శిఖరాలు చేరాలంటే సాహసాలు చేయాలి. ప్రాణాలను పణంగాపెట్టి కొండంచుకు చేరుకోవడం ఓ గొప్పఅనుభూతిని ఇస్తుంది. కానీ, మంచుకొండల్లో.. అడుగు ముందుకు వేయలేని క్షణాల్లో వెనక్కి తగ్గడం కూడా వీరత్వమే అనిపించుకుంటుంది. ముందుకుదారి తోచని పరిస్థితుల్లో తిరుగు ప్రయాణం కూడాభీతిగొలిపేలా ఉంటుంది. మియర్ లోయ సాహస యాత్రలో చావు అంచుదాకా వెళ్లొచ్చి,బతికి బయటపడ్డ సాహసికుల యాత్రానుభవం అదే!
హిమాలయాల అందాన్ని మాటలతో చూపలేం. అన్నీ మంచుదుప్పటి కప్పుకొన్న పర్వతాలే. శిఖరాల ఎత్తుల్లో వ్యత్యాసాలు ఉన్నట్టే… ప్రతీ లోయ ఓ ప్రత్యేకమైన సౌందర్యంతో పర్యాటకులకు కొత్త అనుభూతిని పంచుతాయి. అలాంటి లోయల్లో మియర్ ఒకటి. ఇది హిమాచల్‌ప్రదేశ్‌లోని మారుమూల ప్రాంతంలో ఉంది. ఎగుడుదిగుడు పర్వతాల హిమాలయాల్లో విశాలమైన మైదానాలు కనిపిస్తే పర్యాటకులు చిన్నపిల్లలై పోతారు. మియర్ లోయలో విశాలమైన మైదానం ఉంది. మూడు వైపులా ఎత్తయిన గిరులు. వాటి మధ్య విశాలమైన మైదానం. అందులో విస్తరించిన అడవి, వనంలో విరిసిన పూల సొగసు అదనం. మియర్ లోయను చూస్తే అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న యొసెమైట్ నేషనల్ పార్క్లాగే ఉంటుంది. అందుకే దీనిని ‘యొసెమైట్ ఆఫ్ హిమాలయాస్’ అని కూడా పిలుస్తారు. ఈ అందాలన్నీ చూడాలని ఎంతోమంది పర్యాటకులు మియర్ లోయకు వెళ్తుంటారు. ఆ లోయలో విహారంతోపాటు, అక్కడి గిరుల అంచులు తాకాలని నేను, వేర్వేరు ప్రాంతాలకు చెందిన నా స్నేహితులు దాదా బెనర్జీ, అరుణ్ నందా, మమతా జోషి గతేడాది అక్టోబర్‌లో మియర్ లోయ పర్యటనకు వెళ్లాం.
మంచు దారుల్లో…
హిమపాతంలో దారి వెతుక్కుంటూ ఒక్కో అడుగు ముందుకు వేస్తూ కదిలాం. మా భుజాలపై టెంట్లు, వంట సామాన్లు, ఆహారం, అత్యవసర సామాగ్రి, మందులున్నాయి. అలవికాని దారిలో మోయలేని బరువును మోస్తూ ముందుకుసాగాం. అనుకున్నట్టే బేస్ క్యాంప్ చేరుకున్నాం. అరుణ్ అనారోగ్యం బారినపడ్డాడు. అక్కడి నుంచి తను తిరుగు పయనమయ్యాడు. మేం అడ్వాన్స్ బేస్ క్యాంప్ వైపుగా కదిలాం. ఒకరు వెనుదిరగడం వల్ల మోయాల్సిన బరువు ఇంకొంచెం పెరిగింది. కష్టమే అయినా సాహసంతో ఆ భారం మోస్తూ అడ్వాన్స్ బేస్ క్యాంప్‌కి చేరుకున్నాం. అక్కడ టెంట్లు ఏర్పాటు చేసుకున్నాం. ప్రయాణం ఇలాగే సాగితే శిఖరాలకు చేరుకుంటామనే సంతోషంలో ఉన్నాం. కానీ, మా ఆనందాన్ని శీతల పవనాలు గజగజా వణికించాయి. ఒక్కసారిగా వాతావరణం ప్రతికూలంగా మారిపోయింది. పడమర నుంచి వీచే గాలులు దట్టమైన మేఘాలను మోసుకొచ్చాయి. ఉరుములు భయపెట్టాయి. తెల్లవారుజామున మంచు కురిసింది. తెల్లారేసరికి ఆకాశం కొంత తెరపిచ్చింది. మళ్లీ ప్రయాణం మొదలుపెట్టాం. రెండు రోజులు ప్రయాణించి సముద్ర మట్టానికి 4,420 మీటర్ల ఎత్తులో ఉన్న క్యాంప్-1(C-1)కి చేరుకున్నాం.
