కాలం కన్నా వేగంగా మనిషి జీవితంతో ఆడుకుంటున్న వస్తువు ఏదైనా ఉందంటే.. అది డబ్బే! గుండె కూడా లబ్”డబ్బు’ అంటూ నిమిషానికి అరవై కన్నా ఎక్కువసార్లు కొట్టుకుంటుందంటే మనిషికి మనీకి సంబంధం ఎంత స్ట్రాంగో అర్థం చేసుకోవచ్చు. అయితే బతకడానికి డబ్బు కావాలే కానీ, డబ్బే బతుకు కాకూడదు. ఈ సూక్ష్మాన్ని గ్రహించ లేక కొందరు కాసుల వేటలో జీవిత కాలాన్ని కరిగించేసుకుంటారు. ఈ సత్యాన్ని గుర్తించలేక కాణీ సంపాదించకుండా కాలాన్ని భారంగా గడిపేవాళ్లూ ఉంటారు.కానీ, ఈ రెండు వైఖరులూ తప్పే! మన పెట్టుబడి కాలానుగుణంగా వృద్ధి సాధించాలి. అందుకు ఏం చేయాలో? ఈ కొత్త సంవత్సరంలో ఎలా ముందుకు వెళ్లాలో తెలుసుకుందాం..
Money Matters | మనిషి సంపాదనకు గ్యారెంటీ లేదు. జీతభత్యాలు, వ్యాపారంలో లాభాలు పెరిగినంత కాలం ఏ ఇబ్బందీ ఉండదు. కానీ, పరిస్థితులు తారుమారైనప్పుడే డబ్బు విలువ తెలుస్తుంది. రూపాయిని కంటిపాప కన్నా జాగ్రత్తగా చూసుకుంటూ విలువైన జీవితాన్ని కోల్పోతున్నవారు ఎందరో ఉన్నారు. ఎంత కూడబెట్టినా.. ఇంకా ఇంకా సంపాదించాలని పరుగులు తీస్తుంటారు. రాబడి కోసం జీవితాన్ని త్యాగం చేసుకోవద్దు. మనం సంపాదించిన రూపాయి మన కోసం పనిచేసేలా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. అంటే.. మనం పొదుపు, మదుపు చేసిన రూపాయి.. మన జీవితాన్ని కుదుపులకు గురికాకుండా అదుపు చేయగలగాలి. అలా జరగాలంటే దీర్ఘకాలిక ప్రయోజనాలను ఆశించి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అంతేకానీ, క్విక్మనీ రేస్‌లో అదృష్టం పరీక్షించుకుంటానంటే కుదరదు.
రాబోయే లాభాలను దృష్టిలో ఉంచుకొనే ఇన్వెస్ట్ చేస్తారు. నష్టాలు వస్తాయని చెబితే ఎవరూ ఇన్వెస్ట్ చేయరు కదా! లాభం వస్తుందని నమ్మకం ఉంటేనే ముందుకొస్తారు. కానీ, ఆ రిటర్న్ ఎంతన్నది ప్రధానం. మనదేశంలో ద్రవ్యోల్బణం సుమారు ఏడు శాతంగా ఉంటున్నది. అంటే నిత్యావసరాల ధరల్లో ఏటా ఏడు శాతం పెరుగుదల కనిపిస్తుందన్నమాట! ఇంకా చెప్పాలంటే మన ఖర్చులు ప్రతి సంవత్సరం రమారమి ఏడు శాతం పెరుగుతాయి. ఈ మేరకు మన పెట్టుబడిపై వచ్చే రిటర్న్ ఏడు శాతంగానే ఉందనుకోండి.. అప్పుడు మీకు వచ్చే లాభశాతం సున్నా! ద్రవ్యోల్బణం కన్నా తక్కువ శాతం రిటర్న్ వచ్చే ఇన్వెస్ట్మెంట్ వల్ల మీ డబ్బు కరిగిపోతుంది తప్ప.. పెరగదు. అందుకే, మన ఇన్వెస్ట్‌మెంట్‌పై వచ్చే రిటర్న్ ఏడు శాతం కన్నా ఎక్కువగా ఉన్నప్పుడే అది మేలైన పెట్టుబడి అవుతుంది. అప్పుడే మీ రూపాయి మరో రూపాయిని సంపాదిస్తున్నట్టుగా భావించాలి. దీర్ఘకాలం పెట్టుబడి అయితే మ్యూచువల్ ఫండ్స్ మంచి ఎంపిక. కనీసం 14 శాతం రిటర్న్ ఇక్కడ పొందే వెసులుబాటు ఉంటుంది. అపార్ట్మెంట్ ఫ్లాట్ మీద ఇన్వెస్ట్ చేసినా మంచిదే! ప్రతినెలా అద్దె రూపంలో ఆదాయం వస్తుంది! నెలవారీగా ఎలాంటి ఆదాయాన్ని ఇవ్వని స్థలం కన్నా అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకోవడం మంచి పద్ధతి. బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ కూడా 12 శాతం వరకు రిటర్న్ ఇస్తుంది. అయితే బంగారాన్ని బిస్కెట్ రూపంలో, బాండ్ రూపంలో కాకుండా.. ఆభరణాల రూపంలో కొనుగోలు చేయడం అవసరం. ఆ నగలను మీ ఇంట్లోవాళ్లు ధరించినప్పుడు వాళ్లు పొందే ఆనందాన్ని వెలకట్టలేం కదా! ఇలా రకరకాల రూపంలో ఇన్వెస్ట్ చేసి లాభాలు ఆర్జించొచ్చు.
మీ జీవన సౌధానికి హెల్త్ ఇన్సూరెన్స్ పిల్లర్స్ లాంటివి. ఆ తర్వాత మీరు చేసే పెట్టుబడులు స్లాబుల్లాంటివి. పిల్లర్స్ లేకుండా ఎన్ని అంతస్తులు కడితే మాత్రం ఏం ప్రయోజనం? ఒక్క కుదుపుతోనే మీ జీవితం కుప్పకూలిపోతుంది. ముఖ్యంగా ఎగువ మధ్యతరగతి, మధ్యతరగతి, సగటు ఉద్యోగి అందరూ ఆరోగ్య బీమా కాన్సెప్ట్‌ను లోతుగా అర్థం చేసుకోవాలి. పాతికేండ్ల తర్వాత వైద్యానికయ్యే ఖర్చులను అంచనా వేసి.. ఆ మొత్తానికి ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ముందుగా హెల్త్ ఇన్సూరెన్స్, తర్వాత కుటుంబ వ్యవహారానికయ్యే ఖర్చులు ఆ తర్వాతే ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించాలి. లేకపోతే ఊహించని ప్రమాదం జరిగి ఆస్పత్రిపాలైనా, దీర్ఘకాలిక వ్యాధిబారిన పడినా.. మీ కుటుంబం ఆర్థికంగా ఇరవై ఏండ్లు వెనకబడిపోతుందని గుర్తుంచుకోండి. కుటుంబసభ్యులు నలుగురు ఉన్నట్టయితే.. కోటి నుంచి కోటిన్నర రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అవసరం. ఆరోగ్య బీమా విషయంలో పెద్దగా ఆలోచించి.. ఎక్కువ మొత్తానికి తీసుకుంటే మీ భవిష్యత్తుకు భరోసా ఇచ్చినవారు అవుతారు!