పృహ కలిగి ఉండాలి. డిజిటల్ కర్మేంద్రియాలు బాధ్యతతో వ్యవహరించాలి. చివరిగా, డిజిటల్ భద్రత అనేది కేవలం టెక్నాలజీ గురించి కాదు.. మన ప్రవర్తనకు సంబంధించింది. బాధ్యతాయుతమైన డిజిటల్ పౌరుడిగా మారాలంటే, కంటెంట్‌ను ఎలా స్వీకరించాలి, ఎలా పంచుకోవాలి అనే దానిపై త్రికరణ శుద్ధిగా వ్యవహరించడం తప్పనిసరి.
-అనిల్ రాచమల్ల వ్యవస్థాపకులు
ఎండ్‌నౌ ఫౌండేషన్