వెనుదిరిగిన సాహస యాత్ర
మాకు అతిపెద్ద పరీక్ష అక్కడే ఎదురుగా ఉంది. పర్వతాలు 80 డిగ్రీల కోణంలో నిటారుగా ఎత్తైన గోపురాల్లా ఉన్నాయి. అందుకే ఈ పర్వతాలను చేరుకునే దారిని ‘గల్లీ ఆఫ్ డూమ్’ అని పిలుస్తారు. పర్వతాలపై ఉన్న రాళ్లు కొంత సడలినట్లుగా ఉన్నాయి. మొరంతో ఉన్న ఆ దారిలో కాలు జారితే… దొర్లుకుంటూ లోయలోకి జారి, మంచులో కలిసిపోవాల్సిందే. బరువులు మోస్తూ, నిట్టనిలువుగా ఉన్న దారిలో నడుస్తూ ఆలసిపోయాం. అయినా బలాన్ని కూడదీసుకుని ముందుకు సాగుతున్నాం. ప్రతికూల వాతారణంలో శిఖరాగ్రానికి చేరడం ప్రాణాంతకంగా తోచింది. మంచుకొండ చరియలు విరిగిపడొచ్చు. మంచు ఫలకాల మధ్య అగాధాలపై తాజాగా పరుచుకున్న మంచు వల్ల తప్పటడుగు వేసే ప్రమాదం ఉంది. ఇది అడుగు ముందుకు వేయడానికి ఏమాత్రం క్షేమకరమైన సందర్భం కాదని మా కెప్టెన్ భావించాడు. ఇక్కడి నుంచి వెనక్కి మరలాలనే తెలివైన నిర్ణయం తీసుకున్నాడు. బేస్ క్యాంప్‌కు తిరుగు ప్రయాణం మొదలుపెట్టాం.
పెద్ద పెద్ద రాళ్లకు తాడు కట్టి కిందికి జారుతూ (ర్యాప్లింగ్) వేగంగా కిందికి వచ్చే ప్రయత్నం చేశాం. అరవై డిగ్రీల వాలున్న కొండపై నుంచి కిందికి దిగుతుంటే.. కొండ చరియలు విరిగిన శబ్దం వినపడింది. ఇక నా పనై పోయిందనుకున్నాను స్పృహ తప్పిపోయాను. పన్నెండు అడుగులు కిందికి జారిపడ్డాను. మంచులో కూరుకుపోయే సరికి బూట్లలోకి నీరు చేరింది. రక్తాన్ని గడ్డకట్టించే ఆ చల్లదనానికి కాళ్లు మొద్దుబారాయి. నా సహ యాత్రికులు సరైన సూచనలతో నన్ను కాపాడి, ముందుకు నడిపించారు. వాకీటాకీ ద్వారా దాదా సూచనలు చేస్తూ ఆందోళనలో ఉన్న నన్ను ప్రశాంతపరిచారు. శిక్షణ, క్రమశిక్షణ గల వ్యక్తి సంభాషణ ఆపత్కాలంలో ఎంత మేలు చేస్తుందో నాకు తెలిసొచ్చింది.

మంచుపాలైన జీవితం
స్నో స్టేక్స్ ఊతంతో, రాళ్లకు బౌలైన్ యాంకర్లు వేసుకుంటూ, వరుసగా రాపెల్స్ చేస్తూ మా ప్రయాణం కిందికి సాగుతున్నది. అడ్వాన్స్ బేస్ క్యాంప్ చేరుకున్నాం. విపరీతమైన చలికి శరీరం మొద్దుబారింది. బాగా అలసిపోయాం. అడుగు వేయలేకున్నాం. ఒకవైపు చీకటి పడుతున్నది, మరోవైపు పొగమంచుతో దారులన్నీ మూసుకుపోయినట్టయింది. దారి తప్పిపోయాం. మా టెంట్ల జాడ కోసం తిరిగి తిరిగి అలసిపోయాం. మా నడక శరీరాన్నే కాదు మనసునీ పరీక్షించింది. ఇంకా అడుగువేయలేం అనుకుంటుండగా.. ‘మనం చేరుకున్నాం’ అంటూ మమత అన్న మాటలు మాకు ఊరటనిచ్చాయి. తను గుర్తించిన టెంట్లకు చేరుకున్నాం. కానీ ఏం లాభం? ఆశ్రయమే ఉంది. ఇంధనం, బ్యూటేన్ సిలిండర్లు మంచుపాలయ్యాయి. ఎనర్జీ జెల్స్ మాత్రమే మిగిలిపోయాయి. తడిచిన స్లీపింగ్ బ్యాగుల్లో ఆ రాత్రి పడుకున్నాం. ఈ ప్రయాణంలో ‘టెంట్ కట్టిన రాయి స్థిరంగా ఉన్నదా? సడలిపోతే ఏమిటి పరిస్థితి?’ అనే సందేహం ఎప్పుడూ వెంటాడేది. ‘పడుకున్న చోటు గడ్డకట్టిన వాగు కాదు కదా?’ సందేహంతోనే నిద్రలోకి జారుకున్నాం. మేకల మైదానాల్లో నక్కలు అర్ధరాత్రి ఊళలు వేస్తూ మా గుండెల్లో భయం పుట్టించేవి.
ఆఖరి ఆశలు
క్షణక్షణం భయంతో గడుపుతున్నప్పుడు ఓ రోజు వాతావరణం కుదిరింది. గ్రామం వైపు పయనమయ్యాం. ఇదే మాకు చివరి ప్రయాణం. కూలిన మంచు వంతెనలు దాటలేక, గడ్డకట్టిన మంచు ఫలకాల్లో కనిపించని చీలికల్లో కాలుమోపి క్లిష్టమైన దారిలో పయనమయ్యాం. కిందామీదా పడుతూ, మంచులో కూరుకుపోతూ.. నడక సాగించాం. అలా నడుస్తూ నడుస్తూ మియర్ స్థూపం దగ్గరికి చేరుకున్నాం. అక్కడ మొబైల్ సిగ్నల్ ఉంటుందని ఆశపడ్డాం. కానీ, దట్టమైన మంచు పవర్ లేకుండా చేసింది. టవర్ పని చేయడం లేదు. ఏమి చేయాలో పాలుపోవట్లేదు. ఆ క్షణంలో ఓ గుర్రం కనిపించింది. పదే పదే విజిల్ ఊదుతూ ఉంటే… శివ అనే అబ్బాయి, వాళ్ల అమ్మ మా దగ్గరకు వచ్చారు. వానకు పంట నష్టపోకుండా కాపాడుకునేందుకు అక్కడికి వచ్చారు వాళ్లు. మమ్మల్ని వారి గుడిసెలోకి తీసుకుపోయారు. ఆశ్రయమివ్వడమే కాదు, వేడి వేడి కిచిడీ పెట్టి కడుపునింపారు. ఆఖరి ఆశలు వదులుకున్న వేళ వాళ్లిద్దరూ మా ప్రాణాలను నిలబెట్టారు. ఖాంజర్ గ్రామ ప్రజలు మమ్మల్ని ప్రేమతో ఆదరించారు.
సాహస సందేశం
ఈ ప్రమాదకరమైన ప్రయాణంలో ఎప్పడూ ఎవరో ఒకరు బతుకు మీద ఆశలు కోల్పోయేవాళ్లు. మిగిలినవాళ్లు ధైర్యం చెబుతూ మరణం అంచున ఉన్నామనే మనసులోని భావన తుడిచేస్తూ ముందుకు నడిపించేవారు. ఒకరికొకరు తోడు, ప్రేరణగా సాగిన మా సాహస యాత్ర శిఖరం చేరడం కంటే జీవితం నిలబెట్టుకోవడమే ముఖ్యమని చెబుతుంది. శారీరక బలం కంటే నిర్ణయాత్మక శక్తే ప్రమాద సమయాల్లో ప్రధానమని ఈ అనుభవం చెప్పింది. మాది విజయ యాత్ర కాదు. కానీ, అంతకన్నా విలువైన జీవితానుభవాల యాత్ర. దృఢమైన సంకల్పం, ఆత్మ విశ్వాసం ఉంటే జీవితంలో ఎదురయ్యే అత్యంత కఠిన పరిస్థితుల నుంచి కూడా బయటపడొచ్చని మా ప్రయాణం ఓ సందేశాన్నిచ్చింది.